ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నలుచెరగులా భారీ ప్యాలెస్‌లు.. కొల్లగొట్టి.. కట్టేశారు!

ABN, Publish Date - Jun 24 , 2024 | 04:13 AM

తాడేపల్లిలో వైసీపీ అక్రమంగా కడుతున్న కార్యాలయాన్ని అధికారులు కూల్చేశారు. జగన్‌ రోత పత్రిక సైతం ఆ విషయాన్ని ‘పార్టీ ఆఫీసు కూల్చేశారు’ శీర్షికన ప్రచురించింది.

తాడేపల్లిలో వైసీపీ అక్రమంగా కడుతున్న కార్యాలయాన్ని అధికారులు కూల్చేశారు. జగన్‌ రోత పత్రిక సైతం ఆ విషయాన్ని ‘పార్టీ ఆఫీసు కూల్చేశారు’ శీర్షికన ప్రచురించింది. కానీ కాస్త తరచి చూస్తే వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా కడుతున్న ఆఫీసుల వెనుక పెద్ద లోగుట్టే ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఎందుకంటే వైసీపీ కట్టే ఆఫీసులకు అయితే ఆ పార్టీ యజమానిగా ఉండాలి. కాదూ కూడదంటే ఆ పార్టీని రిప్రజెంట్‌ చేసే అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డో లేదా సంబంధిత మరో వ్యక్తో ఉండాలి. కానీ శనివారం కూల్చిన ఆ భవనానికి యజమాని వైసీపీ కానీ, జగన్‌ కానీ కాదు.. దాని యజమాని రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌. జగన్‌ హయాంలో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ రూపొందించిన తనిఖీ నివేదికలో స్వయంగా పొందుపరిచిన వాస్తవం ఇది. అలా ఎలా సాధ్యం అంటే.. అదంతే! అక్కడే సిసలైన జగన్మాయ దాగి ఉంది!! జగన్‌ హయాంలో అడ్డగోలుగా జరిగిన సవాలక్ష అక్రమాల్లో ఇది మరో మహా మాయ!! వైసీపీ కార్యాలయాల పేరిట అడ్డదారిన నామమాత్రపు లీజుకు కోట్ల రూపాయల విలువైన భూములు పొందారు. వాటిలో రాజమహళ్ల వంటి భవనాలు నిర్మిస్తున్నారు. వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థ వాటి నిర్మాణంలో పోషిస్తున్న పాత్రను చూస్తే మరో భారీ ‘క్విడ్‌ ప్రో కో’ స్కాం ఉందని తేలుతుండటం అసలు విశేషం!

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఒకటిన్నర ఎకరా ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మించారు. కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయానికి కూత వేటు దూరంలో ఇది ఉంటుంది. ఇక్కడ ఎకరం ధర రూ.15 కోట్ల పైమాటే. దాదాపు రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వం అప్పనంగా కేటాయించింది. ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి చొప్పున 33 ఏళ్లకు కేవలం రూ.49,500 లీజు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

వైసీపీ కార్యాలయాల భవనాలకు ప్రభుత్వ భూములు ధారాదత్తం

విశాఖపట్నంలో...

విశాఖపట్నంలో వైసీపీ కార్యాలయం కోసం ప్రభుత్వ భూమిని లీజు పేరిట కారుచౌకగా కొట్టేశారు. 2022 మే 16న పీఎంపాలెం సమీపాన ఎండాడ సర్వే నంబర్‌ 175/4లో రెండెకరాలు కేటాయించుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరా రూ.50 కోట్లు పైగా పలుకుతోంది. అంటే... రెండు ఎకరాల విలువ రూ.100 కోట్లు. ఏడాదికి కేవలం రూ.రెండు వేలు (ఎకరాకు రూ.వెయ్యి) చెల్లించేలా ఆ భూమిని 33 ఏళ్ల పాటు గత ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వైసీపీ కార్యాలయం కోసం ప్యాలెస్‌ను తలపించేలా భారీ భవనాన్ని నిర్మించారు. గత ఏడాది సెప్టెంబరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

అనకాపల్లిలో...

