జగన్‌కు హత్యా రాజకీయాలే ఎక్కువ
ABN, Publish Date - May 03 , 2024 | 05:09 AM
జగన్‌కు రాష్ట్రాభివృద్ధి కన్నా హత్యా రాజకీయాలే ఎక్కువ. బాబాయిని చంపిన హంతకుడిని జగన్ కాపాడుతున్నారు.
బాబాయిని చంపిన హంతకుడిని కాపాడుతున్నారు
కడప స్టీల్‌ప్లాంటుకు రెండుసార్లు శంకుస్థాపనలు
అయినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు
ఎంపీగా గెలిపిస్తే నేను మీ గొంతునవుతా
పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం పోరాడతా
జమ్మలమడుగు ఎన్నికల ప్రచారంలో షర్మిల
కడప/అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): జగన్‌కు రాష్ట్రాభివృద్ధి కన్నా హత్యా రాజకీయాలే ఎక్కువ. బాబాయిని చంపిన హంతకుడిని జగన్ కాపాడుతున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వివేకా రామలక్ష్మణుల్లా ఉండేవారు. వివేకాను గొడ్డలితో ఏడుసార్లు నరికి చంపారు. సీబీఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. అవినాశ్ అరెస్టు కర్ఫ్యూను తలపించింది’’ అంటూ పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎ్‌స షర్మిలా రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దముడియం, జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ‘కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే వైఎస్ ఆశయం. ఆయన బతికున్నప్పుడే బ్రహ్మణీ స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు పనులు కొంతమేర జరిగాయి. ఆయన మరణానంతరం ఆగిపోయాయి. అయితే కడప స్టీల్‌ప్లాంటుకు చంద్రబాబు ఒకసారి, జగన్ రెండుసార్లు శంకుస్థాపన చేసి దాన్ని శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చారు. స్టీల్‌ప్లాంటు పూర్తయి ఉంటే ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చేవి. ఇదేనా జగన్‌కు సొంత జిల్లాపై ఉన్న ప్రేమ?’ అని నిలదీశారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఽథర్మల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 2వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని చెప్పారని, ఇదే తొలి సంతకం అవుతుందని ఎర్రగుంట్లలో నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారం చేపట్టాక ఆ హామీని మర్చిపోయారని మండిపడ్డారు. తన మీటింగ్‌కు రానివ్వకుండా కార్మికులను అడ్డుకున్నారని ఆరోపించారు. కార్మికులు 7, 8వేల రూపాయల జీతంతో బతుకుతున్నారని, ఇది న్యాయమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీపీపీని కూడా ప్రైవేటుపరం చేసేందుకు చూస్తున్నారని అదానీ, అంబానీలకు కట్టబెట్టే యత్నం చేస్తున్నారని, జాతీయ సంపదను కొల్లగొట్టాలని చూస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. బాబు, జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నా కనీసం రాజధాని కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ర్టాలకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఉన్నాయని, మన రాష్ర్టానికి ఏముందని ప్రశ్నించారు. మూడు రాజధానులన్న జగన్ చివరకు ఒక్కటి కూడా లేకుండా చేశారని విమర్శించారు. ‘వివేకా ఆత్మ ఈ గడ్డ మీద ఘోషిస్తోంది. న్యాయం కోసం సునీత తొక్కని గడప లేదు. మా పక్క న్యాయం, ధర్మం ఉంటే... అటువైపు అన్యాయం, అధర్మం, డబ్బు ఉన్నాయి. కడప ప్రజలు న్యాయం వైపే నిలబడాలని కోరుతున్నా. ఎంపీగా గెలిపిస్తే నేను మీ గొంతునవుతా.. పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం పోరాడతా. స్టీలు ఫ్యాక్టరీ నిర్మిస్తాం. నేను మీ బిడ్డను... దేనికీ భయపడను. కొంగుచాపి న్యాయం అడుగుతున్నాం. హస్తం గుర్తుకు ఓటు వేసి వైఎస్‌ఆర్, వివేకాకు న్యాయం చేయండి’ అని షర్మిల కోరారు.
7న కడపలో రాహుల్ సభ
కాంగ్రెస్ పార్టీ ఈ నెల 7న కడపలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈ మేరకు రాహుల్ కార్యాలయం నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు గురువారం సమాచారం అందింది. జగన్ సర్కారు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాహుల్ ప్రసంగించనున్నారు.
జాబు రావాలంటే జగన్ పాలన పోవాలి!
నవ సందేహాల పేరిట జగన్‌కు షర్మిల లేఖ
అమరావతి/కడప, మే 2(ఆంధ్రజ్యోతి): ‘జాబు రావాలంటే బాబు పోవాలని ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు.. మరి మీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు?.. ఇప్పుడు జాబు రావాలంటే మీ పాలన పోవాలని అంగీకరిస్తారా’ అంటూ ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి జగన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు జగన్ ఇచ్చిన ఉద్యోగాల హామీ విషయంలో తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం జగన్‌కు ఆమె లేఖ రాశారు.
2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆ హామీ ఏమైంది? ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు?
ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు ఎందుకివ్వలేదు?
25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. 22 ఎంపీలను ఇస్తే ఏం చేశారు?
గ్రూప్-2 నోటిఫికేషన్ రెండుసార్లు ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదెందుకు?
విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు?
23 వేలతో మెగా డీఎస్సీ అని చెప్పి 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు? అది కూడా ఎన్నికల కోడ్‌కు అడ్డంకిగా మారే పరిస్థితులలో ప్రకటించడం మోసం కాదా?
రాష్ట్రంలో నిరుద్యోగులు 7.7 శాతం పెరిగారంటే అది మీ వైఫ ల్యం కాదా? మళ్లీ వలసలు మొదలైన మాట వాస్తవం కాదా?
స్కిల్ ట్రైనింగ్ సెంటర్లను ఎందుకు నిలిపివేశారు?
ఐదేళ్ల క్రితం జాబు రావాలంటే బాబు పోవాలని ప్రచారం చేశారు.. ఇప్పుడు జాబు రావాలంటే మీ పాలన పోవాలని అంగీకరిస్తారా?
Updated Date - May 03 , 2024 | 05:10 AM