నీటి విడుదలపై ఆశలు
ABN, Publish Date - Oct 20 , 2024 | 01:08 AM
ఈ ఏడాది రబీ సీజన్‌లో కృష్ణాడెల్టాకు వరి సాగు నిమిత్తం నీటిని విడుదల చేసే అంశంపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని రైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరుతో ఖరీఫ్ సీజన్ ముగియనుంది. నవంబరు 15 నుంచి ఎగువ ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమవుతాయి. ఈలోగానే రబీ సీజన్‌లో వరి సాగుకు నీటిని విడుదల చేసే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తే రబీ సీజన్‌లో ఏ రకం పంటలు సాగు చేయాలనే అంశంపై రైతులు నిర్ణయం తీసుకు నేందుకు వీలుంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఖరీఫ్‌లో వరి దిగుబడులు తగ్గినా, రబీలో వరి సాగు చేసి కొంతమేర ఆర్థికంగా నిలదొక్కు కునేందుకు అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు.
- జిల్లాలో 50 వేల హెక్టార్లలో వరి సాగుకు అవకాశం
- రబీపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న రైతులు
- ఖరీఫ్‌లో దిగుబడులు తగ్గినా రబీతో ఆర్థిక వెసులుబాటుకు అవకాశం
- కృష్ణానదికి నేటికీ కొనసాగుతున్న వరద
ఈ ఏడాది రబీ సీజన్‌లో కృష్ణాడెల్టాకు వరి సాగు నిమిత్తం నీటిని విడుదల చేసే అంశంపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని రైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరుతో ఖరీఫ్ సీజన్ ముగియనుంది. నవంబరు 15 నుంచి ఎగువ ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమవుతాయి. ఈలోగానే రబీ సీజన్‌లో వరి సాగుకు నీటిని విడుదల చేసే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తే రబీ సీజన్‌లో ఏ రకం పంటలు సాగు చేయాలనే అంశంపై రైతులు నిర్ణయం తీసుకు నేందుకు వీలుంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఖరీఫ్‌లో వరి దిగుబడులు తగ్గినా, రబీలో వరి సాగు చేసి కొంతమేర ఆర్థికంగా నిలదొక్కు కునేందుకు అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణానదికి 11.42 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చింది. భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగి ప్రవహించడంతో గన్నవరం, ఉంగుటూరు, పెదపారుపూడి, బాపులపాడు, నందివాడ, గుడివాడ, మచిలీపట్నం, చల్లపల్లి తదితర మండలాల్లో 50 వేల హెక్టార్లకుపైగా వరిపంట నీట మునిగి దెబ్బతింది. కొందరు రైతులు భూమిని ఖాళీగా ఉంచలేక తక్కువ వ్యవధిలో కోతకు వచ్చే వరి వంగడాలను సాగుచేశారు. అధిక ధరకు వరినారు కొనుగోలు చేసి పలుచగా వరినాట్లు వేశారు. వరిపైరు నీట మునిగిన ప్రాంతాల్లోని పొలాల్లో వరిపైరు కొంతమేర ఉండగా, ఈ ఏడాది ఎకరానికి 12 నుంచి 15 బస్తాల ధాన్యం దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు, వ్యవసాయశాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. ధాన్యం దిగుబడులు ఈ ఏడాది తక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో ఽరబీ సీజన్‌లో దాళ్వా పంటకు సాగునీటిని విడుదల చేస్తే వరి సాగు చేసుకుంటామని రైతులు అంటున్నారు.
కొనసాగుతున్న వరద
ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో నేటికీ కృష్ణానదికి వరద కొనసాగుతూనే ఉంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను దృష్టిలో పెట్టుకుని కృష్ణాడెల్టాకు రబీ సీజన్‌లో నీటిని విడుదల చేస్తారా, లేదా అనే అంశంపై రైతుల్లో కొంత అయోమయం నెలకొంది. వచ్చేఏడాది ఖరీఫ్ సీజన్‌కు విత్తనాల అవసరాలను తీర్చేందుకు కంకిపాడు, గన్నవరం, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో రైతులు ఖరీఫ్ సీజన్‌కు ఉపయోగమైన వరి వంగడాలను సాగు చేస్తారు. విత్తనాలుగా ఉపయోగించే వరి వంగడాలకు మార్కెట్‌లో మంచి ధర కూడా పలుకుతుంది. దీంతో రైతులు ఆరుతడి పంటలకు బదులుగా వరి సాగుపై ఆసక్తి చూపుతారు. రబీ సీజన్‌కు సాగునీరు విడుదల చేసే అంశంపై త్వరితగతిన ప్రభుత్వం స్పష్ట్టమైన ప్రకటన చేస్తే నారు మడులు ముందస్తుగానే పోసుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో వరి సాగుకు, వేసవిలో తీర ప్రాంతంలోని గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలకు సుమారుగా 45 టీఎంసీల నీరు సరిపోతుంది.
సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటేనే..
ప్రతి ఏటా సాగునీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో ఏయే ప్రాంతాలకు రబీ సీజన్‌లో వరిసాగుకు అనుమతులు ఇవ్వాలి, వరిపంట సాగు కోసం, తీర ప్రాంతంలో వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎంతమేర నీటిని కాలువలకు విడుదల చేయాలి, సాగునీటి ప్రాజెక్టులలో నీటి లభ్యత తదితరాలను బేరీజు వేసుకుని అధికారులు, పాలకులు తగు నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశం నవంబరు ప్రారంభంలోనే నిర్వహిస్తే రైతులకు ఉపయోగం ఉంటుందని రైతులు అంటున్నారు. త్వరలోనే ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. రబీ సాగుకు అదను దాటిన తరువాత సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటే ఉపయోగం ఉండదని తీరప్రాంత రైతులు పేర్కొంటున్నారు. రబీ సీజన్‌కు సాగునీటిని విడుదల చేసే అంశంపై ప్రకటన చేస్తే అందుకు అనుగుణంగా వరిసాగు చేయాలా, ఆరుతడి పంటలను వేయాలా అనే అంశంపై తగు నిర్ణయం తీసుకుంటామని రైతులు అంటున్నారు.
రబీలో 1.20 లక్షల హెక్టార్లలో మినుము, మొక్కజొన్న, పెసర సాగు
జిల్లాలో రబీ సీజన్‌లో ఏటా 1.20 లక్షల హెక్టార్లలో మినుము, మొక్కజొన్న, పెసర తదిత ర పంటలు రైతులు సాగు చేస్తారు. సముద్రతీరంలోని కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, పామర్రు మండలాల్లో రబీ సీజన్‌లో సుమారు 50 వేల హెక్టార్లలో వరి పంటను సాగు చేస్తారు. సాగునీటి విడుదలను బట్టి వరి సాగు చేసే విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు తదితర మండలాల్లో కాలువలకు సాగు నీటిని విడుదల చేయకున్నా బోరు నీటి ఆధారంగా రబీలో వరిపంటను సాగు చేస్తారు. నీటిని విడుదల చేస్తే ఆ నీటిని పంటలకు ఉపయోగించుకుంటారు. రబీలో వరి సాగుకు అనుమతులు ఇస్తే అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు ముందస్తుగానే ప్రణాళికను తయారు చేసుకోవాల్సి ఉంది.
Updated Date - Oct 20 , 2024 | 01:08 AM