AP News: కడప కార్పొరేషన్ కౌన్సిల్ భేటీకి ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత
ABN, Publish Date - Nov 07 , 2024 | 12:19 PM
కడపలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వేదికపై మేయర్ పక్కన కూర్చోనివ్వకుండా కార్పొరేటర్లు కూర్చునే చోట కూర్చుకోవాలంటున్న పాలక వర్గ వైసీపీ నేతల తీరుపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి భగ్గుమన్నారు.
కడప: కడపలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వేదికపై మేయర్ పక్కన కూర్చోనివ్వకుండా కార్పొరేటర్లు కూర్చునే చోట కూర్చుకోవాలంటున్న పాలక వర్గ వైసీపీ నేతల తీరుపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి భగ్గుమన్నారు. కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలను తీసుకొని ఆమె మునిసిపల్ కార్పొరేషన్‌కు వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేను మినహా మిగతా ఎవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. లోపలికి వెళ్లిన మాధవి రెడ్డి.. ఇన్నాళ్లు కుర్చి వేసి ఇప్పుడు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. కార్పొరేటర్లలో కూర్చోవాల్సిన అవసరం ఏముందని ఆమె నిలదీశారు. ఈ అంశంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి.
భారీ భద్రత ఏర్పాటు..
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మేయర్ సురేశ్ బాబు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ తరుణంలో జరుగుతున్న కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ పక్కన ఎమ్మెల్యేను కూర్చోనివ్వకూడదని పాలక వైసీపీ వర్గం భావించింది. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలర్లు ఏమైనా జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఎస్పీకి ముందే ఫిర్యాదు వెళ్లింది. దీంతో పోలీసులు ముందస్తుగా భారీగా బలగాలను మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశార. ఎమ్మెల్యే మాధవి రెడ్డి భారీ కాన్వాయ్‌తో వచ్చారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు కూడా రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
కాగా కౌన్సిల్ సమావేశానికి సంబంధించి గత వారం రోజులుగా వివాదం కొనసాగుతోంది. వేదికపై మేయర్ మాత్రమే కూర్చోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు కింద వరుసలో కూర్చోవాలని వాదిస్తున్నారు. నేటి సమావేశంలో మేయర్ పక్కన కుర్చీలను కూడా తీసేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి మేయర్‌తో పాటు వేదికగా కూర్చోవడానికి ప్రయత్నిస్తారని, ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని ముందే భావించారు.
Updated Date - Nov 07 , 2024 | 12:29 PM