జగన్ అబద్ధాలను ఇక నమ్మరు
ABN, Publish Date - Jul 22 , 2024 | 04:24 AM
ప్రజలు ఛీకొట్టి ఛీత్కరించినా వైసీపీ నేతలు మారడం లేదని, వారి అబద్ధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని రాష్ట్రహోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు.
ప్రజలు ఛీకొట్టినా మారని తీరు
ఆటవిక పాలన గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటు
అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో ధర్నా అంటూ నాటకాలు
ఆయన రక్త చరిత్రను బయటికి తీస్తే గ్రంథాలవుతాయి
తప్పుడు ఆరోపణలు చేసినందుకు చర్యలు తీసుకుంటాం: అనిత
అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఛీకొట్టి ఛీత్కరించినా వైసీపీ నేతలు మారడం లేదని, వారి అబద్ధాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని రాష్ట్రహోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆదివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారం పోవడంతో జగన్‌కు బుర్రదొబ్బి ఎక్కడికెళ్లి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. అసత్యాలు, అబద్ధాలతో కూటమి ప్రభుత్వంపై బురదచల్లి, మళ్లీ సీఎం కావాలనే కలలు కంటున్నారని మండిపడ్డారు. ‘జరిగినవి వాస్తవంగా రాజకీయ హత్యలైతే, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రజల్లో విషపు బీజాలు నాటడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో పోలీసులను చెప్పుచేతుల్లో పెట్టుకుని రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపారు. జగన్ అధికారంలో ఉంటే ఇక బతకలేమన్న అభిప్రాయంలోకి నాడు ప్రజలు వచ్చారు. అందుకే వైసీపీకి 11 సీట్లు ఇచ్చి పాతిపెట్టారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగాయని పరామర్శకు వెళ్లి జగన్ అబద్ధాలు చెబుతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు వెంటనే ఇవ్వాలి. వివరాలు ఇవ్వకుంటే తప్పుడు ఆరోపణలపై చర్యలు తీసుకుంటాం. నిజంగా రాజకీయ హత్యలు జరిగింది నాలుగు మాత్రమే. ముగ్గురు టీడీపీ నాయకులే చనిపోయారు. జగన్ మాటలను జనాలు ఎలా నమ్ముతారు అనుకుంటున్నాడో కానీ, వ్యక్తిగత హత్యపై ప్రధానికి లేఖ రాసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నాడంటే.. ఆయన ఎంత ఘనుడో అర్థమవుతోంది.
నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపితే జగన్ వినుకొండ వెళ్లి మళ్లీ రెచ్చగొడుతున్నారు. జగన్ గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆడబిడ్డలపై జరిగిన అత్యాచారాల మీద మాట్లాడలేదు. చంద్రబాబు పాలనలో వెంటనే నిందితులను అరెస్టు చేసి జైలుకుపంపిస్తున్నాం. ఏ రోజూ కూడా ఒక సమీక్ష చేయని జగన్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే సిగ్గు అనిపించడం లేదా? సీఎం కుర్చీ కోసం సొంత బాబాయిని చంపిన వ్యక్తి, కోడికత్తి కేసులో ఒక దళితుడ్ని ఇరికించిన వ్యక్తి, మళ్లీ గులకరాయి డ్రామాతో సీఎం కావాలనుకున్న వ్యక్తి.. ఆటవిక పాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటు. సోమవారం నుంచి అసెంబ్లీ ఉండటంతో అసెంబ్లీకి వస్తే జగన్ బండారం బయటపడుతుందని, ఢిల్లీలో ధర్నా అంటూ నాటకాలు ఆడుతున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన జగన్‌పై చర్యలు తీసుకుంటాం. జగన్ రక్త చరిత్ర అంతా బయటకు తీస్తే గ్రంథాలవుతాయి. చిన్న పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రత్యేక కోర్టులు తీసుకొస్తాం. అత్యాచారాలపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసి జరుగుతున్న ఘటనలను పూర్తిగా అరికడతాం. దీనికి నాలుగైదు రోజుల్లో టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. జగన్ ఢిల్లీకి వెళ్లినా ఆయన చరిత్ర అందరికీ తెలిసిందే, ప్రజలే వారిని తిప్పికొడతారు’ అని అన్నారు.
Updated Date - Jul 22 , 2024 | 04:25 AM