ఖతర్నాక్.. వీఆర్‌వోలు
ABN, Publish Date - Aug 30 , 2024 | 11:53 PM
జిల్లాలో ఖతర్నాక్ వీఆర్‌ఓల అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వంలో వీరు అక్రమార్కులకు కొమ్ముకాశారు. అందినకాడికి దోచుకొని వెనకేసుకున్నారు.
జలగల్లా.. జనాలను పీడించారు
వైసీపీ పాలనలో అందినంతా దోచుకున్నారు
ఇప్పుడు మళ్లీ కోరుకున్న చోట పోస్టింగ్‌ల కోసం..
అధికార పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో.. కొందరు వీఆర్‌ఓలు అంతులేని అవినీతికి పాల్పడ్డారు. జలగలకంటే హీనంగా జనాలను పీల్చి పిప్పిచేశారు. ఇంటిపట్టాలు, మ్యుటేషన్, అసైన్‌మెంట్ కమిటీ, ఇలా ప్రతి దాంట్లోనూ... పైసా లేనిదే.. పనిచేయలేదు. ప్రతిపనికీ వెలకట్టారు.. పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకు అవినీతిపరులకే మెడలో వీరతాడు వేస్తుండడంతో.. వీళ్ల ఆగడాలను అడిగే వాళ్లే లేకపోయారు. పెద్ద నాయకులే కాకుండా.. చోటామోటా నాయకులు చెప్పిందల్లా చేశారు. తరాలుగా సాగులో ఉన్న భూములకు కూడా రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌లో పేర్లు మార్చేశారు. అడ్డూఅదుపు లేకుండా ఇసుక, మట్టి అక్రమంగా తరలిపోతున్నా.. డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ వీఆర్‌ఓలకు ఇబ్బందులు తప్పవని అందరూ అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేందుకు అధికార పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడం జిల్లా రెవెన్యూ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.
(రాయచోటి-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖతర్నాక్ వీఆర్‌ఓల అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వంలో వీరు అక్రమార్కులకు కొమ్ముకాశారు. అందినకాడికి దోచుకొని వెనకేసుకున్నారు. ప్రజలను జలగల్లా పీక్కుతిన్నారు. దాదాపు ప్రతి గ్రామంలోనూ.. సహజసంపద వైసీపీ నాయకులకు ఆదాయవనరుగా మార్చేశారు. ఎవరికో ఇచ్చిన ఇంటి పట్టాలో ? మరెవరో ఇళ్లు కడుతుంటే.. అడ్డుకోవాల్సిన వీళ్లు... అక్ర మార్కులకే వంతపాడారు. ఇలా ఒకటా..? రెండా..? మూడా..? ఎన్నో.. ఎన్నెన్నో అక్రమాలకు తెరలేపారు. ఈ ఉపోధ్ఘాత మంతా.. చూడడానికి రెవెన్యూ శాఖలో కింది స్థాయి ఉద్యో గులు.. అక్రమార్జనలో పెద్దస్థాయిలో ఉంటున్న వీఆర్‌వోల గురించే. జిల్లాలో ఏ అతికొద్ది మంది మినహా మిగిలిన చాలా మంది వీఆర్‌వోలంటే.. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కాదని.. వెరీ రిచ్ ఆఫీసరని పేర్కొంటున్నారు. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో విచ్చలవిడిగా అక్రమ సంపాదనకు పాల్పడిన వాళ్లు.. కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేందుకు యత్నిస్తుండడం విశేషం. వీలైతే తాము పనిచేస్తున్న చోటునే ఉంచాలని... అదీ కుదరకపోతే.. పక్క గ్రామానికి.. ఇంకా కుదరకపోతే.. ఇప్పుడున్న మండలంలోనే ఉంచాలని అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.
