Andhra Pradesh : అప్పుల కుప్ప
ABN, Publish Date - May 09 , 2024 | 05:13 AM
జగన్ పాలనలో ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. సంక్షేమ పథకాల అమల్లోనూ లబ్ధిదారుల జాబితాల్లో కోతలు, నిధుల కత్తిరింపులు, ఎగవేతలు, వాయిదాలు.
జగన్ పాలనలో రాష్ట్రం రుణాల ఊబిలోకి
ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.12.5 లక్షల కోట్లు
ఈ ఐదేళ్లలోనే 10 లక్షల కోట్ల భారం
కార్పొరేషన్ల అప్పులే 2.5 లక్షల కోట్లు
పెండింగ్ బిల్లులు 2 లక్షల కోట్లకు పైనే
నాడు సుద్దులు చెప్పి..
నేడు ఆర్థిక విధ్వంసం
అడ్డగోలుగా అప్పులు.. ఆస్తుల తాకట్టు
జగన్ పాలనలో ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. సంక్షేమ పథకాల అమల్లోనూ లబ్ధిదారుల జాబితాల్లో కోతలు, నిధుల కత్తిరింపులు, ఎగవేతలు, వాయిదాలు. కానీ అప్పులు చేయడంలో మాత్రం జగన్ సర్కారు రికార్డు సృష్టించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు చేయడం తప్పంటూ సుద్దులు చెప్పిన జగన్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. నేడు రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చారు.
పరిమితికి మించి అడ్డగోలుగా అప్పులు చేశారు. అడ్డదారుల్లో కార్పొరేషన్ల ద్వారా రుణాలు తెచ్చారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంపై మొత్తం దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల రుణభారం మోపారు.
ఆర్థిక క్రమశిక్షణలో ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాన్ని నేడు అప్పుల కుప్పగా మార్చారు. టీడీపీ ప్రభుత్వంలో పరిమితికి లోబడి అప్పులు చేసి, ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు తదితర పనులను పరుగులు పెట్టించారు. జగన్ సర్కారు వచ్చాక మొత్తం ప్రాజెక్టులన్నింటినీ ఆపేసింది. అందినకాడికి అప్పులు చేసి ఏం చేసినట్టు? రాష్ట్రానికి, ప్రజలకు ఏం ఉద్ధారకం చేసినట్టు? మరోవైపు ప్రజలపై ఎడాపెడా పన్నులు, చార్జీల పేరిట భారం మోపింది.
అమ్మ.. జగనా!
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని గగ్గోలు పెట్టారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటేస్తోందని నానాయాగీ చేశారు. అప్పులు చేస్తూ పోతే రాష్ట్రం ఏమైపోతుందని నాడు సుద్దులు చెప్పిన జగన్.. తాను అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కంటే ఐదారు రెట్లు ఎక్కువగా అడ్డగోలుగా అప్పులు చేశారు.
ఇంత దా‘రుణ’మా!
రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అప్పు రూ.లక్ష కోట్లు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేసిన రుణం రూ.1.6 లక్షల కోట్లు. 2019లో జగన్ సర్కారు వచ్చే నాటికి ఏపీ అప్పు 2.6 లక్షల కోట్లు. ప్రస్తుతం పెండింగ్ బిల్లులతో కలిపి ఆంధ్రప్రదేశ్ అప్పు 12.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే.. ఈ ఐదేళ్లలో జగన్ సర్కార్ రాష్ట్రంపై మోపిన రుణభారం అక్షరాలా దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు! ఇందులో కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు 2.5 లక్షల కోట్లు, పెండింగ్ బిల్లులు రూ.2 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.
