ఇసుకాసురుల భరతం పట్టేలా
ABN, Publish Date - Nov 23 , 2024 | 12:56 AM
సహజవనరుల దోపిడీలో చెలరేగిపోయారు. అధికారం అండతో వ్యవస్థలను ఖాతరు చేయలేదు. కేసులపై వెరపు లేదు.. ఇదీ వైసీపీ హయాంలో ఇసుకాసురులు రెచ్చిపోయిన తీరు. వేమూరు నియోజకవర్గానికి చెందిన కీలక నేత అనుచరుడిపై ఈ ఇసుక అక్రమాల విషయంలో నాలుగు కేసులు నమోదై ఉండడం దోపిడీ ఏ రీతిన సాగిందన్న దానికి నిదర్శనంగా ఉంది.
గత వైసీపీ ప్రభుత్వంలో కేసులతో సరి
ప్రస్తుతం ఆర్‌ఆర్ యాక్టు కింద చర్యలకు సిద్ధం
పెనాల్టీతో రూ.49 కోట్ల జరిమానా వసూళ్లపై దృష్టి
(బాపట్ల, ఆంధ్రజ్యోతి)
సహజవనరుల దోపిడీలో చెలరేగిపోయారు. అధికారం అండతో వ్యవస్థలను ఖాతరు చేయలేదు. కేసులపై వెరపు లేదు.. ఇదీ వైసీపీ హయాంలో ఇసుకాసురులు రెచ్చిపోయిన తీరు. వేమూరు నియోజకవర్గానికి చెందిన కీలక నేత అనుచరుడిపై ఈ ఇసుక అక్రమాల విషయంలో నాలుగు కేసులు నమోదై ఉండడం దోపిడీ ఏ రీతిన సాగిందన్న దానికి నిదర్శనంగా ఉంది. కేసులు నమోదు చేసి జరిమానాలు కట్టమని నోటీసులు పంపినా అప్పట్లో స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇసుకాసురల భరతం పట్టేలా చర్యలకు రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక దోపిడీ అంశాన్ని అత్యంత ప్రయారిటీగా తీసుకుని పాత కేసులను తవ్వితీసి అక్రమార్కులపై చర్యలు తీసుకునేలా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. వైసీపీ పాలనలో చివరి ఏడాదిలో ఇసుక అక్రమ రవాణా విషయంలో నమోదైన 29 కేసులకు సంబంధించి రూ.9 కోట్ల వరకు జరిమానా కట్టాలి. నిబంధనల ప్రకారం కొన్నింటి విషయంలో వాస్తవ విలువకు పదిరెట్లు, మరొకొన్నింటిలో ఐదు రెట్ల వరకు జరిమానా విధించాలి. 29 కేసులకు సంబంధించి రూ.9 కోట్ల జరిమానా కట్టమని అప్పట్లో పలుమార్లు అధికారులు కోరినా స్పందన లేదు. పైగా ఇసుక అక్రమ రావాణా యథేచ్ఛగా చేస్తూ అడ్డుకున్న, ప్రశ్నించిన అధికారులపైనే ఎదురుదాడికి దిగిన ఉదంతాలున్నాయి. కేసులే కదా ఏమవుతుందిలే అన్న ధీమాలో ఉన్న అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించేలా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.9 కోట్ల జరిమానాలకు పెనాల్టీ కలిపి మొత్తం రూ.49 కోట్ల వసూలుకు రెవెన్యూ రికవరీ యాక్టు అసా్త్రన్ని అధికారులు ప్రయోగించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటీసులు కూడా సిద్ధమయ్యాయి. వాటిని త్వరలోనే కేసులు నమోదైన వారికి అందించనున్నారు. ఈ యాక్టు ప్రకారం నిర్ణీత గడువులోగా పెనాల్టీతో కలిపి సదరు మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే చర్యలు తీసుకునే వెసులుబాటును ఈ చట్టం కల్పించనుంది. ఈ పెనాల్టీల విషయం చివరికి నేతలను చుట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమి లేదని తెలుస్తోంది.
ప్రభుత్వం పీడీ యాక్టు ప్రతిపాదనలు..
గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక, రేషన మాఫియాపై పీడీ యాక్టు ప్రయోగించడానికి కూడా వెనకాడబొమని సాక్షాత్తు హోంమంత్రే చెప్పడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గడచిన ఐదేళ్లలో సహజవనరుల దోపిడీ చేసిన వారితో పాటు ఇప్పటికీ అదేబాటలో ఉన్న వారికి కూడా ఆ ప్రకటన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Updated Date - Nov 23 , 2024 | 12:56 AM