ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తంబళ్లపల్లెలో టెన్షన్‌..టెన్షన్‌...

ABN, Publish Date - Sep 01 , 2024 | 11:09 PM

తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆదివారం హై టెన్షన్‌ నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెలో జరుగుతున్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వస్తున్నారని సమాచారం రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కురబలకోట మండలం అంగళ్లులో భారీ సంఖ్యలో ఉన్న టీడీపీ శ్రేణులు

పెద్దిరెడ్డి కుటుంబం వస్తుండడంతో ఉద్రిక్తత

అడ్డుకునేందుకు భారీగా అంగళ్లుకు చేరుకున్న టీడీపీ శ్రేణులు

అంగళ్లు నుంచి తంబళ్లపల్లెకు టీడీపీ నేతను అడ్డుకున్న పోలీసులు

ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి దిష్టిబొమ్మ దహనం

ములకలచెరువు/కురబలకోట, సెప్టెంబరు 1: తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆదివారం హై టెన్షన్‌ నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెలో జరుగుతున్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వస్తున్నారని సమాచారం రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అరాచకాలు, దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడి, భూకబ్జాలు చేసి భూములు లాక్కున్న పెద్దిరెడ్డి కుటుంబానికి తంబళ్లపల్లె నియోజకవర్గానికి వచ్చే అర్హత లేదని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డితో పాటు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు వారిని అడ్డుకునేందుకు కురబలకోట మండలం అంగళ్లుకు చేరుకున్నారు. దీంతో అంగళ్లులో హైటెన్షన్‌ నెలకొంది. అలాగే టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబానికి నియోజకవర్గంలో అడుగుపెట్టే అర్హత లేదని నినాదాలు చేశారు. కాగా పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లెలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లెలోని ఆయన ఇంటికి శనివారం సాయంత్రమే చేరుకున్నారు. అలాగే ఆరు మండలాల నుంచి వైసీపీ ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే స్వగృహం వద్దకు చేరుకున్నారు.

ఎమ్మెల్యే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి అనుచరవర్గంతో వెళ్తున్నారని సమాచారం రావడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ములకలచెరువు, మదనపల్లె సీఐలు రాజారమేష్‌, వెంకట్రావు, ములకలచెరువు, తంబళ్లపల్లె ఎస్‌ఐలు గాయత్రి, లోకే్‌షరెడ్డిలు తమ సిబ్బందితో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పీటీఎం మండలానికి వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా ఎక్కడికీ వెళ్లకూడదని ఎమ్మెల్యేకు తెలియజేశారు. కాగా ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పీటీఎం మండలంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్టకు వెళుతున్నారని సమాచారం రావడంతో అంగళ్లులో ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డితో పాటు టీడీపీ శ్రేణులందరూ తంబళ్లపల్లెకు వెళ్లేందుకు వాహనాల్లో బయలుదేరుతుండగా అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణుల వాహనాలకు పోలీసు జీపు అడ్డుపెట్టారు. దీంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో తంబళ్లపల్లెకు చేరుకున్న మదనపల్లె డీఎస్పీ కొండయ్యనాయుడు, సీఐ రాజరమేష్‌ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి శాంతిభద్రతల దృష్ట్యా ఇక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తంబళ్లపల్లె నుంచి బయలుదేరి కుక్కరాజుపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం మీదుగా తిరుపతికి వెళ్లడంతో టీడీపీ శ్రేణులు శాంతించారు.

బ్రిటీషు దొరల మాదిరిగా ప్రజలను హింసించారు

టీడీపీ నేత జయచంద్రారెడ్డి

తంబళ్లపల్లె నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడ్డ పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇక్కడికి రానివ్వమని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి తెలిపారు. అంగళ్లులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి కుటుంబం నియోజకవర్గాన్ని దోచుకుని అరాచకాలకు, దైర్జన్యాలకు పాల్పడిందన్నారు. బ్రిటీషు దొరల మాదిరిగా ప్రజలను హింసించిన పెద్దిరెడ్డి కుటుంబం నియోజకవర్గానికి వచ్చే అర్హత లేదన్నారు. అరాచక పాలకులకు నియోజకవర్గంలో స్థానం లేదన్నారు. నియోజకవర్గానికి పెద్దిరెడ్డి కుటుంబం ఎప్పుడు రావాలని చూసినా శాంతియుతంగా నిరసన తెలిపి అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో నియోజవర్గ సమన్వయకర్త సీడు మల్లికార్జుననాయుడు, మండల అధ్యక్షుడు వైజీ సురేంద్రయాదవ్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌, జిల్లా కార్యదర్శి ఎర్రగుడి సురేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ కేవీ రమణ, నేతలు శ్రీనాధరెడ్డి, తులసీధర్‌నాయుడు, నరసింహారెడ్డి, మాజీ ఎంపీపీ తిమ్మరాయుడు, ఆయూబ్‌బాషా, శ్రీనివాసులు, ఆనంద్‌, చంద్ర అశోక్‌, బొగ్గు భాస్కర్‌ తదితరులతో పాటు ఆరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మద్దయ్యగారిపల్లెలో 144 సెక్షన్‌ విధింపు

పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెలో 144 సెక్షన్‌ విధించారు. గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వస్తున్నారని సమాచారం రావడంతో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున 144 సెక్షన్‌ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయాన్ని ఆర్‌అండ్‌బీ స్థలంలో నిర్మించారని అధికారులు తెలియజేశారు.

Updated Date - Sep 01 , 2024 | 11:09 PM

Advertising
Advertising