గుప్త నిధుల కోసం తవ్వకాలు
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:32 PM
గుర్రంకొండలో గుప్త నిధుల ముఠా సభ్యులు పురాతన ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు.
పురాతన ఆలయం వద్ద లోతుగా తవ్విన గుంత
గుర్రంకొండ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): గుర్రంకొండలో గుప్త నిధుల ముఠా సభ్యులు పురాతన ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గుర్రం కొండ పట్టణానికి కూత వేటు దూరంలో తుపాకులచెరువు ఉంది. ఈ చెరువు కింద ఆయకట్టు పొలాల్లో పురాతన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం నేడు దూపదీపాలకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఆలయంలో గుప్త నిధులు ఉంటాయనే భావ నతో నాలుగు రోజుల క్రితం కొందరు ముఠా సభ్యులు బయట రాష్ట్రా ల నుంచి మాంత్రికులను పిలిపించి పూజలను చేయించారు. గుప్త నిధుల కోసం ఎక్స్‌కవేటర్‌తో ఆలయం ముందున్న మండపానికి ఓవైపు సుమారు 20 అడుగుల లోతు గుంతను తవ్వారు. ఈ తతంగమంతా పగటి పూట చేయడంతో పక్క పొలాల రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు చేరుకునేలోపే గుప్త నిధుల ముఠా సభ్యులు పరారయ్యారు. ఈ ముఠా సభ్యుల్లో కొందరు స్థానికులున్నట్లు తెలియడంతో పోలీసులు వారిని విచారిస్తునట్లు సమాచారం. ఈ విషయమై ఎస్‌ఐ మధురామచంద్రుడు వివరణ కోరగా ముఠా సభ్యుల వివరాలను సేకరిస్తునట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 11:32 PM