Vangalapudi Anita : శవాల దగ్గర రాబందులు!
ABN, Publish Date - Nov 06 , 2024 | 05:09 AM
ఐదేళ్ల పాలనలో పోలీసు వ్యవస్థను నాటి సీఎం జగన్ నిర్వీర్యం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు.
వైసీపీ సైకో బ్యాచ్‌పై చర్యలు: హోం మంత్రి
ఏమీ జరక్కపోయినా ఏదో జరిగినట్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు
అత్యాచారం జరిగిందో లేదో తెలుసుకోకుండా తిరుపతి ఘటనపై బురదజల్లుతున్నారు
వీటిని అడ్డుకోవడం మా గురుతర బాధ్యత
త్వరలో 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
ఎస్‌ఐ పోస్టుల భర్తీపై సమీక్షిస్తున్నాం: అనిత
ఘనంగా డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్
అనంతపురం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల పాలనలో పోలీసు వ్యవస్థను నాటి సీఎం జగన్ నిర్వీర్యం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. వైసీపీ నాయకుల పరిస్థితి శవాల దగ్గర రాబందుల్లా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లుగా వైసీపీ సైకో బ్యాచ్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ.. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో ఘనంగా నిర్వహించిన డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్‌కు ఆమె, డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అక్కడ, ఆ తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజల మానప్రాణాలను కాపాడడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేయడం, పోలీసుల సంక్షేమాన్ని పెంపొందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడమే ప్రథమ కర్తవ్యంగా ముందుకు వెళ్తోందని చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన తప్పిదాలతో ఇప్పుడు తమ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ‘సైకో బ్యాచ్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. నిన్నటి రోజున తిరుపతిలో ఒక ఘటన జరిగిందని జగన్ సొంత పత్రిక, చానల్లో పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. కనీసం ఆ అమ్మాయి అత్యాచారానికి గురైందో లేదో వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లడం... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పరిపాటిగా మారింది. వైసీపీ సైకో బ్యాచ్ ప్రజల మనోభావాలతో ఆటలాడుతోంది. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడం మా గురుతర బాధ్యత. జగన్ తన ఇంటికి రూ.12 కోట్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారే గానీ.. పోలీసు విభాగంలో వేలిముద్రలు గుర్తించే వ్యవస్థ నిర్వహణకు రూ.12 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఇలాంటి వ్యక్తా శాంతిభద్రతల గురించి మాట్లాడేది? గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి కేంద్రం రూ.219 కోట్లు ఇస్తే.. రూ.9 కోట్లు తీసుకుని యూసీ ఇవ్వలేదు. దీంతో మిగిలిన రూ.210 కోట్లు వెనక్కిపోయాయి. ఈ కారణంగా గ్రేహౌండ్స్ అకాడమీయే లేకుండా పోయింది. వేలిముద్రల గుర్తింపు, సీసీ కెమేరాలకు రూ.700 కోట్లు ఖర్చు చేసి ఉంటే వాటి పునరుద్ధరణ జరిగేది. కానీ జగన్ రూ.500 కోట్లు ఖర్చు చేసి రుషికొండలో ప్యాలెస్ మాత్రం కట్టారు. శాంతిభద్రతల గురించి మాట్లాడేందుకు ఆయన సిగ్గుపడాలి’ అని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేసి.. సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసి, శాంతిభద్రతలు కాపాడతామన్నారు. త్వరలో 6వేలకుపైగా కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. ఎస్‌ఐ పోస్టుల భర్తీపై సమగ్రంగా సమీక్షిస్తున్నామని చెప్పారు.
పోలీసుల ప్రతిష్ఠ పెంచాలి
పోలీసుల ప్రతిష్ఠను పెంచేలా విధి నిర్వహణలో బాధ్యతగా నడచుకోవాలని శిక్షణ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు హోం మంత్రి సూచించారు. ప్రొబేషనరీ డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్‌లో తొలుత ఆమె వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి, నిద్రలేని రాత్రులు గడిపి కలలను సాకారం చేసుకున్నారని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు విధుల్లో చేరబోతున్నారని డీఎస్పీలను అభినందించారు. బాధ్యతగా వ్యవహరించి, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ‘రాష్ట్ర ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడేందుకు పోలీసు వృత్తిని ఎంచుకోవడం హర్షణీయం. పోలీసు ఉద్యోగం మిగతా ఉద్యోగాలవంటిది కాదు. 24 గంటలూ పనిచేయాలి. నిజాయితీ, నిష్పక్షపాతం, బాధితులపట్ల సానుభూతి, విధి నిర్వహణలో నిబద్ధత కలిగి ఉండాలి. సమాజాన్ని సుస్థిరంగా ఉంచి, శాంతి భద్రతలు కాపాడే కీలక బాధ్యతలను పోలీసులు నిర్వర్తిస్తున్నారు. అలాగే పోలీసు వ్యవస్థను ప్రతి ఒక్కరూ గౌరవించేలా చేయాలని సీఎం సంకల్పించారు. పోలీసు శాఖకు అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గత ఐదేళ్లలో నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేయడమే మా ధ్యేయం. పటిష్ఠపరచడమంటే ఆయుధాలు ఇవ్వడమో.. వాహనాలు ఇవ్వడమో కాదు. పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం. పోలీసు స్టేషన్ల నిర్మాణం, ఆధునికీకరణ పనులు చేయాల్సి ఉంది. ప్రతి జిల్లాలోనూ సైబర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. గంజాయి మత్తులో, రాజకీయ ముసుగులో ఎంతో మంది నేరాలకు ఒడిగడుతున్నారు. టెక్నాలజీని వినియోగించుకుని నేరాల కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని వివరించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నేను ఒక్కటే మాట మీద ఉన్నాం. శాంతిభద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదు.
పోలీసు వ్యవస్థకు ఒక్క రూపా యైునా ఇవ్వకుండా అన్ని విభా గాలను జగన్ నిర్వీర్యం చేశారు. సరెండర్ లీవ్‌లు ఇవ్వడు గానీ పబ్లిసిటీ పిచ్చి కోసం సర్వే రాళ్లకు రూ.800 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ రూ.800 కోట్లను పోలీసులకు ఇవ్వాల్సిన టీఏలు, డీఏలకు చెల్లించి ఉంటే బాగుండేది కాదా..?
- హోం మంత్రి అనిత
Updated Date - Nov 06 , 2024 | 05:09 AM