Home Minister Anitha : ప్రజా పోలీసింగ్ మా లక్ష్యం
ABN, Publish Date - Sep 20 , 2024 | 04:50 AM
‘పోలీసులు ఉన్నది ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడానికి. గత ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి సొంత ప్రతీకారాలకు వాడుకుంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రజా పోలీసింగ్‌కే ప్రాధాన్యమిస్తాం.
సిబ్బంది నియామకం.. టెక్నాలజీకి ప్రాధాన్యం
ప్రతి జిల్లాకు సైబర్ స్టేషన్.. కమాండ్ కంట్రోల్
గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తాం
మహిళల రక్షణ, నేరస్తులకు శిక్షపై ప్రత్యేక దృష్టి
అక్రమ అరెస్టులు చెయ్యం.. తప్పుడు కేసులు పెట్టం
కాదంబరి జెత్వానీ కేసులో అరెస్టులు ఉంటాయి
తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం
‘ఆంధ్రజ్యోతి’తో హోంమంత్రి అనిత
అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘పోలీసులు ఉన్నది ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడానికి. గత ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి సొంత ప్రతీకారాలకు వాడుకుంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రజా పోలీసింగ్‌కే ప్రాధాన్యమిస్తాం. పొలిటికల్ పోలీసింగ్ ఉండదు. అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టి ఎవరినీ వేధించబోం. తప్పుచేసిన వ్యక్తులు ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తీసుకోకుండా వదిలి పెట్టం’ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. పోలీసు శాఖ పనితీరు, ప్రజలకు భరోసా, తదితర అంశాలపై ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. గత వంద రోజుల్లో పోలీసు శాఖ సాధించింది ఏమిటి.? ఇంకా చేయాల్సిందేమిటి.? పోలీసింగ్‌లో మార్పుల ప్రణాళిక ఏమిటి.?
మహిళలకు భద్రత, టెక్నాలజీ వినియోగం, నేరస్తులకు శిక్షలు, గంజాయి సమస్యను ఎలా ఎదుర్కొంటుంది..? అనే విషయాలను వివరించారు. ‘అరాచక పాలనకు సమాధి కట్టి టీడీపీ కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు పూర్తిగా భరోసా కల్పించాం. తప్పుడు కేసులు, వేధింపులు, అరాచకాలు ఈ ప్రభుత్వంలో ఉండబోవని చేతల్లో చూపించాం. అలాగని తప్పు చేసిన వారిని వదిలి పెట్టం.
కొన్ని అరెస్టులు ఆలస్యమై ఉండొచ్చు.. అంత మాత్రాన ఈ ప్రభుత్వం మౌనంగా ఉన్నట్లు కాదు. చట్ట ప్రకారమే ముందుకెళుతున్నాం. అందుకే వైసీపీ నేతలకు కూడా 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు పిలుస్తున్నాం. మా పోలీసులు ఎవరినీ అర్ధరాత్రి అక్రమంగా ఎత్తుకు రాలేదు. ఎస్సీపై అట్రాసిటీ కేసులు పెట్టలేదు.. మా తప్పుంటే సరిదిద్దుకొంటున్నాం. ప్రజలకు మేం పూర్తిగా జవాబుదారీగా ఉంటాం. పనిగట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే మాత్రం చట్టం తనపని తాను చేస్తుంది’ అని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే...
రాజకీయ పోలీసింగ్‌ను ప్రజా పోలీసుగా...
పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టాం. పోలీసుల్ని చట్ట ప్రకారమే పనిచేయమని చెప్పాం. తప్పుడు కేసులు పెట్టొద్దని, తప్పు చేసిన వారిని వదలొద్దని అన్నాం. కొత్త వాహనాలకు నిధులు, ఆయిల్ 150 లీటర్ల నుంచి 300 లీటర్లకు పెంపు.. సీసీ కెమెరాలకు చూపు, ఫోరెన్సిక్‌కు ప్రాణం.. ఫింగర్ ప్రింట్స్‌కు ఊతం ఇచ్చాం. ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్, ప్రతి జిల్లా కేంద్రంలోనూ సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నాం. మొత్తం మీద పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలో అలా మార్చేందుకు శ్రమిస్తున్నాం.
రాష్ట్రంలో ప్రధాన సమస్య గంజాయి..
