ఏయూ ఇంజనీరింగ్‌కు ఐఐటీ హోదా?
ABN, Publish Date - Oct 07 , 2024 | 03:59 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలకు ఐఐటీ హోదా(ఐఐటీ తత్సమాన విద్యా సంస్థగా గుర్తింపు) కల్పించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
మరోసారి తెరమీదికి కీలక వ్యవహారం
2005-07లో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి ఆ హోదా ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్రం
సీట్లన్నీ నేషనల్ పూల్‌లోకి వెళ్తాయనే ఉద్దేశంతో అప్పట్లో నిరాకరించిన రాష్ట్ర ప్రభుత్వం, వర్సిటీ
తాజాగా సీఐఐ సదస్సులో మంత్రి లోకేశ్ ముందు ప్రస్తావన
ఉన్నత విద్యాశాఖ ఆదేశాలే ఫైనల్: వర్సిటీ
విశాఖపట్నం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలకు ఐఐటీ హోదా(ఐఐటీ తత్సమాన విద్యా సంస్థగా గుర్తింపు) కల్పించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల నగరంలో జరిగిన సీఐఐ సదస్సుకు హాజరైన మంత్రి నారా లోకేశ్ వద్ద కొందరు ఐటీ రంగ నిపుణులు ఈ ప్రతిపాదనను తెచ్చినట్టు తెలిసింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి ఐఐటీ హోదా ఇచ్చేందుకు 2005-2007 మధ్య కేంద్ర ఉన్నత విద్యాశాఖ సంకల్పించింది. దేశంలోని ఏడు ప్రాచీన, ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్య అందిస్తున్న కాలేజీలకు ఐఐటీ హోదా ఇవ్వాలని అప్పట్లో ఎస్‌కే జోషి కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులపై కేంద్రం అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖలతో చర్చించింది. అయితే, ఐఐటీ హోదా వస్తే ఇంజనీరింగ్ సీట్లన్నీ సెంట్రల్ పూల్‌లోకి వెళ్లిపోతాయని, రాష్ట్ర విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ, ఏయూ తిరస్కరించాయి. కేంద్ర ఉన్నత విద్యాశాఖ మరోసారి ఆనంద్‌కృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేసింది. అదే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఈఎ్‌సటీ) హోదా. ఈ హోదాతో సగం రాష్ట్రస్థాయిలో, సగం సీట్లు నేషనల్ పూల్‌లో భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించవచ్చునని పేర్కొంది. దీనికి ఉన్నత ఉన్నత విద్యా శాఖ, ఏయూ అధికారులు అంగీకరించలేదు. ఫలితంగా ఐఐటీ, ఐఐఈఎ్‌సటీ హోదాలు మరుగున పడిపోయాయి.
ఐటీ పరుగులు
సీఐఐ ప్రతినిధులు ప్రతినిధులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి ఐఐటీ హోదా అంశాన్ని తీసుకువెళ్లారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి ఐఐటీ హోదా వస్తే ఐటీ రంగం జోరు పెరుగుతుందని, ఐఐటీ హోదా ఉన్న కాలేజీలు ఉన్న చోట పరిశోధన కేంద్రాలు, రిసెర్చ్ హబ్స్ వంటివి ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. ఐటీ రంగానికి బూమ్ వస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో ఎంఎన్‌సీ కంపెనీలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. కేంద్రం నుంచి భారీగా నిధులు కూడా వస్తాయి. దీనిపై ఉన్నత విద్యాశాఖ అధికారులతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదే ఇబ్బంది
ఏయూ ఇంజనీరింగ్ విభాగానికి ఐఐటీ హోదా వస్తే ఇంజనీరింగ్ కాలేజీలోని సీట్లన్నీ పూర్తిగా సెంట్రల్ పూల్‌లోకి వెళ్లిపోతాయి. దీంతో స్థానిక(రాష్ట్ర) విద్యార్థులు దేశవ్యాప్తంగా పోటీ పడి సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఇది లోకల్ విద్యార్థులకు ఇబ్బందిగా మారనుందనే వాదన ఉంది. అందుకే ఈ విషయంలో వర్సిటీ అధికారులు వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుత వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి. శశిభూషణరావును వివరణ కోరగా గతంలో ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ప్రస్తుతానికి తాము ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదన్నారు. దీనిపై ఉన్నత విద్యా శాఖ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.
Updated Date - Oct 07 , 2024 | 03:59 AM