ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కన్నీటి పంట

ABN, Publish Date - Dec 04 , 2024 | 11:37 PM

ఫెంగల్‌ తుఫాన రైతులను నిండా ముంచేసింది.

ధాన్యం తడవకుండా కప్పిన పట్టాలు

వరి రైతును ముంచిన ఫెంగల్‌ తుపాను

20 వేల టన్నుల వరి ధాన్యం నీటిపాలు

ఫెంగల్‌ తుఫాన రైతులను నిండా ముంచేసింది. ఆరుగాలం కష్టపడి పంటను కాపాడుకుంటూ వచ్చిన వరి రైతు కష్టం నీటిపాలైంది. నంద్యాల జిల్లాలో ప్రభావం ఫెంగల్‌ తుఫాన తీరని నష్టాన్ని మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వరిపంట పూర్తిగా తడిసిపోగా, మరికొన్నిచోట్ల కోతకు వచ్చిన పంట నేలవాలి పనికిరాకుండాపోయింది. వడ్డీలకు తెచ్చి పెట్టిన పెట్టుబడులు వర్షానికి కొట్టుకుపోయాయి. ధాన్యం నూర్పులు చేపట్టి కళ్లాల్లో దాచిన ధాన్యం, రోడ్డుపై ఆరబోసిన వరి మొత్తం తడిసి ముద్దయ్యాయి. దీంతో అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు.

పాణ్యం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పాణ్యం మండలంలో ఈ ఏడాది ఆరువేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఎకరాకు రూ.30వేలు పెట్టుబడితో వేసిన పంట చేతికొచ్చే సమయంలో తుఫాన దెబ్బతో పంట విక్రయంపై సందిగ్ధత ఏర్పడింది. పంటకోత సమయంలో తుఫాన రావడంతో రైతులు కుదేలయ్యారు. కొందరు రైతులు ముందుగా కోత కోసి ఇళ్లకు తీసుకెళ్లారు. అయినా 4వేల హెక్టార్ల పంట ఇంకా చేలల్లోనే ఉండిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న ఆ పంట మొత్తం ఫెంగల్‌ తుఫాను ధాటికి వరి పంట నేలవారింది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వరి మొత్తం తడిసిపోయింది. ధాన్యం తడవకుండా రైతులు పడుతున్న అగచాట్లు వర్ణణాతీతంగా మారాయి. ప్లాస్టిక్‌ పట్టలతో కప్పి నీరు చేరకుండా ప్రయత్నిస్తున్నారు. వర్షం నీరు తోడుకుంటూ ధాన్యానికి కాపలా ఉండి ఎప్పుడు వాతావరణం అనుకూలిస్తుందో ఆకాశం వైపు చూస్తూ ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాణ్యం మండలంలో 30 వేల టన్నులు వరి ధాన్యం పండగా 20 వేల టన్నుల ధాన్యం నీటిపాలైనట్లు సమాచారం. మండలంలోని పాణ్యం, కొండజూటూరు, ఆలమూరు, కొనిదేడు, గోరుకల్లు గ్రామాలతో పాటు చెరువుల కింద వరి పంటలు సాగుచేశారు. గోరుకల్లు రిజిర్వాయర్‌ సమీప గ్రామాలైన గోరుకల్లు, కొండజూటూరు గ్రామాలలో ఇతర పంటలు వేసే పరిస్థితి లేక పోవడంతో వరి పంటసాగే శరణ్యమైంది.

ధాన్యం ఇంటికి చేర్చేలోపే...

- ఆవుల కృష్ణ, కౌలు రైతు, పాణ్యం

మూడెకరాలు కౌలు తీసుకుని వరి పంట సాగు చేశా. పంట ఇంటికి చేర్చేలోపే తుఫాన ధాటికి తడిసిపోయింది. ఎకరాకు రూ.22 వేలు కౌలుతోపాటు రూ.30 వేలు పెట్టుబడితో సాగు చేశాను. నాలుగు నెలలుగా కష్టపడి పండించిన పంట చేతికందని పరిస్థితి. మూడెకరాల పంటను కోసి ఆరబెట్టే సమయం కూడా లేకపోవడంతో పంట చేలోనే పట్టలు కప్పి తడవకుండా జాగ్రత్తలు పడుతున్నాం. తుఫాన తగ్గకుంటే ధాన్యం మొలకెత్తే ప్రమాదముంది. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

పాములపాడు: ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేస్తే తుఫాన కారణంగా చేతికొచ్చిన పంట కళ్ళెదుటే నేలవారుతోంది. పాములపాడు మండలంలో మూడు రోజులుగా మేఘాలు ముసురుకొని చిరుజల్లుల నుంచి మోస్తరుగా వర్షాలు, ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో కోతలకు సిద్ధంగా ఉన్న వరి పంటలు వందల ఎకరాల్లో నేలవాలాయి. కేసీ ఆయకట్టు కింద ఖరీఫ్‌లో సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు. ఎకరాకు రూ.20వేలు పెట్టుబడులు పెట్టినా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.

- చాగలమర్రి, రుద్రవరంలో జోరువాన

చాగలమర్రి/రుద్రవరం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఫెంగల్‌ తుఫాన ప్రభావం జిల్లాపై పడింది. చాగలమర్రి, రుద్రవరంలో బుధవారం జోరువాన కురిసింది. దీంతో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. చాగలమర్రి మండలంలోని శెట్టివీడు, చింతలచెరువు, ముత్యాలపాడు తదితర గ్రామాల్లో ఆరబెట్టుకున్న వరి ధాన్యం వర్షానికి తడిసి రైతులు నష్టపోయారు. పట్టలపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు అవస్థలు పడ్డారు. శెట్టివీడు గ్రామ రహదారిలో తేమతో ఉన్న వరి ధాన్యాన్ని రైతులు బస్తాలతో వర్షంలోనే తరలించారు. కొందరు రైతులు టార్పాలిన పట్టలను కప్పుకుంటూ ధాన్యం కాపాడుకునేందుకు అవస్థలు పడ్డారు. మరికొన్ని గ్రామాల్లో పొలాల్లోని వరిపంట నేలవాలి దెబ్బతింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు విలపిస్తున్నారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. రుద్రవరం మండలంలో మూడురోజుల నుంచి తుఫాన రైతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. కొండమాయపల్లె నుంచి కోటకొండ వరకు గ్రామాలు మినహా 14 కిలోమీటర్ల రహదారి వెంట ధాన్యం కుప్పలే ఉన్నాయి. అలాగే నరసాపురం నుంచి నల్లవాగుపల్లె మెట్ట వరకు సుమారు 3 కిలోమీటర్లు ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. పొలాల్లోని ధాన్యం కుప్పలను ఒడ్డుకు తెచ్చేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Dec 04 , 2024 | 11:37 PM