ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అడకత్తెరలో.. వీఆర్వోలు

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:33 AM

ఎన్నికల విధులు తప్పనిసరి కావటంతో ఓటర్ల దరఖాస్తుల పరిశీలనకు వెళ్లాలో, సర్వేకు వెళ్లాలో తెలియని సందిగ్దంలో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపమన్నట్టు తయారయింది వీఆర్‌ఓల పరిస్థితి.

ఫ సచివాలయాల ఏర్పాటు మినహా పటిష్ట నిర్వహణ లేకే

ఫ వీఆర్‌ఓలు పనిచేసేది రెవెన్యూలో... వేతనం ఇచ్చే అధికారం ఎంపీడీఓలకు

ఫ తహసీల్దార్‌, ఎంపీడీఓల మధ్య పెరుగుతున్న దూరం

ఫ ఎన్నికల విధులు, హౌస్‌హోల్డ్‌ సర్వేల పనుల్లో గందరగోళం

ఫ మా ఉత్తర్వులు ఫాలో అవ్వాలంటే మా ఉత్తర్వులంటూ ఆధిపత్య పోరు

ఫ ఛార్జిమెమోలు, వేతనాల నిలుపుదల వరకు ముదిరిన వ్యవహారం

ఫ కలెక్టర్‌ల దృష్టికి తీసుకెళుతున్న వీఆర్‌ఓలు

ఒక పక్క ఎమ్మెల్సీ ఓటర్ల పరిశీలన, సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సిద్ధ్దం చేసేపని... మరోపక్క హౌస్‌ హోల్డ్‌ సర్వేకు సంబంధించి జియో కో ఆర్డినేట్స్‌ తీసుకోవాల్సిన పని. వీటి లో ఓట్ల పరిశీలన రెవెన్యూ అధికారులు చూస్తుం టే, హౌస్‌ హోల్డ్‌ సర్వే ఎంపీడీవో పర్యవేక్షణలో జరుగుతోంది. ఈ రెండింటికీ వీఆర్వోలు వెళ్లాల్సిందే. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడితే, వివిధ శాఖల మధ్య వైసీపీ సర్కారు పెట్టిన చిచ్చు మెల్లగా రాజుకుంటోంది. వీఆర్వోలను విధులకు పంపే విషయంలో ఎవరి అధికారాన్ని వారు చూపిస్తుంటే, మధ్యలో వీఆర్వోలు నలిగిపోతున్నారు.

గుంటూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధులు తప్పనిసరి కావటంతో ఓటర్ల దరఖాస్తుల పరిశీలనకు వెళ్లాలో, సర్వేకు వెళ్లాలో తెలియని సందిగ్దంలో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపమన్నట్టు తయారయింది వీఆర్‌ఓల పరిస్థితి. ఓపక్క తహసీల్దార్లు వారు చెప్పిన విధులకు వెళ్లాలని ఆదేశాలిస్తుంటే, మరోపక్క ఎంపీడీఓలు మాకు తెలియకుండా మీ ఇష్టమొచ్చినట్టు వెళ్ళిపోతే ఎట్లా! జీతమిచ్చేది మేమయితే మా మాట ఎందుకు వినరంటూ మెమోలు ఇచ్చే పరిస్థితి నుంచి చివరకు జీతాలు ఆపేస్తామని బెదిరించే వరకు వెళ్లిందంటే వారిమధ్య అధికారిక పోరు ఎంతవరకు వెళ్లిందనేది అర్ధమవుతుంది. విధులు సక్రమంగా చేద్దామనుకునే వీఆర్‌ఓల పరిస్థితి ఇబ్బందికరంగా మారితే, తహసీల్దార్‌, ఎంపీడీఓల మద్య ఏర్పడుతున్న సమన్వయ లోపాన్ని కొందరు వీఆర్‌ఓలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అసలు విధులలోనే లేకుండా తహసీల్దార్‌ అడిగితే, ఎంపీడీఓ రమ్మన్నారని, ఎంపీడీఓ ఫోన్‌ చేస్తే, తహసీల్దార్‌ మరో పనికి పంపారంటూ ఇద్దరి దగ్గర ఒకరిపైఒకరికి చెప్పి తప్పించుకు తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొన్ని మండలాల్లో రెండు శాఖల మధ్య చిచ్చు రాజుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కలెక్టర్‌ల దృష్టికి తీసుకువెళ్లాలని, అప్పటికీ పరిష్కారం కాకుంటే ఆందోళనకు దిగాలనే ఆలోచనకు వీఆర్‌ఓలు వచ్చినట్టు చెబుతున్నారు. దీనంతటికీ వైసీపీ సర్కారు కాలంలో వీఆర్‌ఓల విధులు రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నా, సచివాలయాల ఏర్పాటు తర్వాత వారితోపాటే వీరి వేతనాలు కూడా ఎంపీడీఓలు ఇచ్చేలా మార్పులు చేయటమే. అయితే రెండూ ప్రభుత్వ శాఖలే కావటంతో వారిమధ్య అధికారిక పోరు లేకుండా సమన్వయంతో పనిచేస్తే అంత సమస్య అయ్యేదికాదు. మొత్తంమీద గత వైసీపీ సర్కారు చేసిన అనాలోచిత మార్పులు ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో చిచ్చు రేపటానికి కారణమవుతోంది.

