ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Jagan Cases: జగన్‌ కేసులు మళ్లీ మొదటికి!

ABN, Publish Date - May 01 , 2024 | 05:06 AM

సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తండ్రి వైఎస్‌ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఈడీలు మొత్తం 20 చార్జిషీట్‌లు దాఖలు చేశాయి.

  • సీబీఐ కోర్టు జడ్జి బదిలీ

  • ఆది నుంచీ వినాల్సిన పరిస్థితి

  • కొత్త జడ్జికి సైతం పదవీకాలం తక్కువే

  • హైకోర్టు పర్యవేక్షించినా.. ఆలస్యంపై సుప్రీంకోర్టు ప్రశ్నించినా కదలని కేసులు

  • సునీల్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేత

  • ఎమ్మార్‌ కేసులో పిటిషన్‌లపై తీర్పు వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తండ్రి వైఎస్‌ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఈడీలు మొత్తం 20 చార్జిషీట్‌లు దాఖలు చేశాయి. ఈ కేసులపై సీబీఐ కోర్టులో గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆయా చార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్‌, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్‌లపై మంగళవారం తీర్పు వెలువడాల్సి ఉంది. వీటి పరిష్కారానికి హైకోర్టు ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించింది. ఈ గడువు సైతం ఏప్రిల్‌ 30తో ముగిసింది. మంగళవారం ఈ పిటిషన్‌లలో తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే, అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు పేర్కొన్నారు. ఇటీవల బదిలీల్లో రమేశ్‌బాబు సైతం వేరే కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ కారణంగా మళ్లీ మొదటి నుంచి కేసులు వినేందుకు మే 15కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 12 ఏళ్లుగా కొనసాగుతున్న విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. 2013 నుంచి సీబీఐ కోర్టులో ఏడుగురు జడ్జిలు బదిలీ అయ్యారు. తాజాగా రమేశ్‌బాబు సైతం బదిలీకావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి బదిలీల్లో తమ వద్ద రిజర్వు అయి ఉన్న కేసుల్లో తీర్పులు ఇచ్చి బదిలీ అయిన చోట రిపోర్ట్‌ చేయాలని హైకోర్టు బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే అనారోగ్య కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని జడ్జి రమేశ్‌బాబు పేర్కొన్నారు. 2022, మే 4 నుంచి ఆయన జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన డిశ్చార్జి పిటిషన్‌లపై సుదీర్ఘంగా వాదనలు విన్నారు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో బదిలీ కావడంతో ఆయన కేసులను తిరిగి ప్రారంభిస్తున్నట్టు(రీ ఓపెన్‌) ప్రకటించారు. దీంతో కొత్తగా వచ్చే జడ్జి మళ్లీ ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో మరో ట్విస్ట్‌ ఏమిటంటే కొత్తగా వచ్చే జడ్జికి సైతం రిటైర్‌మెంట్‌ వయసు దగ్గర పడిందని.. ఆయనకు కూడా ఎక్కువ కాలం పదవిలో ఉండరని చర్చ జరుగుతోంది. కేవలం డిశ్చారి పిటిషన్‌లకే దశాబ్దకాలం పడితే.. ప్రధాన కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయి? ఎప్పుడు శిక్షలు పడతాయి? అన్న అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి.

హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నా...

ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేసి.. తీర్పులు ఇవ్వాలని అశ్వినీ ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కేసులను హైకోర్టులు ప్రత్యక్షంగా పరిశీలించాలని.. దిగువ కోర్టులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు సుమోటోగా ఈ అంశాన్ని స్వీకరించింది. హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న డిశ్చార్జి పిటిషన్‌లను ఫిబ్రవరి 29లోగా పరిష్కరించాలని గతేడాది డిసెంబరులో పేర్కొంది. అయితే, భారీగా ఉన్న రికార్డులను పరిశీలించడంతోపాటు సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయాల్సి ఉందని.. 13 వేల పేజీల డిక్టేషన్‌ సిద్ధం చేస్తున్నందున మరింత గడువు కావాలని సీబీఐ కోర్టు కోరడంతో గడువును రెండు నెలలు(అంటే ఏప్రిల్‌ 30 వరకు) పొడిగించింది. ఈ నేపథ్యంలో చివరి రోజైన మంగళవారం తీర్పు వెలువడుతుందని అంతా భావించగా.. తనకు అనారోగ్యం వల్ల తీర్పు వెల్లడించలేకపోతున్నానని జడ్జి ప్రకటించడం సంచలనంగా మారింది.

ఎమ్మార్‌ కేసులో ఎదురుదెబ్బ

సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు.. ఎమ్మార్‌ కేసులో నిందితులు దాఖలు చేసిన 9 డిశ్చార్జి పిటిషన్‌లపై మంగళవారం తీర్పు వెలువరించారు. జగన్‌ సన్నిహితుడు ఎన్‌. సునీల్‌రెడ్డి , కోనేరు ప్రదీప్‌, విజయరాఘవ, శ్రీకాంత్‌ జోషి, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఎమ్మార్‌ హిల్స్‌, బౌల్డర్‌ హిల్స్‌ డిశ్చార్జి పిటిషన్‌లను కోర్టు కొట్టేసింది. మరో నిందితుడు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి బీపీ ఆచార్యపై 120బీ, 409 సెక్షన్లను తొలగించిన సీబీఐ కోర్టు.. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని పేర్కొంది. ఇతర నిందితులను కేసు నుంచి తప్పించడానికి నిరాకరించింది. నిందితులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని ప్రకటించింది. కాగా.. అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్స్‌ భారత్‌, ఆ కంపెనీ ఎండీ పునీత్‌ దాల్మియాకు హైకోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 50 చట్టబద్ధతను ప్రశ్నిస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం విచారణ ముగించింది.

Updated Date - May 01 , 2024 | 07:30 AM

Advertising
Advertising