నాడు సుద్దులు
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షనేతగా జగన్, ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడిగా, ఇప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక నిర్వహణ గురించి చెప్పని సుద్దులు లేవు. ఆర్థిక పరిస్థితిపై చేయని విశ్లేషణ లేదు. అప్పు రాష్ట్రానికి ముప్పన్నారు. అప్పు తేవడం ముమ్మాటికీ తప్పేనన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటిపోయి మరీ ఏపీ అప్పులు చేస్తోందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే అప్పులు చేయకుండానే రాష్ట్రాన్ని పాలిస్తామనే స్థాయిలో ప్రజలను నమ్మించారు. ఆర్థిక నిర్వహణ అంటే ఏంటో చూపిస్తామన్నారు. అభినవ ఆర్థిక వేత్తలుగా, ఆర్థిక సంస్కర్తలుగా పోజులిచ్చారు.
నేడు అప్పులే అప్పులు
అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన కొత్త ఆర్థిక పాఠాలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక 4 నెలలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన శ్వేతపత్రం విడుదల చేసి టీడీపీపై దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత తమ పాలనలోని ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఊసే లేదు. అప్పులు చేయడంలో జగన్ రికార్డు సృష్టించారు. బుగ్గన అయితే అప్పులు చేయడం తప్పెలా అవుతుందంటూ ఎదురు దాడి మొదలుపెట్టారు.
పరిమితికి మించి దొంగ దారుల్లో అప్పులు చేశారు. ఈ ఐదేళ్లలో ఏడాదికి రూ.లక్ష కోట్ల చొప్పున అప్పులు తెచ్చారు. చివరి రెండేళ్లలో అప్పు ఏడాదికి రూ.లక్ష కోట్లకు పైగా తెచ్చారు. ఇక కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు 2.5 లక్షల కోట్లు, పెండింగ్ బిల్లులు 2 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి అప్పుల అసలు, వడ్డీ కింద రూ.65,000 కోట్లు చెల్లిస్తున్నారు.
గ్యారెంటీ పెంచి అప్పులు
గతంలో అప్పులు చేయడాన్ని తప్పు పట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక అప్పుల కోసం ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చే పరిమితిని రెట్టింపు చేసేశారు. మునుపటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన రెవెన్యూ రాబడిలో 90 శాతం మాత్రమే గ్యారెంటీలు ఇవ్వాల్సి ఉండగా.. జగన్ సీఎం అయ్యాక గ్యారెంటీల పరిమితిని 180 శాతానికి పెంచారు. అంతకుమించి గ్యారెంటీ అప్పులు తీసుకొచ్చారు.
కేంద్రం ఆక్షేపణ
జగన్ సర్కారు చేసిన అప్పులపై కేంద్రం పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాలు ఇస్తుంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అక్కడ నిబంధనలన్నీ ఉల్లంఘించి అప్పులు తీసుకుంటున్నారు’ అని గతంలో కేంద్ర ఆర్థిక శాఖ ఆర్‌బీఐ ద్వారా జాతీయ బ్యాంకులను అప్రమత్తం చేసింది.
దీన్నిబట్టి జగన్ సర్కారు ఏ స్థాయిలో ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి విరుద్ధమని సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టం చేయడం గమనార్హం.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ గత ఏడాది మే 15న రూ.5,000 కోట్లను ఎన్‌సీడీలు జారీ చేయడం ద్వారా అప్పు తేవాలనుకుంది. కానీ, ఆ ట్రేడింగులో ఎవరూ పాల్గొనవద్దని ఇన్వెస్టర్లను బీఎ్‌సఈ హెచ్చరించడంతో అది ఆగిపోయింది.
అంతా రహస్యం
జగన్ ప్రభుత్వంలో జీవోలతో సహా అన్నీ రహస్యాలే. దొంగ అప్పుల వ్యవహారం బయటికొచ్చిందంటూ ఆ శాఖలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అప్పులు తేవడం మాత్రం మానలేదు. కార్పొరేషన్లకు ఎంత మొత్తం గ్యారెంటీ ఇచ్చారు? ఎన్ని అప్పులు తెచ్చారన్న విషయాన్ని ఐదేళ్ల నుంచి కాగ్ ప్రతి నెలా అడుగుతోంది. అయినా జగన్ సర్కార్ జవాబివ్వలేదు. అలాగే పబ్లిక్ అకౌంట్ నుంచి ఎంత వాడుతున్నారన్న విషయం చెప్పాలని కాగ్ అడగని నెల లేదు. ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. టీడీపీ హయాంలో సీఎం డ్యాష్‌బోర్డులో అన్ని శాఖల సమాచారం ఉండేది. జగన్ వచ్చాక వాటిని ఆపేశారు.
