Hero Shivaji :ఏపీని కాపాడుకోవడానికి ఇదే చివరి అవకాశం
ABN, Publish Date - May 11 , 2024 | 05:49 AM
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని సినీ హీరో శివాజీ వ్యాఖ్యానించారు. కూటమికి ఎందుకు ఓటు వేయాలన్న అంశంపై.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు.
జగన్ అన్ని రంగాలనూ వెనక్కి నెట్టేశారు
సర్వే రాళ్లపై, పాస్‌బుక్‌లపై ఆయన బొమ్మలెందుకు?
అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
మేల్కొనకపోతే తరాలు నాశనమైపోతాయి
బిడ్డల భవిష్యత్ కోసం కూటమికే ఓటేయండి
‘ఆంధ్రజ్యోతి’తో సినీ హీరో శివాజీ
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని సినీ హీరో శివాజీ వ్యాఖ్యానించారు. కూటమికి ఎందుకు ఓటు వేయాలన్న అంశంపై.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాభివృద్ధికి పనిచేశారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ వెనుకబడేటట్లు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక్కరే’ అన్నారు. ‘ఎవరైనా ఉచితంగా ఇస్తున్నారంటే దానికి పర్యవసానంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయని అర్థం. ఉపాధి కల్పించడం మానేసి ఏడాదికి పది వేలు ఇస్తే కుటుంబ పోషణ ఎలా? డబ్బు కాదు కావల్సింది.
బిడ్డల భవిష్యత్ కోసం ఆలోచన చేయండి. పేదవారిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో అభివృద్ధి బాగుందని చెప్పడం, కంపెనీలు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయి అనడం హాస్యాస్పదం. ఒక కంపెనీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 60 వేలమంది ఉపాధి పొందుతున్నారు. కొంతమంది రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మీ బిడ్డల భవిష్యత్ బాగుపడాలంటే కూటమి అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలి.
రాష్ట్ర ఎకానమీ పడిపోయింది. వ్యవసాయం లేదు. విద్య, వైద్యం, ఉద్యోగాలు లేవు. ఏ రంగం చూసుకున్నా గుండుసున్నా. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో చాలా ప్రమాదం. మా పంట భూములు సర్వేచేసి రాళ్లు పాతి వాటిపై నీ బొమ్మలు ఎందుకు?. పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోలు వేయడం దుర్మార్గం. జగన్మోహన్‌రెడ్డి ఫొటో ఉన్న పాస్ బుక్ బ్యాంకు తనఖాకు పనికి రాదంట. భూముల వివరాలు తెలుసుకోవడానికి మాత్రమే అని పుస్తకంలో రాశారు’ అని శివాజీ అన్నారు.
దయచేసి ఓటేయడానికి రండి!
శివాజీ ఇంకా ఏమన్నారంటే.. ‘ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రం గంజాయి వనంగా మారిపోయింది. మేల్కోకపోతే రాబోయే తరాలు నాశనమయిపోతాయి. ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ దయనీయ స్థితిలో ఉంది. ఓటరుగా నమోదయిన ప్రతిఒక్కరూ ఓటువేయడానికి రండి.
మీరు ఎవరికి ఓటు వేస్తారో తరువాత విషయం. ముందు మే 13న ఎక్కడ ఉన్నా ఓటు వేయడానికి రండి. మన పూర్వీకులు పుట్టిన గడ్డ నాశనమైపోతోంది. కులం, మతం గురించి కాదు, మనం పుట్టిన గడ్డ కోసం ఓటు వేయడానికి రావాలి.
మరీ ముఖ్యంగా సిగ్గు విడిచి కులం పేరుతో చెబుతున్నా కాపు సోదరులకు సువర్ణావకాశం వచ్చింది వదలొద్దు. ఈ మాట పరమార్థం మీకు తరువాత చెబుతాను. జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు ఒకరికొకరు సమన్వయం చేసుకుని పనిచేయాలి.
బూత్ కన్వీనర్లు జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ ప్రలోభాలకు గురిచేస్తోంది. ఎటువంటి సర్వేలూ నమ్మవద్దు. గ్రౌండ్ చాలా క్లియర్‌గా ఉంది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎంత రాత్రయినా నిలబడి ఓటువేసి రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. ముందు ఓటు వేయడానికి రండి. ఎవరికి వేసినా ఓటు ఆలోచింపజేస్తుంది’ అని శివాజీ అన్నారు.
-కొవ్వూరు
Updated Date - May 11 , 2024 | 07:25 AM