Chandrababu : ధరలు తగ్గాలంటే.. జగన్ పోవాలి!
ABN, Publish Date - Apr 25 , 2024 | 04:49 AM
నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్ ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను తగ్గించాలంటే.. ఏసీలు ఆపితే సరిపోదు.
అప్పుడే పేదలకు మనుగడ.. 5 కోట్ల ప్రజల కోసమే కూటమిగా వస్తున్నాం: బాబు
ఉత్తరాంధ్ర గేట్‌వే భోగాపురం.. జగన్ నాడు ఎయిర్‌పోర్టును వ్యతిరేకించాడు
భూముల ధరలు పతనం చేశాడు.. ఆ వెంటనే ఆయన అనుచరులు
తక్కువకు వందల ఎకరాలు కొన్నారు.. గద్దెనెక్కాక ప్రభుత్వ భూములు దోచాడు
మేమొచ్చాక ఏడాదికల్లా విమానాశ్రయ నిర్మాణం పూర్తి
అయోధ్యలో రామాలయం నిర్మిస్తే రామతీర్థంలో రాముడి తల తీసేశారు
160 దేవాలయాలపై దాడులు.. భక్తుల మనోభావాలపై దెబ్బకొట్టారు
నేను పోరాడితే కేసు పెట్టారు.. అర్చకులను కూడా వదలడం లేదు
తండ్రి, బాబాయి మరణాలపై శవరాజకీయాలు.. టీడీపీ అధినేత నిప్పులు
విజయనగరం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్ ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను తగ్గించాలంటే.. ఏసీలు ఆపితే సరిపోదు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ స్విచాఫ్ చేయాలి. అప్పుడే పేద ప్రజలకు మనుగడ’ అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు గేట్‌వే అవుతుందని.. కానీ జగన్ దానిని పూర్తిచేయలేదని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వస్తే వచ్చే ఏడాదికల్లా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలనూ వంచించిన జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోరాడుతున్నాయని తెలిపారు. ప్రజాగళం-వారాహి యాత్రలో భాగంగా చంద్రబాబు, పవన్ బుధవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని సింగవరం, విజయనగరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని తొలగించాలంటే అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ద్వారానే సాధ్యమని గుర్తించామని.. 2015లోనే దీని నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేసి శంకుస్థాపన కూడా చేశామని తెలిపారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. ‘పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న లక్ష్యంతోటే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని నేడు సంకల్పించాను. ఇందుకోసం టీడీపీ హయాంలో 2,700 ఎకరాలు భూసేకరణ చేశాం. కానీ జగన్ దీనిని వ్యతిరేకించారు. దాని పరిధిలో భూముల ధరలు పతనమయ్యేలా చేశారు. ఇదే సమయంలో జగన్, ఆయన అనుచరులు వందలాది ఎకరాల భూములు తక్కువ ధరలకే కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూములను దోచుకున్నారు. మళ్లీ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. తాము కొన్న భూముల ధరలు పెంచుకునేలా వ్యూహం పన్నారు’ అన్నారు. ఇంకా ఏమన్నారంటే..
ఇలాంటివాడిని వదిలిపెడతారా?
నేను నెల్లిమర్ల రాగానే 2021లో రామతీర్థంలో రాముడి విగ్రహం తలనరికిన ఘటన జ్ఞాపకం వచ్చింది. అయోధ్యలో రామాలయం కడితే, సైకో జగన్ హయాంలో ఇక్కడి రాముడి తలతీసేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇటువంటి వాడిని వదిలిపెడతారా? రానున్న ఎన్నికల్లో చిత్తు, చిత్తుగా ఓడించాలి. రాష్ట్రవ్యాప్తంగా 160 దేవాలయాలపై దాడులు చే శారు. అర్చకులపై కూడా దాడి చేశారు. ఆయన ఈ ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టు తేలేదన్నారు. మేమొచ్చాక పరిశ్రమలను ఏర్పాటు చేసి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి సాగునీటిని అందిస్తాం. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే విలాసవంతంగా జీవించవచ్చు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, బీజేపీతో కలిసి నడుస్తున్నారు. జగన్ ప్రజల కోసం కాకుండా, తండ్రిని అడ్డుపెట్టుకుని వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. 2014లో తండ్రి చనిపోయినప్పుడు.. 2019లో బాబాయిని హత్య చేయించి శవ రాజకీయాలు నడిపాడు. తాజాగా గులకరాయి డ్రామా ఆడుతున్నాడు. గులకరాయి కన్పించలేదు గానీ.. తగిలిన గాయం మాత్రం ఎన్ని రోజులైనా తగ్గడం లేదు.. వచ్చే నెల 13 వరకూ ఈ డ్రామా కొనసాగిస్తాడు. ప్రజలు మాత్రం ఈ డ్రామాలను నమ్మొద్దు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించడం శోచనీయం. ఐటీ పరిశ్రమలు, పట్టణాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మా వల్లే సాధ్యమైంది. జగన్ వైఫల్యాలకు కొదవేలేదు.
తల్లి కుర్చీ లాక్కున్నాడు..
జగన్ తనస్వార్థం కోసం తల్లిని పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా కూర్చుండబెట్టాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ కుర్చీ లాక్కున్నాడు. జైల్లో ఉన్న కాలంలో చెల్లెలితో ప్రచారం చేయించుకున్నాడు. చివరకు ఆస్తులు కూడగట్టుకుని చెల్లికి అప్పులు మిగిల్చాడు. ఆయన రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా.?
హాయ్ ఏపీ.. బై బై జగన్ నినాదంతో.. వైసీపీని ఓటుతో తరిమికొట్టాలి. ‘వై నాట్ పులివెందుల’ అన్న నినాదంతో ముందుకు సాగుతున్నాం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి పులివెందులలో మరిన్ని బహిరంగ సభలు నిర్వహిస్తాం.
2014లో తండ్రి చనిపోయినప్పుడు.. 2019లో బాబాయిని హత్య చేయించి శవ రాజకీయాలు నడిపాడు. తాజాగా గులకరాయి డ్రామా ఆడుతున్నాడు. గులకరాయి కన్పించలేదు గానీ.. తగిలిన గాయం మాత్రం తగ్గడం లేదు.. రోజురోజుకూ పెరుగుతోంది.
- చంద్రబాబు
5 కోట్ల ఆంధ్రులకు భరోసా ఇవ్వడానికి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా వస్తున్నాయి. 2014లో బలమైన కూటమిగా ఎలా ఏర్పడ్డామో ఇప్పుడూ అలాగే వస్తున్నాం. గోదావరి జిల్లాల్లో స్వీప్ చేయబోతున్నాం.
- పవన్ కల్యాణ్
ఇంటింటికీ పెన్షన్లపై చర్యలు తీసుకోండి: చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): మే 1న రాష్ట్రంలోని ఇంటింటికీ పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ప్రజాప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. వలంటీర్లు లేని రాష్ట్రాల్లో కూడా ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ జరుగుతోందంటూ గతంలో హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం గుర్తు చేశా రు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పెన్షన్ అందించడం సాధ్యమవుతుందని సీఎస్ నిర్వహించిన సమావేశంలో కలెక్టర్లు ఇదివరకే తెలిపారన్నారు.
Updated Date - Apr 25 , 2024 | 04:57 AM