అనకాపల్లి మండలం రాజుపాలెం రెవెన్యూ కొత్తూరు నర్సింగరావుపేట గ్రామ పరిధిలోని సర్వే నంబరు 75/1లో సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. జిల్లా పార్టీ కార్యాలయానికి ఆ స్థలం కేటాయించేలా వైసీపీ నాయకులు 2022లో పావులు కదిపారు. రెవెన్యూ అధికారులు 75/1లో ఒక ఎకరా 75 సెంట్ల స్థలాన్ని సబ్‌డివిజన్‌ చేసి మరీ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.8 కోట్లు నుంచి రూ.10 కోట్లు వరకూ పలుకుతోంది. ఏడాదికి ఎకరాకు కేవలం రూ.వెయ్యి చొప్పున చెల్లించేలా 33 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఫీజులేవీ చెల్లించకపోవడంతో ఇంతవరకూ అధికారికంగా ప్లాన్‌ అప్రూవ్‌ కాలేదు. నిర్మాణం మాత్రం దాదాపు పూర్తిచేసేశారు. ఆ భూమిని వైసీపీ కార్యాలయ భవనానికి కేటాయించవద్దంటూ స్థానికులు కోర్టులో కేసు వేశారు. అది పెండింగ్‌లో ఉండగానే పనులు పూర్తి చేసేశారు.

విజయనగరంలో...

విజయనగరంలోని దాసన్నపేట రింగురోడ్డులో పట్టణ నడిబొడ్డున ఉన్న చెరువు గర్భంగా ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ భూమిగా మార్పు చేయించి వైసీపీ కార్యాలయం కోసం తీసుకున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని ఏడాదికి ఎకరానికి రూ.వెయ్యి చెల్లించేలా 33 ఏళ్లకు లీజుగా పొందారు. 2022 ఫిబ్రవరిలో స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలం విలువ రూ.ఐదు కోట్ల నుంచి ఆరు కోట్లు ఉంటుందని అంచనా.


రాజమహేంద్రవరంలో...

రాజమహేంద్రవరంలో వైసీపీ కార్యాలయం నిర్మాణం పనులు చేపట్టారు. ఆర్‌అండ్‌బీకి చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని ఏడాదికి రూ.1000కు లీజుకు ఇచ్చారు. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టారు. దాదాపుగా భవన నిర్మాణం పూర్తయింది. ఈ భవనానికి వెనుకే హెలిప్యాడ్‌ కూడా ఉంది.

విజయవాడలో

ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ కార్యాలయం కోసం విజయవాడ విద్యాధరపురం సితారా జంక్షన్‌ సమీపంలో గజం లక్ష రూపాయలు పలికే స్థలాన్ని కేటాయించారు. సుమారు 1850 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చారు. సుమారు రూ.20 కోట్లు విలువ చేసే స్థలాన్ని ఏడాదికి కేవలం రూ. 400కు లీజు ప్రాతిపదికన 33 ఏళ్లకు కేటాయిస్తూ 2022 డిసెంబరు 20న జీవో జారీ చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సెల్లార్‌ స్లాబు పూర్తయింది.

తిరుపతిలో...

తిరుపతి జిల్లా వైసీపీ కార్యాలయ భవనం రాజప్రసాదాన్ని తలపిస్తోంది. రేణిగుంట మండలం కుర్రకాల్వ రెవిన్యూ గ్రామం సర్వే నంబర్లు 219-15, 219-16లలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ 2022 డిసెంబరు 20న ప్రభుత్వం జీవో జారీ చేసింది. తిరుపతి విమానాశ్రయ సమీపంలో కార్బన్‌, సెల్కాన్‌ పరిశ్రమలకు చేరువలో ఉన్న ఈ భూమి మార్కెట్‌లో ఎకరా రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకూ పలుకుతోంది. ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి ధరతో 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయించింది. స్థానిక పంచాయతీ, తుడా అనుమతులు లేకుండానే నిర్మాణం దాదాపు పూర్తయింది.

అమలాపురంలో...

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణానికి సమీపంలో జనుపల్లి గ్రామంలో సర్వే నంబరు 48/1లో ఎకరం భూమిని వైసీపీ జిల్లా కార్యాలయం కోసం కేటాయించారు. వర్షాకాలంలో గ్రామంలో నుంచి వచ్చే నీరంతా ఇక్కడకు చేరుతుంది. ఈ చెరువును రెవెన్యూ అధికారులు ఏడాది క్రితం కేటాయించారు. జిల్లా వైసీపీ నాయకుల అనైక్యత వల్ల ఇక్కడ నిర్మాణాలను చేపట్టలేదు.


ఒంగోలులో...

