డబ్బులు అడిగితే బెదిరిస్తారా...!
ABN, Publish Date - Oct 03 , 2024 | 11:50 PM
టమోటా అమ్మి పది రోజులు గడిచింది. పంట అమ్మిన డబ్బులు ఇవ్వడానికి వారాల కొద్ది తిప్పుకుంటున్నారని, డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని వ్యాపారులపై టమోటా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట అమ్మిన రైతుల ఆగ్రహం
పత్తికొండ రైతు మార్కెట్‌లో వ్యాపారుల కమిషన దందా
ఫ చోద్యం చూస్తున్న అధికారులు
పత్తికొండ టౌన్, అక్టోబరు 3: టమోటా అమ్మి పది రోజులు గడిచింది. పంట అమ్మిన డబ్బులు ఇవ్వడానికి వారాల కొద్ది తిప్పుకుంటున్నారని, డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని వ్యాపారులపై టమోటా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. పత్తికొండ డివిజన పరిధిలో అధిక విస్తీర్ణంలో టమోటా పంటను సాగు చేశారు. టమోటా దిగుబడిని ప్రతిరోజు పది లారీల దాకా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి తీసుకువస్తున్నారు. ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ వ్యాపారులు మాత్రం రైతుల ఆశలను అడియాశలు చేస్తున్నారు. రైతులు అమ్మిన టమోటా దిగుబడికి ఏరోజుకారోజు వ్యాపారులు డబ్బులు చెల్లించాలి. అయితే.. రైతుల నుంచి నూటికి పది శాతం కమిషన తీసుకుని వ్యాపారులు డబ్బులు చెల్లిస్తుంటారు. ఇక్కడ టమోటాలు కొనుగోలు చేసిన వ్యాపారులే కమిషన ఏజెంట్లుగా వ్యవహరిస్తూ రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాడు. అయితే.. ఆ డబ్బు వెంటనే ఇవ్వడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత నెల 26న ఓ రైతుకు సుమారు 34 వేలు ఎంఆర్‌ఎస్ కంపెనీకి చెందిన వ్యాపారి చెల్లించాల్సి ఉంది. ఇట్లా రైతులకు డబ్బులు చెల్లించకుండా దగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గురువారం పలు గ్రామాలకు చెందిన రైతులు రసీదులు పట్టుకుని వ్యాపారుల దగ్గరకు వెళ్లి వారాల కొద్ది డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని నిలదీశారు. వ్యాపారులు మాత్రం తాము ఇచ్చినప్పుడే డబ్బులు తీసుకోవాలని, మీకిష్టమొచ్చిన వారికి చెప్పుకోండని రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారు - ఉప్పర వీరాంజనేయులు, రైతు, పత్తికొండ:
పత్తికొండ మార్కెట్‌లో టమోటాలు విక్రయించిన దానికి రెండు రోజుల కింద నాకు రూ.5వేల దాకా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. డబ్బులు ఇవ్వాలని అడిగితే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసికుని బెదిరిస్తున్నారు. అధికారులు వ్యాపారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.
ఫ రూ.34వేలు ఇవ్వాలి.. మల్లికార్జున, రైతు, కారుమంచి:
మాది ఆస్పరి మండలం, కారుమంచి గ్రామం. గత 26న టమోటాలను పత్తికొండ మార్కెట్‌లో అమ్ముకున్నాను. రూ.50వేల దాకా డబ్బులు రావాల్సి ఉంది. మా కుటుంబండం గడవమే కష్టంగా ఉంది. డబ్బులు ఇవ్వాలని అడిగితే.. వ్యాపారి దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
Updated Date - Oct 03 , 2024 | 11:50 PM