రెండు చేతులా సంపాదన
రెవెన్యూ శాఖలో కింది స్థాయి ఉద్యోగి అంటే.. వీఆర్‌వోగా చెప్పవచ్చు. వీళ్లు చేసే ఉద్యోగం చిన్నదే అయినా.. ఏ ఫైల్ కదలాలన్నా.. వీళ్లు రిపోర్టు రాసి.. మొదలుపెట్టాలి. అంటే.. ఉద్యోగం చిన్నదైనా.. గట్టిదేనన్నమాట.. దీన్ని అడ్డం పెట్టుకుని.. చాలామంది రెండు చేతులా సంపాదించేశారు. గత ఐదేళ్లలో జిల్లాలో పనిచేసిన వీఆర్‌వోలను వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలో మినహా.. మిగిలిన వాళ్లు.. విచ్చలవిడిగా సంపాదించారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న కాలనీలు వీఆర్‌వోలకు బంగారు బాతుల్లాగా మారాయని చెప్పవచ్చు. ప్రభుత్వ భూములను అక్రమంగా కట్టబెట్టడం.. ఇప్పటికే ఉన్న భూములకు ఆన్‌లైన్, మ్యుటేషన్ చేయడం, అసైన్‌మెంటు భూపంపిణీ, ఇసుక అక్రమ రవాణా, మట్టి, రాళ్లు అక్రమ రవాణా ఇలా.. గ్రామ స్థాయిలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు.
సార్.. మీరు చెప్పినట్లే చేస్తాం
గత ప్రభుత్వంలో అనేక అక్రమాలకు పాల్పడిన వీళ్లు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ.. చక్రం తిప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పలువురు వీఆర్‌వోలు ఎమ్మెల్యేలను స్వయంగా కలిసి.. సార్... అప్పట్లో తమదేం తప్పులేదు.. వైసీపీ వాళ్లు చెప్పారు. చేయక తప్పలేదు.. ఇప్పుడు మీరు తమకు మంచి చోట పోస్టింగ్ ఇవ్వండి.. ఇక మీరు చెప్పినట్లే చేస్తామని చెప్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలను స్వయంగా కలవలేని వాళ్లు.. చోటా, మోటా నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. అన్నా... మీ సార్‌తో మాట్లాడి.. నన్ను ఇక్కడే ఉండేలా చూడు.. లేకుంటే పక్క గ్రామానికి పంపించు.. నీ రుణం తీర్చుకుంటా.. అంటూ బేరసారాలకు దిగుతున్నారు. ఇంకా కొందరు వీఆర్‌వోలు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని ముఖ్యనాయకులను మచ్చిక చేసుకునేందుకు.. తాము ఇప్పటివరకు పనిచేసిన గ్రామంలోని ప్రభుత్వ భూముల జాబితా ఆ నాయకులకు ఇస్తున్నట్లు సమాచారం. తాము ఇక్కడే ఉంటే.. ఈ ప్రభుత్వ భూములను మీరు కోరుకున్న వాళ్ల పేరు మీద మార్చేందుకు సహకరిస్తామని (ఏ మార్గంలో వెళ్తే పని అవుతుందో.. చెప్తామని) చెప్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు వీఆర్‌వోలు తాము కోరుకున్న చోట పోస్టింగ్ కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకుల నుంచి లెటర్లు తీసుకుని.. కలెక్టరేట్‌లో సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
అవినీతి వీఆర్‌వోల భాగోతాలలో మచ్చుకు కొన్ని..
జిల్లా కేంద్రం రాయచోటిలో ఓ వీఆర్‌వో అవినీతి అక్రమాలకు అడ్డేలేదని సమాచారం. సదరు వీఆర్‌వో పనిచేస్తున్న పరిధిలోనే జగనన్న కాలనీలు ఉండడం.. గతంలో ఎప్పుడో ఇచ్చిన ఇందిరమ్మ కాలనీల్లో ఇంటి పట్టాలు జోరుగా అమ్ముకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎవరికో ఇచ్చిన ఇంటి స్థలంలో మరెవరో ఇళ్లు కడుతున్నా.. సదరు వీఆర్‌వో ఎవరు డబ్బు ఇస్తే.. వాళ్లకే సపోర్ట్ చేస్తారనే పేరుంది. సదరు వీఆర్‌వో పలువురితో బేరసారాలు సాగిస్తుండగా.. ఫోన్‌లో రికార్డు చేసిన మాటలు సోషియల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పటికే ఓ మంచి ఇళ్లు కట్టుకున్న సదరు వీఆర్‌వో చేతిలో ఇంకా అనేక ఇంటి పట్టాలు అనధికారికంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడే పనిచేసే ఇంకో వీఆర్‌వోది మరో కథ.. ఆ వీఆర్‌వో వైసీపీ హయాంలో ముఖ్యనాయకులు అందరితోనూ మంచి సంబంధాలే నడిపాడు. వాళ్లు చెప్పిందల్లా చేశాడు.. తానూ సంపాదించుకున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇతన్ని చూసిన తోటి రెవెన్యూ సిబ్బంది.. ఇతనికి ఇబ్బందులు తప్పవేమో అనుకున్నారు. అయితే ఏమైందో. ? ఏమో.. ? ప్రస్తుతం అధికార పార్టీలో కొందరు నాయకులతోనూ.. బాగా సంబంధాలు నడుపుతున్నాడు.
