Janasena : ప్రతి ఓటూ బాధ్యత గుర్తుచేసేదే
ABN, Publish Date - Jun 06 , 2024 | 04:23 AM
ప్రజలు మనల్ని బలంగా నమ్మారు. కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. మనకు వచ్చిన ప్రతి ఓటూ మన బాధ్యతను గుర్తుచేసేదే.
ప్రజలు నమ్మి కనీవినీ ఎరుగని విజయమిచ్చారు
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ కష్టాల్లోనే
వారికి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం పలకరించినా
జనసేన ఆఫీసు తలుపులు తెరిచే ఉంటాయి
ప్రజాప్రతినిధులు ఇలా ఉంటారని
ప్రజలు అనుకునేలా పని చేద్దాం
జనసేన పార్టీ విజేతలకు అధినేత పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ‘ప్రజలు మనల్ని బలంగా నమ్మారు. కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. మనకు వచ్చిన ప్రతి ఓటూ మన బాధ్యతను గుర్తుచేసేదే. ఐదు కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తరపున విజేతలుగా నిలిచిన అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ‘ప్రజల కష్టం నుంచి చెల్లించే పన్ను సొమ్మును ఓ ప్రజా ప్రతినిధిగా జీతం రూపంలో బాధ్యతగా తీసుకుంటాను. నేను రూపాయి జీతం తీసుకుంటాను లాంటి ఆర్భాటపు మాటలు మాట్లాడను. ప్రజా ఖజానా నుంచి సంపూర్ణ జీతం తీసుకుంటాను. ఎందుకంటే ప్రజలు... ‘మా పన్నుల ద్వారా వచ్చిన డబ్బును జీతంగా తీసుకుంటున్నావు. మాకు పనులు ఎందుకు చేసి పెట్టవు?’ అని అడగడానికి వారికి అజమాయిషీ ఉంటుంది. నాకు కూడా ప్రజల డబ్బులు జీతంగా తీసుకుంటున్నానే బాధ్యత నిరంతరం ఉంటుంది. ప్రజల నుంచి ఎంత జీతం తీసుకున్నా వెయ్యి రేట్లు దానికి మించి వారికి కష్టాల్లో ఇస్తాను. ప్రజలకు అన్ని కష్టాల్లో అండగా నిలుస్తాను. శాసనసభ సమావేశాలు, ప్రజాప్రతినిధుల మాటలు, టీవీల్లో చూస్తున్నప్పుడు భావితరాల వారు వాటిని స్ఫూర్తిగా తీసుకునేలా జనసేన నాయకులు మాట్లాడాలి. రాజకీయాలను కేరీర్ చేసుకోవాలనే స్ఫూర్తిని యువతలో నింపేలా జనసేన ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకూ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఇవ్వని గెలుపును రాష్ట్ర ప్రజలు జనసేనకు అందించారు. ఇదో పెద్ద బాధ్యత. దానిని అంతే సక్రమంగా నిర్వర్తించాలి. ప్రజాప్రతినిధులు అంటే ఇంత అద్భుతంగా ఉంటారా అని ప్రజలు మెచ్చుకునేలా పనిచేద్దాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా జనసేన కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయి’ అని పవన్ చెప్పారు.
Updated Date - Jun 06 , 2024 | 04:23 AM