Tirumala: తిరుమల వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
ABN, Publish Date - Jul 09 , 2024 | 05:32 AM
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులే వారి టార్గెట్. దర్శన సమయం వచ్చే వరకు నిరీక్షించడానికి వసతి అవసరంం కనుక అలాంటి వారినే ఎరవేస్తారు!. టీటీడీ వంద, 50 రూపాయలకు అద్దె కిచ్చే గదిని ముందుగానే బుక్ చేసుకుని హైజాక్ చేసి, గదులు దొరకని భక్తులకు అప్పటికప్పుడు రూ.వెయ్యి
రూ.100 వసతి గది.. వెయ్యికి విక్రయం
గదులు దొరకని భక్తులే టార్గెట్
ఉత్తరాది నుంచి వచ్చిన దళారుల దందా ఇది
తిరుమల, జూలై 8(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులే వారి టార్గెట్. దర్శన సమయం వచ్చే వరకు నిరీక్షించడానికి వసతి అవసరంం కనుక అలాంటి వారినే ఎరవేస్తారు!. టీటీడీ వంద, 50 రూపాయలకు అద్దె కిచ్చే గదిని ముందుగానే బుక్ చేసుకుని హైజాక్ చేసి, గదులు దొరకని భక్తులకు అప్పటికప్పుడు రూ.వెయ్యి రూపాయలకు అంటగడతారు. డిమాండ్‌ను బట్టి అంతకుమించి వసూలు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనావైఫల్యం పుణ్యమాని పుణ్యక్షేత్రంలో రోజూ కొందరు ఉత్తరాది నుంచి వచ్చిన దళారుల దందా ఇది. తిరుమలలో గదుల దళారులను అరికట్టేందుకు పోలీస్, విజిలెన్స్ అధికారులు చేపట్టిన విచారణలో ఇలా నివ్వెరపోయే అంశాలు బయటపడుతున్నాయి. మార్ఫింగ్ ఆధార్ కార్డు జిరాక్స్‌లతో గదులను పొంది బ్లాక్‌లో విక్రయించేందుకు నార్త్ ఇండియా నుంచి కొంద రు తిరుపతి, రేణిగుంటల్లో తిష్ఠవేయడం ఆశ్చర్యపరుస్తోంది.
అక్రమార్జనకు దందా సాగించేదిలా!
ఆధార్ కార్డులో ఫొటో మార్పిడి చేసి గదులను బుక్ చేసుకోవడం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న వైనం మూడురోజుల క్రితం వెలుగు చూసిన విషయం తెలిసిందే. తొలుత సమీప బంధువు ఆధార్ కార్డుతో గదిని పొంది, ఆ తర్వాత గది కోసం నిరీక్షించే భక్తుడికి బ్లాక్‌లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు విక్రయించడం, విక్రయించే క్రమంలోనే ఆ భక్తుడి నుంచి ఆధార్ తీసుకోవడం, తిరిగి భక్తుడి నుంచి పొందిన ఆధార్ జిరాక్స్‌లోని ఫొటోను మార్చి దళారీ ఫొటో జతచేసి తిరిగి గదిని పొందే పెద్ద స్కాంను భద్రతాధికారులు గుర్తించారు. నవకిశ్‌ర్ అనే దళారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఇదే తరహాలో 25 నుంచి 30 మంది దళారులు గదుల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలింది. కేవలం గదుల ద్వారా అక్రమాలకు పాల్పడేందుకే మహారాష్ట్ర నుంచి కొంతమంది కుటుంబాలతో వచ్చి తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో గదులకు అద్దెకు తీసుకుని నివాసముంటున్నట్లు కూడా తేలింది.
తెలంగాణ, కర్ణాటకల నుంచి కూడా మరికొంతమంది తిరుపతికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. ఉదయం భక్తుల్లా తిరుమలకు వచ్చి గదుల ద్వారా వచ్చే సొమ్మును జేబులో వేసుకుని తిరిగి కొండదిగేస్తున్నట్టు విచారణలో తేలింది. దీన్నిబట్టి గదులను బ్లాక్‌లో విక్రయించడం ద్వారా ఏ స్థాయిలో సంపాదన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కరు కనీసం రూ.60వేల నుంచి లక్ష వరకు అక్రమంగా సంపాదిస్తుండగా.. సమయానికి గదులు దొరక్క భక్తులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లే తిరుమలలో ఇలాంటి దుస్థితి నెలకొందని, కూటమి సర్కారు ప్రక్షాళన చేపట్టి ఇలాంటి అక్రమాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.
Updated Date - Jul 09 , 2024 | 11:09 AM