సర్‌చార్జికి.. సున్నం
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:26 AM
గత ప్రభుత్వ ఆర్థిక పాపాలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు రావాల్సిన సొమ్మును కూడా జగన్ ప్రభుత్వం ఆరగించేసింది.
దారిమళ్లించిన జగన్ ప్రభుత్వం
రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు
స్థానిక సంస్థలకు రిజిసే్ట్రషన్, మైనింగ్ రాయల్టీ పెండింగ్
ఐదేళ్లలో చెల్లింపులు లేకపోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకం
గుంటూరు సిటీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ ఆర్థిక పాపాలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు రావాల్సిన సొమ్మును కూడా జగన్ ప్రభుత్వం ఆరగించేసింది. ఫలితంగా గడచిన ఐదేళ్లుగా ఉమ్మడి జిల్లాకు రిజిసే్ట్రషన్, మైనింగ్ శాఖల నుంచి రావాల్సిన బకాయిలు చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి. రిజిస్ర్టేషన్ శాఖ ప్రతి దస్తావేజుకు మార్కెట్ విలువలో 7.5 శాతాన్ని స్టాంప్ డ్యూటీ రూపేణా వసూలు చేస్తుంది. అందులో 1.5 శాతం సర్‌చార్జి కింద స్థానిక సంస్థలకు చెల్లించాలి. గతంలో నేరుగా ఈ సొమ్ము స్థానిక సంస్థలకు జమయ్యేది. సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం) ద్వారా చెల్లింపులు మొదలైన తర్వాత మొత్తం సొమ్ము ప్రభుత్వానికి చేరుతుంది. అక్కడ నుంచి వాటాల వారీగా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ అవుతుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు రావాల్సిన సొమ్మును కూడా రాకుండా చేశారు. గత ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థలకు రావాల్సిన రూ కోట్లను దారిమళ్లించారు.
బకాయిలపై జడ్పీ చైర్‌పర్సన దృష్టి
రిజిరేస్టషన్, మైనింగ్ శాఖల నుంచి రావాల్సిన బకాయిల విలువ తేల్చేందుకు జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టీనా ఈ మధ్య ఓ సమావేశం నిర్వహించారు. సమావేశానికి వచ్చిన మూడు జిల్లాల ఆయా శాఖల అధికారులు సమాచారం లేకుండా వచ్చారు. చైర్ పర్సన్ ఆగ్రహంతో తగిన సమాచారంతో మళ్లీ వస్తామని చెప్పి వెళ్ళారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా రిజిస్ర్టార్ స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ సర్‌చార్జి బకాయిల వివరాలు సేకరించారు. ఈ ప్రకారం ఒక్క గుంటూరు జిల్లాలోనే గడచిన ఐదేళ్లలో రూ.37 కోట్ల సర్‌చార్జి బకాయి ఉన్నట్లు తేలింది. కొన్ని కార్యాలయాల్లో గత ఐదేళ్లుగా ఒక్క రూపాయి కూడా సర్‌చార్జి కింద జమ కాలేదని తెలుస్తోంది. ఉదాహరణకు అనంతవరం రిజిస్ర్టార్ కార్యాలయంలో 2019 మార్చి నుంచి ఇప్పటివరకు రూ.2,57,36,205 వరకు, తాడికొండ నుంచి రికార్డు స్థాయిలో రూ.9 కోట్లుకుపైగా సర్ చార్జి పెండింగ్‌లో ఉంది. గుంటూరు జిల్లాలోని 18 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల నుంచి సర్‌చార్జి జమ కాకుండా పెండింగ్‌లో ఉంది. పల్నాడు జిల్లాలో స్టాంప్ డ్యూటీ సర్‌చార్జి సుమారు రూ.13 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. బాపట్ల జిల్లాలో కూడా కోట్లలో బకాయిలు ఉన్నట్లు జడ్పీ వర్గాలు చెబుతున్నాయి.
మైనింగ్ రాయల్టీది అదే దారి..
మైనింగ్ రాయల్టీ కింద ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థలకు భారీ మొత్తంలో రావాల్సి ఉంది. ఎంత బకాయిలు ఉన్నారో కూడా చెప్పడానికి మైనింగ్ అధికారులు నీళ్లు నములుతున్నారు. ఇంత మొత్తంలో మైనింగ్, రిజిస్ర్టేషన్ శాఖలు స్థానిక సంస్థలకు బకాయిలు పడటం రాష్ట్రం అవతరించిన తర్వాత ఇదే మొదటి సారి అంటున్నారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో కనీస అవసరాలు కూడా తీరక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
చాలా ఇబ్బందులు పడ్డాం
గడచిన ఐదేళ్లలో జడ్పీకి రావాల్సిన సర్‌చార్జి, రాయల్టీ సొమ్మును పక్కదారి పట్టింది. అభివృద్ధి పనులకు నిధులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కనీస అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పట్టలేకపోయాం. బకాయిల విడుదలపై ప్రభుత్వ పెద్దలను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకుండా పోయింది. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలకు చాలా ద్రోహం జరిగింది. - కత్తెర హెనీక్రిస్టీనా, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
Updated Date - Nov 17 , 2024 | 01:26 AM