ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమలలో ఆగని దళారుల దందా

ABN, Publish Date - Jul 07 , 2024 | 03:12 AM

తిరుమలలో దళారీల దందా కొనసాగుతోంది. టీటీడీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో రూటు మార్చి పనికానిచ్చేస్తున్నారు.

ఆధార్‌ ఫొటో మార్చి గదులు అద్దెకు

ఆపై రూ.100గది రూ.వెయ్యి చొప్పున భక్తులకు

విజిలెన్స్‌ అదుపులో దళారీ

తిరుమల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో దళారీల దందా కొనసాగుతోంది. టీటీడీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో రూటు మార్చి పనికానిచ్చేస్తున్నారు. కొండకు వచ్చే భక్తులను ఏమార్చి వారి నుంచి తీసుకునే ఆధార్‌ కార్డుల్లో ఫొటో మార్చేసి గదులు పొందుతున్నారు. ఆపై రూ.వంద గదిని భక్తులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు. తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం దాదాపు 7,500 గదులు ఉన్నాయి. వీటిలో సగ భాగాన్ని ఆన్‌లైన్‌ ద్వారా కేటాయించి సంబంధిత జెరాక్స్‌లతో వచ్చిన వారికి తిరుమలలోని ఏఆర్పీ కౌంటర్‌లో కేటాయిస్తారు. అలాగే పద్మావతి, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో భక్తులకు సిఫారసు లేఖలపై గదులు కేటాయిస్తారు. ఇక, ఎలాంటి సిఫారసు లేని సామాన్య భక్తులకు సీఆర్వో జనరల్‌ కౌంటర్‌లో గదులు కేటాయిస్తారు. భక్తులు ఆధార్‌ కార్డును చూపించి, సెల్‌ఫోన్‌ నంబరు, పేరు ఇచ్చి కావాల్సిన ధరలో గదికి రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. కౌంటర్‌లోని సిబ్బంది రిజిస్ర్టేషన్‌ చేసుకున్న రసీదును భక్తుడికి అందజేస్తారు. ఆ తర్వాత భక్తుడు ఇచ్చిన సెల్‌ఫోన్‌ నంబరుకే కేటాయించే గది వివరాలు మెసేజ్‌ రూపంలో వస్తుంది. దాని ఆధారంగా భక్తులు ఆ కాటేజీ వద్దకు వెళ్లి నగదు చెల్లిస్తే గదిని కేటాయిస్తారు.

దళారీ ఏం చేస్తున్నాడంటే..

దళారీ తొలుత ఓ ఆధార్‌పై రూ.100 గదిని తీసుకుంటాడు. ఆ గది తాళం తీసుకుని తిరిగి సీఆర్వో వద్దకు వసాడు. అక్కడ గది కోసం ఇబ్బంది పడుతున్న భక్తులను గుర్తిస్తాడు. వారి వద్దకెళ్లి తన వద్ద రెండు గదులు ఉన్నాయని, కావాలంటే ఒకటి ఇస్తానని సామాన్య భక్తుడిలా నమ్మిస్తాడు. ఆ తర్వాత కేవలం తాళం మాత్రమే ఇచ్చి రోజుకు రూ.వెయ్యి అని వసూలు చేస్తాడు. ఆ సమయంలో భక్తుల నుంచి ఆధార్‌ జెరాక్స్‌ తీసుకుంటాడు. గది ఖాళీ చేసే సమయంలో తిరిగి దళారీ అక్కడికి చేరుకుని తాళం తీసుకుని భక్తులను పంపేస్తాడు. సాధారణంగా ఓ గదిని తీసుకుంటే 48 గంటల పాటు బస చేసే అవకాశముంటుంది. ఈ క్రమంలో రెండ్రోజులకైతే రూ.2వేలు తీసుకుంటాడు. ఆ తర్వాత భక్తుల ఆధార్‌ జెరాక్స్‌లో ఫొటో మార్చి.. తన ఫొటో పెట్టి ఆ జెరాక్స్‌తో మళ్లీ మరో గది ఇలాగే పొంది బ్లాక్‌లో విక్రయిస్తున్నాడు.

ఒక్కడే నెలలో 28 గదులు

ఈ తరహా అక్రమానికి పాల్పడిన అనంతపురానికి చెందిన నవకిషోర్‌ అనే వ్యక్తిని విజిలెన్స్‌ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతనొక్కడే జూన్‌తోపాటు జూలై 5వ తేదీ నాటికి దాదాపు 28 గదులు ఇలానే పొందినట్టు గుర్తించారు. ఈ తరహాలోనే దాదాపు 25 నుంచి 30 మంది దళారీలు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది.

Updated Date - Jul 07 , 2024 | 03:12 AM

Advertising
Advertising
<