కార్యకర్తలకు అండగా ఉంటా: ఎమ్మెల్సీ
ABN, Publish Date - Oct 05 , 2024 | 11:44 PM
నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలుస్తానని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చారు.
జమ్మలమడుగు, అక్టోబరు 5: నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలుస్తానని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చారు. శనివారం జమ్మలమడుగు పట్టణంలోని నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపాన నూతనంగా వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ర్యాలీగా వెళ్లి నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దగ్గరలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులకు వచ్చినప్పుడు తనను జమ్మలమడుగులో యాక్టీవ్‌గా ఉండి కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండాలని చెప్పారని, అందులో భాగంగా నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు తాను అండగా నిలుస్తానన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దగ్గర ఉన్న కార్యకర్తలు, నాయకులు మొత్తం శనివారం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కార్యాలయం వద్దకు చేరుకున్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి జమ్మలమడుగులోని ఆయన కార్యాలయం వద్దకు వచ్చి కార్యకర్తలను, నాయకులకు ఫోన్లు చేసినా స్పందన లేదని తెలిసింది. ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు శ్రీనివాసులరెడ్డి, కేకే రమణారెడ్డి, కొమెర్ల మోహన్‌రెడ్డి, కౌన్సిలర్ ముల్లాజానీ, పొన్నపురెడ్డి శివారెడ్డి, గిరిధర్‌రెడ్డి, జడ్పీటీసీ మహాలక్ష్మి, సర్పంచ్ జయశ్రీ, రామాంజనేయులుయాదవ్, ఉప్పలపాడు యోబు, మల్కిరెడ్డి హనుమంతరెడ్డి, యనమల పురుషోత్తంరెడ్డి, నారాయుడు, సింగరయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 05 , 2024 | 11:44 PM