తాకట్టు దారుణాలు
జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలు, భూములను బ్యాంకులకు తనఖా రిజిస్ర్టేషన్ చేసి మరీ అప్పులకు తెగబడ్డారు. రోడ్లు భవనాల శాఖ ఆస్తులు, విశాఖలోని ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, పోర్టు భూములతో పాటు ఏకంగా రాష్ట్ర సచివాలయం కూడా తాకట్టు పెట్టి విచ్చలవిడిగా అప్పులు తెచ్చారు.
ఆదాయం దారి మళ్లింపు
ఖజానాకు రావాల్సిన ఆదాయాన్నైనా, ఒక శాఖకు రావాల్సిన ఆదాయాన్నైనా, ఒక పని కోసం ఖర్చు చేయాల్సిన నిధులనైనా, ఒక పథకం కోసం ఖర్చు చేయాల్సిన నిధులనైనా వేరే ఖర్చుల కోసం మళ్లించడం నేరం. జగన్ సర్కార్ ఈ నేరాన్ని ఐదేళ్లలో ప్రతి రోజూ చేస్తోంది. ముందుగా ఖజానాకు రావాల్సిన మద్యం వ్యాట్ ఆదాయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి, ఆ కార్పొరేషన్ ద్వారా రూ.25,000 కోట్ల అప్పులు తెచ్చారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వేసిన సెస్ ఆదాయాన్ని ఏపీఆర్‌డీసీకి మళ్లించి దాని ద్వారా రూ.7,000 కోట్ల అప్పులు తెచ్చారు.
అలాగే, కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సొంత అవసరాల కోసం వాడారు. దీంతో కేంద్రం పథకాల నిధుల కోసం ప్రత్యేకమైన బ్యాంకు ఖాతాలు ప్రారంభించింది. అయినప్పటికీ జగన్, బుగ్గనను పథకాల నిధులు మళ్లించకుండా కేంద్రం ఆపలేకపోయింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌ను ప్రారంభించి వివిధ శాఖల వద్ద ఉన్న డబ్బులు దాదాపు రూ.10,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. దీన్ని ఆర్‌బీఐ తీవ్రంగా తప్పుబట్టడంతో అంతటితో ఆ దుర్మార్గాన్ని ఆపేశారు. ఏపీఎ్‌సడీసీ నుంచి తెచ్చిన అప్పులపై వడ్డీ చాలా ఎక్కువ. రూ.25,000 కోట్ల అప్పులకు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.50,000 కోట్లు చెల్లించాలి.
కార్పొరేషన్లే ఏటీఎంలు
జగన్ ప్రభుత్వానికి కార్పొరేషన్లు ఏటీఎంలుగా మారాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో ఒక కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచో, పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీల నుంచో లేదా ఏకంగా స్టాక్ మార్కెట్ నుంచో వేల కోట్ల అప్పులు తెచ్చారు. మార్చి 1వ తేదీన కూడా రూ.7,000 కోట్లు అప్పు తెచ్చారు. జగన్ సర్కార్ ఆర్థిక దురాగతాలకు బలికాని కార్పొరేషనే లేదు.
2019లో రూ.12,000 కోట్లున్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు ఇప్పుడు రూ.50,000 కోట్లపైనే. ఆ తర్వాత ఏపీఎ్‌సడీసీ, ఏపీఆర్‌డీసీ, ఏపీఎ్‌సఎ్‌ఫఎ్‌ససీఎల్, ఏపీఎండీసీ, ఏపీ మారిటైమ్‌బోర్డు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా విచ్చలవిడిగా అప్పులు తెచ్చారు. జగన్ హయాంలో కార్పొషన్ల ద్వారా తెచ్చిన అప్పులే రూ.2.5 లక్షల కోట్లు దాటాయి.
