కుంచె కదిపితే అద్భుతాలే..!
ABN, Publish Date - Nov 29 , 2024 | 12:29 AM
సంప్రదాయ కళలకు పుట్టినిల్లైన మనదేశంలో వందల ఏళ్ల నుంచే కళలకు విశేష ఆదరణ ఉంది. 64 రకాల లలిత కళల్లో ఎందరో కళాకారులు తమ ప్రతిభను కనబరుస్తూనే ఉన్నారు.
చిత్రలేఖనంలో విశేష ప్రతిభ
కళలో ఉపాధిని ఎంచుకున్న వైనం
ఆత్మకూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): సంప్రదాయ కళలకు పుట్టినిల్లైన మనదేశంలో వందల ఏళ్ల నుంచే కళలకు విశేష ఆదరణ ఉంది. 64 రకాల లలిత కళల్లో ఎందరో కళాకారులు తమ ప్రతిభను కనబరుస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే చిత్రలేఖనంలో కూడా చాలా మంది రాణిస్తున్నారు. వీరిలో కేరళకు చెందిన రాజారవివర్మ 18వ శతాబ్దంలోనే చిత్రలేఖనంలో అద్భుతాలు కళాఖండాలను సృష్టించారు. వీరినే ఆదర్శంగా తీసుకున్న ఆత్మకూరుకు చెందిన షేక్‌మహ్మద్‌షఫి (చిన్ని) చిత్రలేఖనం కళపై తన ఆసక్తిని చాటుకున్నాడు. 1992లో పాణ్యంలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అవడంతో షఫికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. దీంతో తనకు చిన్నతనం నుంచే పేయింటింగ్ పట్ల మక్కువ ఉండటంతో 79 ఏళ్ల రిటైర్డు డ్రాయింగ్ మాస్టర్ కంబగిరి రాజు వద్దకు వెళ్లి తనకు డ్రాయింగ్ నేర్పించాలని కోరాడు. తనకు వయస్సు మళ్లిందని, నేర్పించడం చేతకావడం లేదని మాస్టార్ చెప్పినా బతిమిలాడి మరీ చిత్రలేఖనంలో శిక్షణ పొందాడు. తొలుత కాగితాలపై పెన్సిల్‌తో రాతలు, బొమ్మలు గీయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లి చిత్రలేఖనంలో మరెన్నో మెలకువలు నేర్చుకున్నాడు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో కట్‌ఔట్స్‌పై పేయింటింగ్ వేయడం, హైద్రాబాద్‌లో 400 అడుగుల సైజ్‌గల బోర్డులపై బొమ్మలు, రాతలు రాయడం, విజయవాడ, గుంటూరులలో ఔట్‌డోర్ పబ్లిసిటీ వర్క్‌లను నేర్చుకుని అందులోనే ఉపాధిని ఎంచుకున్నాడు.
కళతోనే ఉపాధి :
పాణ్యంలోని రిటైర్డు పోస్టుమాస్టర్ ఖాశీమ్, షేకునబీ దంపతుల కుమారుడైన షఫి ఇంటర్ ఫెయిల్ అవడంతో తన తల్లిదండ్రులు ఏదోఒక పని చూసుకోమని సూచించారు. అయితే డ్రాయింగ్ పట్ల షఫి ఆసక్తి చూపగా అందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. వారు వద్దనా వినకుండా అందులోనే తన ఉపాధిని పదిలపర్చుకున్నాడు. 2000 సంవత్సరంలో ఆత్మకూరులో వివాహం చేసుకోవడంతో ఇక్కడే చిన్నిఆర్ట్స్ షాప్‌ను ప్రారంభించి తన కళతోనే సంపాదన వైపు దృష్టి సారించాడు. అప్పట్లో గ్రాఫిక్స్‌తో కూడిన ఫ్లెక్సీలు లేకపోవడంతో ఎనామిల్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్‌తో తయారయ్యే బ్యానర్లు, ఇతర పెయింటింగ్ వర్కులకు విశేష ఆదరణ ఉండేది. ప్రతిరోజూ తీరిక లేనంత పని ఉండేది. అయితే ప్రపంచీకరణలో భాగంగా డిజిటల్ రంగం అభివృద్ధి చెంది గ్రాఫికల్ ఫ్లెక్సీలు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం చేతి రాతతో కూడిన బ్యానర్లకు ఆదరణ తగ్గింది. దీంతో 2015లో చిన్ని ఆర్ట్స్‌ను మూసివేసి అవకాశం దొరిగినప్పుడులా డ్రాయింగ్ పనులను చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అటవీశాఖలో అందివచ్చిన అవకాశాలు :