అంతా ఓటర్ల జాబితా బిజీలో

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా సిద్దంచేసే పని ఒకపక్కన ఉంటే, ఈ నెల 6 నుంచి బుధవారం వరకు ఓటరు దరఖాస్తుల పరిశీలన పనిలో వీఆర్‌ఓలు ఉన్నారు. ఈ నెల 23న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల కానుంది. అప్పటి నుంచి డిసెంబర్‌ 7 వరకు మళ్లీ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు, ఇతర లోపాల పరిశీలన పని ఉంటుంది. వీటిని తప్పనిసరిగా బీఎల్‌ఓలే చెయ్యాల్సి ఉంది. త్వరలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సిద్ధ్దంచేసే పనికూడా జరుగుతోంది. దీనికి ఓటర్ల దరఖాస్తులు ఉండవు. అయితే నీటిపారుదల శాఖ ఇచ్చిన ఆయకట్టుదారుల వివరాల ఆధారంగా రెవెన్యూ శాఖే ఓటర్ల జాబితా సిద్ధ్దం చేయాల్సి ఉంటుంది. ఇదికూడా జరుగుతోంది. ఆ జాబితా పరిశాలన కూడా ఏకకాలంలోనే జరుగుతోంది. ఇది కాక ప్రతి సంవత్సరం కొత్త ఓట్ల చేరికలకు సంబంధించి 2025 జనవరి 5 నాటికి డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ పూర్తిచేసేలా స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ కూడా జరుగుతోంది. వీటన్నిటికీ వీఆర్‌ఓలు బీఎల్‌ఓ హోదాలో హాజరు కావలసిందే. ఎన్నికల విదుల్లో బీఎల్‌ఓలుగా ఆయా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో వీఆర్‌ఓలనే నియమిస్తారు. వారు చాలకుంటే ఇతర శాఖల సిబ్బందిని కూడా బీఎల్‌ఓలుగా తీసుకునే అధికారం ఉండటంతో ఇతర సిబ్బందినికూడా దీనికి ఉపయోగిస్తున్నారు. ఇదిట్లా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం హౌస్‌హోల్డ్‌ సర్వే చేపట్టింది. దీనికి ఇప్పటికే సచివాలయ సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. అయితే సర్వే వేగవంతం కావటంలేదనే వత్తిడి కూడా ప్రభుత్వం నుంచి వస్తుండటంతో చాలా మండలాల్లో ఎంపీడీఓలు సచివాలయ సిబ్బందినే కాకుండా వీఆర్‌ఓలను కూడా సర్వే విధులకు పంపుతున్నారు. తహసీల్దార్‌, ఎంపీడీఓ సమన్వయంతో ఉన్న మండలాల్లో వీరి సమస్య పెద్దగా లేకున్నా, కొన్నిమండలాల్లో మాత్రం అగ్గి రాజుకుంటోంది.

వైసీపీ సర్కారు పెట్టిన చిచ్చుతో...