జీఎ్‌సడీపీలో మాయాజాలం
జీఎ్‌సడీపీలో 3.5 శాతం మొత్తాన్ని కేంద్రం అప్పులకు అనుమతి ఇస్తుంది. దీంతో జీఎ్‌సడీపీ అంచనాలను ప్రతిఏడాది దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా పెంచి పంపుతుండటంతో రాష్ట్ర సామర్థ్యానికి మించి అప్పులకు అనుమతి వస్తోంది.
అలాగే పబ్లిక్ అకౌంట్ నెట్ ఖాతా నుంచి ప్రభుత్వం రూ.15,000 కోట్లు వాడుతోంది. కానీ రూ.400 కోట్లే వాడుతున్నట్టు కేంద్రానికి సమాచారం ఇస్తోంది. దీంతో కొత్త అప్పుల పరిమితి ఇంకో రూ.15,000 కోట్ల మేర పెరుగుతోంది. అలాగే జగన్ సర్కార్ పీడీ ఖాతాలతో విపరీతమైన ఆర్థిక అరాచకాలకు పాల్పడింది.
బిల్లు ఘొల్లు
పెండింగ్ బిల్లులను తదుపరి ఆర్థిక సంవత్సరంలోకి మైగ్రేట్ చేయడం లేదు. దీంతో ఆ బిల్లులు వ్యవస్థ నుంచి వెనక్కెళ్లిపోతున్నాయి. తిరిగి వ్యవస్థలోకి తీసుకురావాలంటే వాటికి మళ్లీ బడ్జెట్ పెట్టాలి. అన్ని అనుమతులూ తీసుకోవాలి. అవన్నీ లెక్కల్లోకి రాకుండా మురిగిపోయి ఉన్నాయి. ఇలాంటి బిల్లులు దాదాపు రూ.2 లక్షల కోట్లున్నాయి. ఇవి కూడా ప్రభుత్వ అప్పుల ఖాతాలోకి వస్తాయి.
ఆ రెండే పనులు
జగన్ అధికారంలోకి వచ్చాక అప్పులు తేవడం కోసం ఆర్థిక శాఖలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరి పని కేవలం కొత్తకొత్త మార్గాల్లో అప్పులు ఎలా పుట్టించాలా అని ఆలోచించడం మాత్రమే. ఇద్దరు ఉన్నతాధికారుల్లో ఒకరు రకరకాల మార్గాల్లో బయట నుంచి అప్పులు తెస్తుంటారు. మరొకరు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోని డబ్బులు లాగేసి, సొంత మనుషులకు బిల్లులు చెల్లిస్తుంటారు. ఆఖరికి బడ్జెట్ తయారీ పని కూడా లేదు. దానికోసం కన్సల్టెన్సీలను నియమించుకున్నారు.
నాడు జగన్ విమర్శలు
‘ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి అప్పులు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది? జీఎ్‌సడీపీలో 3 శాతం మాత్రమే అప్పులు తీసుకోవాలి. కానీ 8 శాతం అప్పులు చేస్తున్నారు’ అని 2016 బడ్జెట్ సమావేశాల సందర్భంగా జగన్ విమర్శించారు.
ఇప్పుడు నోరు విప్పితే ఒట్టు
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం జీఎ్‌సడీపీలో రాష్ట్రం అప్పులు 35 శాతం దాటకూడదు. కానీ జగన్ ప్రభుత్వం పంపిన తప్పుడు లెక్కల ప్రకారం లెక్కిస్తేనే అవి 42 శాతానికి చేరాయని కాగ్ హెచ్చరిస్తోంది. అనధికార అప్పులు కూడా కలిపితే అప్పులు 65 శాతానికి చేరుకుంటాయి. దీనిపై జగన్, బుగ్గన నోరెత్తరు.
- అమరావతి, ఆంధ్రజ్యోతి
Updated Date - May 09 , 2024 | 05:13 AM