జగన్ ఇంత పిరికితనమా.. సిగ్గు సిగ్గు
ABN, Publish Date - Jul 29 , 2024 | 03:12 AM
మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ప్రజాస్వామ్య హేళన దివాలాకోరుతనం.. ప్రజలను మోసం చేయడం మీకే చెల్లు
ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదు
ప్రతిపక్ష హోదాకే కాదు.. ఎమ్మెల్యేకీ అర్హులు కారు
అసెంబ్లీకి వెళ్లని మీరు తక్షణమే రాజీనామా చేయాలి: షర్మిల డిమాండ్
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘సిగ్గు సిగ్గు... మాజీ సీఎం జగన్! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం’ అంటూ షర్మిల మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ‘అసెంబ్లీకి పోననడాన్ని మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు జగన్. కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలాకోరుతనం. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ... మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని, రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని, నిండు సభలో అధికారపక్షం శ్వేతపత్రం విడుదల చేస్తుంటే... తాపీగా ప్యాలె్‌సలో కూర్చుని మీడియా మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్‌లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’ అని షర్మిల పేర్కొన్నారు.
Updated Date - Jul 29 , 2024 | 03:12 AM