ఒంగోలులో వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం నగర పరిధిలోని ఎన్నెస్పీ స్థలంలో 1.64 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. దీని విలువ సుమారు రూ.4.50 కోట్లు. ఏడాదికి ఎకరాకు రూ.1000 అద్దె ప్రకారం 33 ఏళ్లు లీజుకు రాసిచ్చారు. ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేయాలంటే జీవో ప్రకారం మొదటిసారే ఏడు వాయిదాల పన్ను (వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) చెల్లించాలి. అయితే కేవలం ఒక్క వాయిదా చెల్లించేలా ఆన్‌లైన్‌లో సవరణ చేశారు. ఇప్పటి వరకూ రూ.14.35 లక్షల పన్ను బకాయి ఉంది. మరోవైపు భవన నిర్మాణ అనుమతుల విషయంలోనూ సడలింపులు ఇచ్చారు. సుమారు రూ.20 లక్షల వరకూ ఫీజు చెల్లించాల్సి ఉండగా, రూ.7 లక్షలు మాత్రమే చెల్లించారు.

నెల్లూరులో...

నెల్లూరులోని భగత్‌సింగ్‌ కాలనీలో రూ.కోట్లు విలువజేసే రెండెకరాల స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయ నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించింది. ఎకరాకు ఏడాదికి రూ.1000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరం విలువ రూ.4 కోట్ల వరకు ఉంది. దాదాపు 80 శాతం వరకు నిర్మాణం పూర్తయ్యింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో శనివారం కార్పొరేషన్‌ అధికారులు ఆ నిర్మాణాన్ని పరిశీలించారు. ఎలాంటి అను మతులు లేవంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి నోటీసులు ఆరీ చేశారు.

కడపలో...

కడప నగరంలో చెన్నై వెళ్లే రహదారి సమీపంలో చిన్నచౌకు రెవెన్యూ పొలం సర్వే నంబరు 424/7లో రెండు ఎకరాలను వైసీపీ కార్యాలయ నిర్మాణానికి తీసుకున్నారు. ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున 33 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు. ఈ మేరకు 2022 డిసెంబరు 20న జీవో జారీ చేశారు. వైసీపీ కార్యాలయానికి అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. కేవలం ఖాళీ స్థలానికి పన్ను కట్టి నిర్మాణాలు సాగిస్తున్నారు.

రాయచోటిలో...

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో వైసీపీ కార్యాలయాన్ని ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారు. రాయచోటి మండలం మాసాపేట సర్వే నంబరు 1022/2లో 1.61 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేస్తున్నారు. 33 ఏళ్ల పాటు ఎకరాకు రూ.1000 చొప్పున లీజుకు 2022 జనవరి 18న ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ ఎకరా కోట్ల విలువ చేస్తుంది. దాదాపు నిర్మాణం పూర్తయింది.


బాపట్లలో...

బాపట్ల ఆర్టీసీ గ్యారేజ్‌ పక్కన ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ జిల్లా ఆఫీసు కోసం కేటాయిస్తూ 2022 డిసెంబరులో ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీఐఐసీ పరిధిలోని కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని ఎకరానికి ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించారు. అయితే, తమకు తెలియకుండా లీజుకు ఇచ్చారని ఆర్టీసీ ఉన్నతాధికారులు పోలీసు, రెవెన్యూ విభాగానికి 2022 లో ఫిర్యాదు చేశారు. ఏమైందో ఏమో ఆ తర్వాత ఆ స్థలాన్ని 2003లోనే ఏపీఐఐసీకి తిరిగి ఇచ్చేశామని ఆర్టీసీ అధికారులు చెప్పారు.

కర్నూలులో...

కర్నూలు ఐదు రోడ్ల కూడలిలో జలవనరుల శాఖ చెందిన సర్వే నంబరు 95-2బీలో 3.40 ఎకరాలు ఉంది. అందులో 1.60 ఎకరాలు ఏపీ ఆగ్రోస్‌ సంస్థది. దానిని వైసీపీ కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయం కోసం ఏడాదికి రూ.1,600 చొప్పున చెల్లించేలా 33 ఏళ్లు లీజుకు తీసుకున్నారు. దీని విలువ ప్రస్తుతం వంద కోట్ల పైమాటే!. అనుమతులు తీసుకోకుండానే భవనాన్ని దాదాపుగా నిర్మించారు. అనుమతులకోసం ఈ నెల 17న ‘కుడా’కు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేశారు. అయితే అవసరమైన ధ్రువపత్రాలు అటాచ్‌ చేయకపోవడంతో దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో నిబంధనలకు లోబడి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

నంద్యాలలో

నంద్యాల జిల్లాలో వైసీపీ కార్యాలయంపై మొదట్నుంచీ వివాదాలు నడుస్తున్నాయి. కుందూ నది ఒడ్డున పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వేసిన లేఅవుట్‌లో ఎకరా కేటాయించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణ పనులు చేపడుతున్నారు.

అనంతపురంలో..

