Viral News: శ్రీశైలం ప్రాజెక్ట్‌కి వెళ్తున్నారా.. చేప వంటకాలు రుచి చూడటం మర్చిపోకండి
ABN, Publish Date - Aug 08 , 2024 | 03:47 PM
సాధారణంగా రిజర్వాయర్లు, డ్యాంలు తదితర జలవనరులున్న ప్రాంతాల్లో చేపలను పట్టడం చూస్తునే ఉంటాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన రావాలనే ఉద్దేశంతో చేపలు అక్కడే ఫ్రై చేసి అమ్ముతుంటారు మత్స్యకారులు.
శ్రీశైలం: సాధారణంగా రిజర్వాయర్లు, డ్యాంలు తదితర జలవనరులున్న ప్రాంతాల్లో చేపలను పట్టడం చూస్తునే ఉంటాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన రావాలనే ఉద్దేశంతో చేపలు అక్కడే ఫ్రై చేసి అమ్ముతుంటారు మత్స్యకారులు. ఇది సాధారణంగా చాలా చోట్ల జరిగేది. మరి చేపల పులుసు దగ్గర్నుంచి చేపల బిర్యానీ వరకు అన్ని ఒక దగ్గరే దొరికితే.. అదీ.. మారుమూల గ్రామంలో అయితే ఒక పట్టుపట్టడమే లేట్ కదూ.
చేపల్లో ఎన్నో వెరైటీను వండి వడ్డించే గ్రామం ఉంది. అదీ శ్రీశైలం దగ్గర్లోనే. ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలంలోని లింగాల గట్టు అనే గ్రామం ఉంది. ఇక్కడ చేపల బిర్యానీ, చేపల చట్నీపైనే ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తుంటాయి. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రవాహంలో 5 నుంచి 30 కేజీల చేపలు జలప్రవహాంలోకి కొట్టుకొచ్చాయి. అయితే ఇక్కడి స్థానికులు ఏళ్లుగా చేపలతో వ్యాపారం చేస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులంతా డ్యాం చూడటానికి వస్తారు.
అనంతరం లింగాల గట్టులో అమ్మే చేపల రుచి చూస్తారని రవళి అనే వ్యాపారి చెప్పింది. ఈ గ్రామంలో 60 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ చేపల పులుసును అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారట. 200 మందికిపైగా మహిళలు చేపల పులుసు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారట. ఈ గ్రామానికి మరో ప్రత్యేకతేంటో తెలుసా. ఇక్కడ వ్యాపారం చేసేదంతా మహిళలే. వారి భర్తలు జలాశయంలో చేపలు పట్టడానికి వెళ్తుంటారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యాంలోనే ఉండి చేపలు పంపిస్తుంటారు. తెచ్చిన చేపలను కస్టమర్లు కొనుగోలు చేయొచ్చు. లేదా మహిళలకు డబ్బులిస్తే.. మనకు కావాల్సిన వంటకాలు అక్కడే వండిపెడతారు. చేపల కూర, ఫ్రై, బిర్యానీ, చట్నీ వంటివన్నీ తక్కువ ధరలోనే వండిస్తుంటారు. సాధారణంగా ఇక్కడ ఒక కేజీ చేపను రూ.150కు విక్రయిస్తున్నారు. వండి ఇవ్వాలంటే రూ.300 తీసుకుంటారన్నారు. చేప వండించుకున్న విధానాన్ని బట్టి ఇక్కడ ధరలు నిర్ణయిస్తారు. అయితే టూరిస్టులలో ఏపీ వారికంటే తెలంగాణవారే ఎక్కువగా చేపలు తీసుకెళ్తుంటారని రవళి తెలిపారు.
Updated Date - Aug 08 , 2024 | 03:47 PM