గతంలో రెవెన్యూ శాఖ కింద పనిచేసే సిబ్బంది మొత్తానికి వేతనాలు సిద్ధంచేసి పంపే అధికారం ఆయా మండలాల తహసీల్దార్‌లకే ఉండేది. అయితే వైసీపీ సర్కారు వచ్చాక దీనిలో తీవ్ర గందరగోళ పరిస్థితిని తీసుకొచ్చింది. వీఆర్‌ఓల వేతనాలు వేసే అధికారం ఎంపీడీఓలకు అప్పగించారు. అయితే ఇక్కడా మరో మెలిక ఉంది. వీఆర్‌ఓలలో గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 అనే రెండు కేటగిరీలు చేశారు. పాత కాలం నుంచి ఉన్న వీఆర్‌ఓలను గ్రేడ్‌-1 కింద ఉంచి, వారికి జీతం తహసీల్దార్‌ పరిధిలోనే ఇచ్చేలా పాత పద్దతినే ఉంచేస్తే, వీఆర్‌ఏలు, ఇతర శాఖల నుంచి ప్రమోషన్‌పై వచ్చిన వీఆర్‌ఓలను గ్రేడ్‌-2 కింద కేటాయించారు. వీరికి మాత్రం తహసీల్దార్‌ కాకుండా ఎంపీడీఓలు వేతనాలు వెయ్యాల్సి ఉంటుంది. అటు సచివాలయంలోనూ విలేజ్‌ రెవెన్యూ సెక్రటరీలు, ఇతర సిబ్బంది ఉన్నారు. వీరికీ ఎంపీడీఓలే వేతన బిల్లులు పంపాల్సి ఉంటుంది. గ్రేడ్‌-2 కింద ఉన్నవారు కూడా రెవెన్యూ కార్యాలయాల్లోనే విధులు నిర్వర్తింస్తుంటారు. అయితే తాజాగా పెరిగిన పని వత్తిడి కారణంగా ఎవరికివారు మా సిబ్బందంటే మా సిబ్బందంటూ వారికి విధులు అప్పగించేస్తున్నారు. అయితే రెండు చోట్ల విదులకు హాజరు కాలేక సతమతమవటం వీఆర్‌ఓల వంతవుతోంది. ఈ తరహా అనాలోచిత మార్పులు చేసిన వైసీపీ సర్కారు నిర్ణయాల కారణంగా ఇప్పుడు శాఖల మద్యే సమన్వయం లోపించటానికి, వారి మధ్య వివాదాలకు కారణమవుతోంది. తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని, పెదనందిపాడు, అటు బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని మరికొన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ఈ వ్యవహారం తారాస్థాయికి చేరితే, మరికొన్నిచోట్ల సర్దుకుపోతూ, పని వత్తిడి వచ్చినప్పుడు బయటపడుతూ వస్తున్నారు. తెనాలి, మరికొన్నిచోట్ల వీఆర్‌ఓలపై తహసీల్దార్‌లు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా పరిశీలనా విధులకు రావాలని తెగేసి చెబుతుంటే, ఎంపీడీఓలు తాము చెప్పిన విధులకు రాకుంటే మెమోలే జారీ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వీఆర్‌ఓలు ఆరోపిస్తున్నారు. తెనాలిలో ఇప్పటికే ముగ్గురుకి మెమోలు ఇస్తే, ఒకరి వేతనం ఆపుతామని బెదిరించారని, నెలనెలా వచ్చే జీతంతో బతికేవారిపై ఇటువంటి బెదిరింపులకు దిగితే ఎట్లాగంటూ వారూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వీఆర్‌ఓల సంఘంలో ఈ వివాదాన్ని పెట్టి తేల్చుకుంటామంటూ వారూ తగ్గకుండా హెచ్చరికలు చేయటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఇదిట్లాఉంటే గుంటూరు జిల్లాలోని కొన్ని మండలాల వీఆర్‌ఓలు మాత్రం ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళితే, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కలెక్టర్‌కు విన్నవించుకుని, ఫలితం కనిపించకపోతే, ప్రత్యక్ష ఆందోళనకు దిగాలనే ఆలోచనలోనూ ఉన్నట్టు సమాచారం. ఇదిట్లాఉంటే... కొందరు తహసీల్దార్‌లు ఏకంగా సీఎం దగ్గరకు ఈ గందరగోళాన్ని తీసుకెళ్లి సరిదిద్దాలని కోరే ఆలోచనలో ఉంటే, మరోపక్క ఎంపీడీఓలు కూడా రాష్ట్ర మంత్రి లోకేష్‌ దగ్గరకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ కాలంలో చేసిన మార్పులవల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Updated Date - Nov 21 , 2024 | 01:33 AM