లడ్డూపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ABN, Publish Date - Sep 29 , 2024 | 05:30 AM
తిరుపతి లడ్డూ అపవిత్రం అయిన వ్యవహారంపై సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన బెంచ్ ఎదుట ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. టీటీడీ లడ్డూల
ఐదు పిటిషన్లూ ఒకేసారి విననున్న బెంచ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): తిరుపతి లడ్డూ అపవిత్రం అయిన వ్యవహారంపై సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన బెంచ్ ఎదుట ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. టీటీడీ లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని దాదాపు ఐదుగురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆలయాల నిర్వహణలో మరింత జవాబుదారీ విధానం రావాలని కూడా ఒకరిద్దరు పిటిషన్‌దారులు కోరారు. లడ్డూలు అపవిత్రమైన సంఘటనపై విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని నియమించి దర్యాప్తు జరపాలని సుదర్శన్ న్యూస్ టీవీ సంపాదకుడు సురేశ్ ఖండేరావు పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూల కల్తీపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ద్వారా దర్యాప్తు జరిపించాలని హిందూసేన అధ్యక్షుడు సూర్జిత్‌సింగ్ యాదవ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్న హిందూ ఆలయాల్లో జవాబుదారీ పాలన అవసరమని, ఆలయాలపై ప్రభుత్వ యంత్రాంగం పట్టు లేకుండా చూడాలని చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్, ప్రవచనకర్త దుష్యంత్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇక.. సీనియర్ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్టు పర్యవేక్షణలో కమిటీని నియమించి దర్యాప్తు జరిగేలా చూడాలని కోరారు. చివరగా పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని లేదా నిపుణులను నియమించి విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్లు అన్నింటిపైనా సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
Updated Date - Sep 29 , 2024 | 05:30 AM