సాయం ముమ్మరం
ABN, Publish Date - Sep 05 , 2024 | 04:10 AM
విపత్తు పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
సీఎం చంద్రబాబు అనుభవం పనికొచ్చింది
గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ముంపునకు కారణం
వైసీపీ ఉన్మాద వ్యాఖ్యలు సరికాదు: పవన్
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): విపత్తు పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయంలో వరద బాధితుల సహాయార్థం బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు పరిపాలన అనుభవం ఇప్పుడు బాగా పనిచేస్తోందని తెలిపారు. గతంలో హుద్‌హుద్ సమయంలోనూ ఆయన రాత్రి, పగలు తేడాలేకుండా పనిచేశారని గుర్తుచేశారు. చంద్రబాబు ఈ వయసులో కూడా బుల్డోజర్లు ఎక్కి మరీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని కొనియాడారు. అప్పట్లోనూ తాను రూ.50లక్షల విరాళం ఇచ్చానని, ఇప్పుడు కూడా రూ.కోటి వ్యక్తిగతంగా విరాళం ప్రకటించినట్లు పేర్కొన్నారు. దానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి గురువారం అందిస్తానని చెప్పారు. బుడమేరు కారణంగా విజయవాడలోని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. బుడమేరు 90శాతం ఆక్రమణలకు గురైందని, అదే విజయవాడకు శాపంగా మారిందని చెప్పారు. వైసీపీ నేతలు ఉన్మాద విమర్శలు చేయడం కాకుండా బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు. తాను రెండు, మూడు రోజులు బయటకు రాకపోతే సహాయక చర్యల్లో కనిపించడం లేదని విమర్శలు చేస్తున్నారని, తాను వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. ఇంకా ఎవరైనా విమర్శించే వారుంటే తనతో పాటు బయటకు రావాలని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అభయహస్తం ఇచ్చిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, అక్కడ ఇళ్లు నిర్మించుకున్న వారు ముంపునకు గురయ్యారని తెలిపారు. రిమోట్ సెన్సింగ్ ద్వారా అటవీ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన నిర్మాణాలను ఎప్పటికప్పుడు ఫొటోలు తీసే విధానం ఉందని, దీనితో ముంపు ప్రాంతాలను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు, పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని పవన్ తెలిపారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి 175 బృందాలు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా సూపర్ క్లోరినేషన్ చేస్తామని పవన్ తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో సేవలందిస్తున్న పంచాయతీరాజ్ పారిశుధ్య సిబ్బంది సుమారు వెయ్యి మందిని సత్కరిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
పంచాయతీరాజ్ ఉద్యోగుల విరాళం 14 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు మూలవేతనంరూ.14 కోట్లు వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నారని పవన్ ప్రకటించారు. పంచాయతీరాజ్ అధికారుల సంఘం, పంచాయతీ కార్యదర్శుల సంఘం, ఈవోపీఆర్‌డీల సంఘం, ఇంజనీర్ల అసోసియేషన్, డిప్లమో ఇంజనీర్ల సంఘం, మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నేతలు వరప్రసాద్, వైవీడీ ప్రసాద్, వీవీఎంకే నాయుడు, రవీంద్రతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పవన్‌కు ఈ మేరకు తన సమ్మతిని తెలిపారు.
ముందు జాగ్రత్తలే ముఖ్యం...
హైడ్రా తరహాలో రాష్ట్రంలో వ్యవస్థను ఏర్పాటు చేయడంపై పవన్ మాట్లాడుతూ ఇందులో భిన్న కోణాలను స్పృశింంచాల్సి ఉందని, తొందరపడి ముందుకెళ్లడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. దానికోసం హైబ్రిడ్ మెథడాలజీని ఎంచుకోవాలని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రాను తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రానున్న 20 ఏళ్లలో ఎలాంటి ఆక్రమణలు లేకుండా చేస్తామని తెలిపారు.
Updated Date - Sep 05 , 2024 | 04:10 AM