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా చంద్రబాబు తీసుకెళ్లారు.. కానీ గత ఐదేళ్లలో వైసీపీ దాన్ని గంజాయి ప్రదేశ్‌గా మార్చి పరువు తీసింది. ఒకప్పుడు మన్యంలో ఉండే గంజాయి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. దాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రణాళికా బద్ధంగా శ్రమిస్తున్నాం. ఒక ఐజీ నేతృత్వంలో యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్) ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 1,378 కేసులు నమోదు చేసి 2.08లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. గంజాయి సాగు, సరఫరా చేస్తోన్న 3,890 మందిని అరెస్టు చేసి జైలుకు పంపాం. అసలైన కింగ్‌పిన్‌లను పట్టుకోవడానికి 27 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రానికి మత్తు విముక్తి కల్పించేందుకు గట్టిగా శ్రమిస్తున్నాం.
ఆన్‌లైన్ మోసాల కట్టడికి చర్యలు..
ఆర్థిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో పెరగడంతో సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.. వైసీపీ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రానికి ఒకే ఒక్క పోలీసు సైబర్ స్టేషన్ ఉండేది. ఇప్పుడు ప్రతి జిల్లాకు సైబర్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. పోలీసులకు అధునాతన పరికరాలు సమకూరుస్తున్నాం. సైబర్ కమాండోలను తీర్చిదిద్ధి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విజయవాడలో ఇప్పటికే ప్రారంభమైంది. రాష్ట్రమంతా విస్తరిస్తాం. మొత్తం 16రకాల సైబర్ నేరాలపై రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. నేరాలు తగ్గాలంటే తప్పు చేసిన వారికి శిక్షలు పడి తీరాలి. గత ప్రభుత్వంలో ‘దిశ’ పేరు చెప్పి 21 రోజుల్లో ఉరేస్తామన్నారు. అసలు చట్టమే లేకున్నా ప్రజల్ని మభ్య పెట్టారు. మేం అలా కాదు, పోలీసులకు అవసరమైన సీసీటీవీల నుంచి డ్రోన్లు, ఫింగర్ ప్రింట్స్ ల్యాబ్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, దర్యాప్తునకు సిబ్బంది, వాహనాలు, వాటికి ఆయిల్ అన్నీ సమకూరుస్తున్నాం. అమరావతిలో ఫోరెన్సిక్ రిసెర్చ్ కేంద్రాన్నే ఏర్పాటు చేయబోతున్నాం. దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధ్య సమన్వయం పెంచి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా నేరస్తులకు సత్వర శిక్షలు పడేలా కృషి చేస్తాం.
ముంబై నటి కేసులో అరెస్టులు ఉంటాయి..
ప్రభుత్వమే మాఫియా అవతారం ఎత్తితే... అంతకన్నా దారుణం ఉంటుందా..? ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో అదే జరిగింది. సీఎం క్యాంపు కార్యాలయంలోనే కుట్రలకు బీజం పడటం.... అందులో ఐపీఎ్‌సలు భాగస్వాములవడం ఎంత ప్రమాదకరం. బాధితురాలు జెత్వానీ ఇప్పుడే నన్ను కలిసి..తనను ఎంతగా వేధించారో చెప్పింది. కుక్కల విద్యాసాగర్ పరారీలో ఉన్నాడు. అతనితో పాటు కుట్రలో ఎవరున్నా అరెస్టు చేస్తాం. ఐపీఎస్ అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశాం. దర్యాప్తులో లభించే ఆధారాలను బట్టి చట్టపరమైన చర్యలుంటాయి. ఈ రోజు నేను హోంమంత్రినైనా గత ప్రభుత్వంలో దారుణమైన ట్రోలింగ్, అవమానాలు ఎదుర్కొన్నా. తల్లి, చెల్లిని కూడా ట్రోల్ చేసిన వాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి తల్లి, చెల్లి రక్షణ బాధ్యత మాదే. రాజకీయ పరమైన కేసుల్లో అరెస్టులు సకాలంలో చేయలేదన్న నింద మాపై ఉంది. అడ్డగోలుగా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్టులు చేసేందుకు ఇది జగన్ ప్రభుత్వం కాదు. చంద్రబాబు ప్రభుత్వంలో చట్టపరంగానే చర్యలుంటాయి. అందుకే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలకు కూడా 41 నోటీసు (విచారణ) ఇస్తున్నాం. అరెస్టులు ఆలస్యం కావొచ్చు... కానీ తప్పుచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
Updated Date - Sep 20 , 2024 | 04:50 AM