మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీకి ఓటేస్తే నాశనమే!

ABN, Publish Date - Apr 27 , 2024 | 04:55 AM

‘సొంత చెల్లెలి దుస్తులపైనే కామెంట్‌ చేసే దిగజారుడు వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు.

వైసీపీకి ఓటేస్తే నాశనమే!

జగన్‌ మళ్లీ వస్తే ఎవరినీ బతకనివ్వడు

మహిళలకు రక్షణ ఉండదు

సొంత తల్లినే ఉపేక్షించని వ్యక్తి

వైసీపీ నేతలను వదులుతాడా?

ఆయన్ను నమ్మితే మీకూ కష్టాలే

గులకరాయి నిందితుణ్ని పట్టుకున్నారు

రథం తగలబెట్టినవారి సంగతేంటి?

ప్రచార సభల్లో పవన్‌ ధ్వజం

30న కూటమి మేనిఫెస్టో విడుదల

కాకినాడ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘సొంత చెల్లెలి దుస్తులపైనే కామెంట్‌ చేసే దిగజారుడు వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. వైసీపీకి మళ్లీ ఓటేస్తే మన నాశనం మనకు మనం కొని తెచ్చుకున్నట్లేనన్నారు. జగన్‌ మళ్లీ గెలిస్తే ఆడబిడ్డలకు రక్షణ ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం, రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. సొంత తల్లినే ఉపేక్షించని జగన్‌ భవిష్యత్‌లో వైసీపీ నేతలను కూడా వదలరని హెచ్చరించారు. తాను రోడ్డుపైకి వస్తేనే జనం రోడ్లపైకి వస్తున్నారని.. అన్యాయం జరిగితే మాత్రం బయటకు రావడం లేదని.. బయటకు వచ్చి పోరాడాలని.. వారి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేస్తానని భరోసా ఇచ్చారు. ఈ నెల 30న కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తామని, అందులో అన్ని వర్గాలకు సమన్యాయం ఉంటుందని తెలిపారు. సమయం మించిపోవడంతో ద్రాక్షారామ సభలో ఆయన ఐదు నిమిషాలే మాట్లాడారు. పవన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఆలోచించి ఓట్లేయకుంటే..

జగన్‌ పాలనలో ఎదురుతిరిగి మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాజధాని అమరావతి కోసం ఆందోళన చేసిన దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టించారు. నాపైనా అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎన్నికలకు ఇంకా 18 రోజులు ఉన్నాయి. ఆలోచించి ఓట్లేయకపోతే జగన్‌ ఎవరినీ బతకనివ్వడు. వివేకానందరెడ్డిని నరికి చంపిన వారిని భుజాలపై ఎత్తుకుని మోస్తున్నాడు. దీనిని ప్రశ్నించిన చెల్లెలి దుస్తులపై కామెంట్‌ చేస్తున్నాడు. సొంత చెల్లెలి వస్త్రాలను ఎవరైనా చూస్తారా..? వేసుకునే దుస్తుల రంగుల గురించి మాట్లాడతామా? పసుపు చొక్కా వేసుకున్నారని బంతిపూలు దేవుడికి వేయడం మానేస్తామా? ఎవరు ఏ దుస్తులు వేసుకుంటే ఏంటి? నా భార్యను తిడుతున్నారు. నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు భార్యను కూడా వదలకుండా బూతులు తిట్టారు. జగన్‌ మళ్లీ వస్తే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదు. జగన్‌ వచ్చాక కోనసీమ జిల్లాలో 20వేల ఎకరాల్లో రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించారు. ఆయన మళ్లీ వస్తే నాశనం కొని తెచ్చుకున్నట్లే. ఆ పార్టీకి ఓటేస్తే ఇక ఉద్యోగాలు ఉండవు. రైతులకు మద్దతు ధర ఉండదు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రభుత్వం మారుతోంది అనేది తెలిసిపోతోంది. వైసీపీ ఓడిపోతుందనడంలో సందేహమే లేదు.


