జగన్ గో బ్యాక్
ABN, Publish Date - Sep 27 , 2024 | 05:47 AM
లడ్డూ ప్రసాదాలను అపవిత్రం చేసిన వ్యవహారం కాక రేపుతుండగానే... మాజీ సీఎం జగన్ తిరుమలకు వస్తుండటం మరింత మంట రాజేస్తోంది. ఐదేళ్లుగా తన చేష్టలు, లడ్డూ కల్తీపై తన మాటలతో హిందూ భక్తుల మనోభావాలు గాయపరిచిన జగన్‌ను
తిరుమల పర్యటనపై జనాగ్రహం
రెచ్చగొట్టొద్దు.. బాధపెట్టొద్దు
హిందూ సంఘాల హెచ్చరిక
జగన్‌ను అడ్డుకుంటామని ప్రకటన
మా శరీరాలపై నుంచే తిరుమలకు వెళ్లాలి
శాంతి భద్రతల సమస్య వస్తే బాధ్యత మీదే
జగన్‌ను హెచ్చరించిన పలువురు స్వామీజీలు
తిరుపతిలో 30 పోలీస్ యాక్ట్ విధింపు
సీఎంగా ఉన్నప్పుడు బేఖాతరు
లడ్డూ వివాదంతో ‘పోటీ’ పర్యటన
నేడు తిరుమలకు జగన్.. రేపు దర్శనం
తిరుపతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): లడ్డూ ప్రసాదాలను అపవిత్రం చేసిన వ్యవహారం కాక రేపుతుండగానే... మాజీ సీఎం జగన్ తిరుమలకు వస్తుండటం మరింత మంట రాజేస్తోంది. ఐదేళ్లుగా తన చేష్టలు, లడ్డూ కల్తీపై తన మాటలతో హిందూ భక్తుల మనోభావాలు గాయపరిచిన జగన్‌ను తిరుపతిలో అడుగు పెట్టనీయబోమని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి పరిధిలో 30 పోలీసు యాక్ట్‌ను విధించింది. ఆయన విమానం దిగే రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు భారీఎత్తున బలగాలను మోహరించింది. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం అప్పటి టీటీడీ పాలకవర్గం, జగన్‌ను పూర్తిగా ఆత్మరక్షణలో పడేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి తిరుపతి చేరుకోనున్నారు. అక్కడినుంచి తిరుమల వెళతారు. మరునాడు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, మధ్యాహ్నం నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళతారు. అయితే, తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ కొండకు రాకూడదంటూ బీజేపీ, హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలో స్వామిని దర్శించుకోవాలని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనను అడ్డుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. ‘జగన్.. మీరు మా తిరుమలకు రావొద్దు. వస్తే అడ్డుకుని తీరుతాం. మీ వాహనాలు మా సాధుసంతులు, హిందువుల శరీరాల పైనుంచి వెళ్లాల్సిందేతప్ప మిమ్మల్నైతే ఒక్క అడుగుకూడా ముందుకు వెళ్లనివ్వం’ అని శ్రీనివాసానంద స్వామి స్పష్టం చేశారు. హిందూస్థాన్ పార్టీ వ్యవస్థాపకుడు తుమ్మ ఓంకార్ ఆధ్వర్యంలో పలువురు స్వామీజీలు తిరుపతిలోని గరుడ సర్కిల్‌వద్ద గురువారం సాయంత్రం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘గో బ్యాక్ జగన్.. సేవ్ తిరుమల’ నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ.. ‘క్రైస్తవుడైన జగన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించం. ఐనప్పటికీ జగన్ తిరుమలకు వెళ్లాలని ప్రయత్నిస్తే మేముకూడా ఏ పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నాం.
అడ్డుకుని తీరుతాం. శాంతి భద్రతల సమస్య తలెత్తితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏం జరిగినా మేము సిద్ధమే. మా హిందూ ధర్మానికి, వేంకటేశ్వర స్వామికి కళంకం తెచ్చిన, ప్రసాదాన్ని పాడుచేసిన, మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసిన జగన్మోహన్‌రెడ్డిని ఒక్క అడుగుకూడా వెయ్యనివ్వం. మీ నిర్వాకంతో హిందువులందరం తీవ్రంగా గాయపడ్డాం. తిరుమలకు వస్తానంటూ మీరు మళ్లీ మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. మా గాయాలపై కారం చల్లొద్దు’ అని హితవుపలికారు. రాష్ట్రంలో 250కిపైగా ఆలయాలపై దాడులు జరిగినపుడు నాడు సీఎంగా జగన్ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నించలేదని గుర్తుచేశారు. హిందువులకు ఊరట కలిగించేలా ఒక్కమాటన్నా మాట్లాడారా? అని ప్రశ్నించారు. మీరు కాకపోయినా కనీసం అప్పటి మీ మంత్రులు, ఇతర నేతలైనా మాట్లాడారా అంటూ మండిపడ్డారు. ‘హిందువులను మోసం చేయడానికి మొన్న ప్రెస్‌మీట్ పెట్టారు. నెయ్యి కల్తీ తమకు తెలియకుండా జరిగిపోయిందన్నారు. ఇదంతా రాద్దాంతం అన్నారు. హిందువుల గుండెలు మండుతున్నాయి. ఇంకా రెచ్చగొట్టొద్దు... బాధపెట్టొద్దు... మా తిరుమలకు రావొద్దు... ఐనా వస్తే ఖబడ్దార్’ అని శ్రీనివాసానంద స్వామి హెచ్చరించారు. ఈ నిరసనలో గణేష్ స్వామి, జ్యోతి స్వామి, సనాతన పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కిరణ్, మాసుమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకోవైపు జగన్ పర్యటన కోసం జిల్లా వైసీపీ నేతలు భారీ ఎత్తున జనసమీకరణకు యత్నిస్తున్నారు. ఈ నేపఽథ్యంలో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకుంది. జగన్ విమానం దిగే రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. జిల్లాలో గురు, శుక్రవారాల్లో పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్టు ఎస్పీ ప్రకటించారు.
Updated Date - Sep 27 , 2024 | 05:47 AM