- నిమ్మనపల్లెలోని ఇద్దరు వీఆర్‌వోలపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా ఇక్కడే పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి బదిలీ కాకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
- రైల్వేకోడూరు మండలంలో 23 మంది వీఆర్‌వోలు ఉండగా.. అందులో 16 మంది 8 సంవత్సరాలకు పైగా ఇక్కడే పనిచేస్తున్నారు. 23 మంది వీఆర్‌వోలలో చాలా మందిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయినా ఇక్కడే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ ముఖ్యనాయకుల దగ్గర లెటరు తీసుకుని కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది.
- పెద్ద తిప్పసముద్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్న విద్యాసాగర్‌ను ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియమించారు. దీంతో ఆయన అప్పట్లో వైఎస్సార్ నాయకులు చెప్పినట్లు నడుచుకున్నారు. ఇతను ఇసుక అక్రమ రవాణాకు సహకరించాడు. రీ సర్వేలో అవకతవకలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే.. ఇక్కడ తహసీల్దార్ విధుల్లో చేరినా.. ఇప్పటికీ ఇక్కడ డీటీగా విద్యాసాగర్ ఉండడం విశేషం. మండలంలో పనిచేసిన కొందరు వీఆర్‌వోలు ఇక్కడే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
- వాల్మీకిపురం మండలంలో 14 మందికి గానూ.. 12 మంది ఉన్నారు. వీరిలో చాలా మంది వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలకు తోడ్పడి.. ఇప్పుడు మళ్లీ ఇక్కడే ఉండేందుకు అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.
- తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో వీఆర్‌వోలలో పలువురు.. ఇక్కడి నుంచి వెళ్లిపోతే చాలు దేవుడా అని ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో అనేక తప్పులు చేశాము. ఇక్కడే ఉంటే.. అవి ఎక్కడ బయటపడతాయో అని ఆందోళన చెందుతున్నారు.
- సుండుపల్లె మండలంలోని వీఆర్‌వోలలో.. ఇద్దరి అక్రమాల జోరు ఎక్కువనే చెప్పవచ్చు. అక్రమార్కుల దగ్గర లక్ష రూపాయలు తీసుకుని అక్రమాలకు సహకరించారు. మండలంలో నాలుగైదు పంచాయతీలకు ఇన్‌ఛార్జ్‌గా తీసుకుని వసూళ్ల దందా కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రంలో ఇంటి పట్టాలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో.. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికావడం వెనుక కొందరి వీఆర్‌వోల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
- ఓబులవారిపల్లెలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్‌ను గత ప్రభుత్వంలో ఎఫ్‌ఏసీగా నియమించుకున్నారు. అప్పట్లో వైసీపీ అక్రమాలకు ఆ డీటీ పూర్తిగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడినా.. సదరు డీటీ బదిలీ కాకుండా.. ఇక్కడే ఉండడం విశేషం.
-కురబలకోట మండలంలో పనిచేసిన ఓ వీఆర్‌వో.. కంటేవారిపల్లె ప్రాంతంలో అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు మళ్లీ ఇక్కడే ఉండేందుకు అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ఇప్పటికైనా కూటమి ముఖ్యనాయకులు, ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడి.. బాగా సంపాదించిన వీఆర్‌వోలకు పోస్టింగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Updated Date - Aug 30 , 2024 | 11:53 PM