కుంభకర్ణుడిలా జగన్
ABN, Publish Date - Apr 15 , 2024 | 03:01 AM
‘కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోయి, మరో ఆరు నెలలు మేలుకుని ఉంటాడు. కానీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నాలుగున్నర ఏళ్లు నిద్రపోయి, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆరు నెలల ముందు నిద్రలేచాడు’ అంటూ పీసీసీ
ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నిద్రలేచాడు
ఆరు వేల పోస్టులకే డీఎస్సీ నోటిఫికేషన్
జగన్ హామీలన్నీ మద్యం షాపుల్లో కనిపిస్తున్నాయి
అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్లు హోదా ఇస్తాం
ఎన్నికల సభల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హామీ
శ్రీకాళహస్తి/ సత్యవేడు/ పుత్తూరు, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ‘కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోయి, మరో ఆరు నెలలు మేలుకుని ఉంటాడు. కానీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నాలుగున్నర ఏళ్లు నిద్రపోయి, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆరు నెలల ముందు నిద్రలేచాడు’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఆదివారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు పట్టణాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. మెగా డీఎస్సీ అంటూ హడావుడిగా 6వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ పేరిట దగా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చాక దానిగురించి పట్టించుకోలేదని ఆరోపించారు. 23 వేల ఉద్యోగాలు ఇప్పుడూ ఖాళీగానే ఉన్నాయని, మెగా డీఎస్సీ పేరిట జగన్ కేవలం 6 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం మోసం, దగా కాదా అని షర్మిల నిలదీశారు. బూమ్ బూమ్ బీర్లు, స్పెషల్ స్టేటస్ విస్కీ, డీఎస్సీ బ్రాందీ... ఇలా జగన్ హామీలన్నీ మద్యం షాపుల్లో కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు, ఇంటిపన్ను, ఆర్టీసీ చార్జీలు నాలుగు సార్లు, విద్యుత్ చార్జీలు ఏడుసార్లు పెంచారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పదేళ్ల కింద మాట ఇచ్చిదని షర్మిల గుర్తు చేశారు. మొదటి ఐదేళ్లు సీఎంగా ఉన్న బాబు, తర్వాత ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్‌లో ఏ ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. మోసం చేసే వాళ్లకు, బీజేపీకి అమ్ముడుపోయే పార్టీలకు ఓట్లు వేయద్దని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు కల్పించే ఫైలుపైనే తొలి సంతకం అని షర్మిల స్పష్టం చేశారు. వృద్ధులకు, వితంతవులకు నెలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు పెన్షన్ నేరుగా వారి ఖాతాల్లోకే వేస్తామని, బటన్ నొక్కేది ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పదేళ్ల పాటు రాష్ర్టానికి ప్రత్యేక హోదా తీసుకువస్తుందని, రాహుల్ ప్రధాని కాగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఫైలుపైనే మొదటి సంతకం చేస్తారని తెలిపారు.
Updated Date - Apr 15 , 2024 | 03:01 AM