దేహీ అని బతకాలా..?

వైసీపీ అక్రమాలపై నిలదీస్తున్నందుకు ప్రతి అడ్డమైన వెధవతో మాటలు అనిపించుకున్నాను. నా సినిమా వకీల్‌సాబ్‌ విడుదలప్పుడు నేను వెళ్లి జగన్‌ కాళ్లపై పడాలని అనుకున్నారు. కాళ్లమీద పడేకంటే సినిమాను యూట్యూబ్‌లో అయినా విడుదల చేస్తానని చెప్పాను. దేహీ అని బతకడం నా వల్ల కాదు. ఎర్రచందనం నరికి అమ్ముకునేవారి ఎదుట, కులాల మధ్య చిచ్చుపెట్టే వారు, తెలుగు సినీ రంగ ప్రముఖులను అవమానించిన వారి వద్దకు వెళ్లి నేను మోకరిల్లాలా? జగన్‌ గుర్తుపెట్టుకో.. ఇది 2024. గతంలో ఓ వివాహంలో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ మా పీలేరు జోలికి వస్తే ఊరుకోం. మా జోలికి వచ్చినా ఊరుకోం అన్నారు. అంటే.. ఎవరూ మీకు ఎదురు మాట్లాడకూడదా? మీరు మాత్రం అన్ని చోట్లా వేలు పెట్టేయొచ్చా? మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి, జగన్‌కు మేం భయపడం.

అవినీతి కోటలు బద్దలు కొడతాం

రాష్ట్రంలో సంపద వైసీపీకి, కష్టాలు మాత్రం ప్రజలకు! గనులు దోపిడీ చేసేవాళ్లే అందలం ఎక్కుతున్నారు. వారంతా మనలో ధైర్యం చంపేస్తున్నారు. ధైర్యం నింపే నాయకత్వం వస్తోంది. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొట్టబోతున్నాం. వలసలు ఆగాలన్నా,గుంతలు లేని రహదారులు కావాలన్నా ప్రతి ఒక్కరికీ అండగా ఉండే కూటమి ప్రభుత్వం రావాలి. పిఠాపురంలో గెలవబోతున్నాను.

పిఠాపురంలో నన్ను ఓడించడానికి ఎర్రచందనం దొంగలను దింపారు. పవన్‌ ధైర్యవంతుడు. జగన్‌ పదో తరగతి చదువుకుంటున్న రోజుల్లో నేను చెగువేరా విప్లవం గురించి చదివాను. ఆయన పిచ్చివేషాలు వేస్తున్న రోజుల్లో ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకాలు చదివాను. ఆయనలాంటి గూండాలకు బెదరను.

- పవన్‌ కల్యాణ్‌


దుష్టపరిపాలన ఆగాలి..

జగన్‌పై గులకరాయి విసిరిన నిందితుడిని పోలీసులు వెంటనే పట్టుకున్నారు. మరి అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతైతే నిందితులను ఇంకా ఎందుకు పట్టుకోలేదు? రకరకాల కారణాలు చెప్పి కేసును నీరుగార్చేశారు. పిచ్చోడి పని అన్నారు. తర్వాత తేనెపట్టుకు పెట్టిన మంటవల్ల రథం దగ్ధమైందన్నారు. రథం కాలిపోతే ఏమవుతుందని ఓ మంత్రి అపహాస్యం చేశారు. చివరకు కోనసీమలో కులాల మధ్య చిచ్చుపెట్టారు. ఇప్పటికీ అల్లర్ల కేసులో ఏ-1 అన్నె సాయిని మంత్రి విశ్వరూప్‌ పక్కనపెట్టుకుని తిరుగుతున్నారు. వారే గొడవలు సృష్టించారు. అందుకే దుష్ట పరిపాలన ఆగాలి.

Updated Date - Apr 27 , 2024 | 04:55 AM

Advertising
Advertising