అనంతపురంలో ఇరిగేషన్‌కు చెందిన సర్వే నంబరు 136-1బీ, 1బీ2, ఏ2లోని 1.50 ఎకరాల భూమిలో చేపట్టిన వైసీపీ జిల్లా కార్యాలయ భవనం దాదాపు పూర్తయింది. కనీసం అనుమతులకు దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఈ భూమి విలువ రూ.4 కోట్లకు పైమాటే. 33 ఏళ్లపాటు ఏడాదికి ఎకరానికి రూ.1000 చొప్పున లీజు చెల్లించేలా వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇప్పుడు ప్లాన్‌ అప్రూవల్‌ లేదంటూ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఏలూరులో...

ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియం పక్కన 2022 మే నెలలో రెండు ఎకరాల రెవెన్యూ భూమిని వైసీపీ జిల్లా కార్యాలయానికి కేటాయించారు. దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే ఈ భూమిని ఏడాదికి రూ.2వేలు చొప్పున (ఎకరాకు రూ.వెయ్యి) లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు లేకుండానే దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో పార్టీ కార్యాలయ నిర్మాణం దాదాపు 90 శాతం పైనే పూర్తి చేశారు.

కాకినాడలో...

కాకినాడలో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని అనుమతులేవీ లేకుండా నిర్మించారు. 49వ వార్డు పరిధిలోని పైడావారి వీధిలో జీప్లస్‌ వన్‌ విధానంలో 1.92 ఎకరాల స్థలంలో నిర్మాణం చేపట్టారు. పనులన్నీ 99 శాతం పూర్తయ్యాయి. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ.50 కోట్లపైనే పలుకుతోంది. ఎకరాకు వెయ్యి రూపాయలు లీజు చొప్పున 33 ఏళ్లపాటు కేటాయించారు.


శ్రీకాకుళంలో...

శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారికి ఆనుకుని పెద్దపాడు వద్ద మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి సమీపంలో ఎకరా యాబై సెంట్ల విస్తీర్ణంలో వైసీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. ప్రసుత్తం తొంబైశాతం నిర్మాణం పూర్తయింది. ఈ కార్యాలయం నిర్మాణానికి అనుమతులు లేవు.

పాడేరులో...

అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో పార్టీ కార్యాలయం నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం గిరిజన చట్టాలను ఉల్లంఘించింది. పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ నడిమివీధి గ్రామానికి ఆనుకుని ఉన్న రెండెకరాల భూమిని 33 ఏళ్లకు లీజు ఇచ్చేలా జీవో జారీ చేసింది. ఏడాదికి ఎకరానికి రూ.1000 చొప్పున లీజు చెల్లించేలా జీవోలో పేర్కొన్నారు. అయితే వ్యవహారం హైకోర్టుకు చేరడంతో నిర్మాణానికి బ్రేక్‌ పడింది.

గుంటూరులో...

గుంటూరులో వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి హిందూ ఫార్మసీ కళాశాల ఎదురుగా రూ. పది కోట్ల విలువైన 2,500 చదరపు గజాల నగరపాలకసంస్థ స్థలాన్ని 33 ఏళ్ల పాటు నామమాత్రపు లీజుతో కాజేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ స్థలానికి అప్రోచ్‌ రోడ్డు కేవలం 15 అడుగులే ఉండటంతో కొన్ని రోజుల తర్వాత వైసీపీ వెనకడుగు వేసింది.

ఉండి సమీపంలో..

పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ కార్యాలయం భవన నిర్మాణం కోసం ఉండి మండలం ఎన్‌ఆర్‌పీ అగ్రహారంలో 72 సెంట్లు స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. స్థానిక పంచాయతీలో తీర్మానం తిరస్కరించినా నిర్మాణం ప్రారంభించారు. స్థలం లీజు నెలకు రూ.720గా ఉన్నట్టు సమాచారం.

పార్వతీపురంలో..

పార్వతీపురంలో సర్వే నంబర్‌ 458 పార్ట్‌-2లో ఎకరా 18 సెంట్ల విస్తీర్ణంలో వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం సాగుతోంది. 2022 ఏప్రిల్‌ 23న ఏడాదికి ఎకరాకు రూ. వెయ్యి లీజు చెల్లించేలా రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని మొదట 33ఏళ్ల లీజుకు ఇస్తూ, దాన్ని 99 సంవత్సరాల వరకు పొడిగించుకునే వెసులుబాటును కల్పించారు. అనుమతులు కూడా పొందని ఈ నిర్మాణం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

Updated Date - Jun 24 , 2024 | 04:13 AM

Advertising
Advertising