pension : పింఛన్ పెంపు ఉత్తర్వులు జారీ
ABN, Publish Date - Jun 27 , 2024 | 02:25 AM
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
1న సచివాలయ ఉద్యోగులుఇంటింటికీ వెళ్లి పంపిణీ
2 రోజుల్లో పూర్తికి ఆదేశాలు
ఒక్కో ఉద్యోగి కనీసం 50 మందికి ఇవ్వాలని స్పష్టీకరణ
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టే వృత్తివారు, ట్రాన్స్‌జెండర్లు, ఏఆర్‌టీ, డప్పు కళాకారులు, ఆర్టిస్టు పెన్షన్‌దారులకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. దివ్యాంగులు, కుష్టురోగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచారు. పూర్తి వైకల్యం ఉన్న వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు, తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, లివర్, గుండె ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నవారు, డయాలసిస్ రోగులు తదితరులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. పెంచిన పెన్షన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. జూలై 1న ఒక్కో పెన్షన్‌దారుడు రూ.7 వేలు పొందే అవకాశం ఉంది. అనంతరం ప్రతి నెలా రూ.4 వేల పెన్షన్ అందుకోనున్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికెళ్లి పంపిణీ చేస్తారు. ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని, కలెక్టర్లు, అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Updated Date - Jun 27 , 2024 | 02:25 AM