చిత్రలేఖనంలో అద్భుత ప్రతిభను సొంతం చేసుకున్న చిన్నికి ఆత్మకూరు అటవీశాఖ అధికారులు ఎన్నో అవకాశాలను కల్పించారు. డ్రాయింగ్‌లో చిన్ని ట్యాలెంట్‌ను గుర్తించి 2005లో అప్పటి ఆత్మకూరు డీఎఫ్‌వో అశోక్‌కుమార్ అటవీశాఖ పరిధిలో ఏర్పాటు చేసే వివిధ సూచిక బోర్డులపై చిత్రాలతో కూడిన రాతలు రాయించారు. అందరూ అభినందించే రీతిలో చిన్ని అటవీశాఖ బోర్డులపై అద్భుతమైన కళాఖండాలను జాలువార్చడంతో అప్పటి నుంచి నేటి వరకు అటవీశాఖలో ప్రతి పెయింటింగ్‌ను చిన్నితో వేయిస్తున్నారు. చిన్ని వేసే బొమ్మలన్ని జీవం ఉట్టిపడేటట్లుగా ఎంతో ఓపికతో తన కళను ప్రతిబింబిస్తున్నాడు. ఏ చిన్న పొరపాట్లకు తావివ్వకుండా గ్రాఫికల్‌తో తయారైన డిజైనగా భావించేట్టుగా తన చిత్రలేఖన ప్రతిభను కనబరుస్తున్నాడు. ఆత్మకూరు డివిజనలోని నాగలూటి, బైర్లూటి, ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు రేంజ్‌లో వందలాది బోర్డులపై వన్యప్రాణులు, పక్షుల బొమ్మలను వేసి వాటిపై సూచికలను పొందుపరుస్తున్నాడు. చిన్ని ప్రతిభను గుర్తించిన మార్కాపురం అటవీ డివిజన వారు సైతం చిన్నితో తమ డివిజన పరిధిలో కూడా వన్యప్రాణుల, పక్షి బొమ్మలను వేయించేలా అవకాశం ఇస్తున్నారు. కాగా చిన్ని గురించి తెలుసుకున్న నెల్లూరులోని నేలపట్టు, పులికాట్ సరస్సు తదితర ప్రాంతాల వారు కూడా చిన్నిని పిలిపించుకుని తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సూచిక బోర్డుల్లో పక్షుల బొమ్మలను గీయించుకుంటున్నారు. ఇలా తన కళతో చిత్రలేఖన కళాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలు - గుంటూరు అటవీ రహదారిపై చిన్ని వేసిన చిత్రాలు పర్యాటకుల్ని, ప్రయాణికుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నారు.
చిత్రలేఖనం కళకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి - షేక్‌మహ్మద్‌షఫి(చిన్ని), ఆర్టిస్ట్, ఆత్మకూరు :
భారతీయ సంప్రదాయాల్లో లలితకళలకు విశేష ఆదరణ ఉండేది. అలాంటిది నేడు కళల పట్ల ఆదరణ కరువవుతోంది. వీటిలో చిత్రలేఖనం పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. గ్రాఫికల్ టెక్నాలజీ కూడిన ఫ్లెక్సీల తయారీ జరుగుతుండటంతో చాలా మంది పెయింటింగ్‌తో కూడిన చిత్రాలు, వాల్ రైటింగ్స్, బ్యానర్లు తదితర వాటిపై ఆసక్తి చూపడం లేదు. తక్కువ ధరలకే ఫ్లెక్సీలు తయారవుతుండటంతో జనం వాటిపైనే మక్కువ చూపుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వాలు కూడా డ్రాయింగ్ టీచర్ల నియామకం చేపట్టడం లేదు. దీంతో చిత్రలేఖనంలో రాణించాలన్న కోరిక కూడా నేటి తరంలో లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాయింగ్ టీచర్ల నియామకం చేపట్టేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
Updated Date - Nov 29 , 2024 | 12:29 AM