వైసీపీ పాపం.. వీఆర్‌వోలకు శాపం
ABN, Publish Date - Aug 31 , 2024 | 11:13 PM
ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం కులగణన సర్వే చేసేందుకు మొదలుపెట్టిన ప్రక్రయ, వలంటీర్లతో ఇంటింటికీ సర్వే వెరసి కుల ధ్రువీకరణ పత్రాల కోసం చేసిన దరఖాస్తులు రిజెక్ట్ (తిరస్కరించబడ్డాయి) అయ్యాయి. వైసీపీ పాలకులు చేసిన కులగణన పాపం నేడు వీఆర్‌వోలకు శాపంగా మారనుంది.
వలంటీర్లతో గంపగుత్తగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ల దరఖాస్తులు
రిజక్ట్ అయిన వేలాది సర్టిఫికెట్లు
సుమోటోగా విచారిస్తున్న సబ్‌కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా రిజెక్టెడ్ సర్టిఫికెట్లు ఎన్నెన్నో...?
మదనపల్లె టౌన్, ఆగస్టు 31: ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం కులగణన సర్వే చేసేందుకు మొదలుపెట్టిన ప్రక్రయ, వలంటీర్లతో ఇంటింటికీ సర్వే వెరసి కుల ధ్రువీకరణ పత్రాల కోసం చేసిన దరఖాస్తులు రిజెక్ట్ (తిరస్కరించబడ్డాయి) అయ్యాయి. వైసీపీ పాలకులు చేసిన కులగణన పాపం నేడు వీఆర్‌వోలకు శాపంగా మారనుంది. వేల సంఖ్యలో రిజెక్ట్ అయిన కుల ధ్రువీకరణ పత్రాలపై మదనపల్లె సబ్‌కలెక్టర్ సుమోటోగా స్వీకరించి వాటిపై నేరుగా గ్రామాల్లో పర్యటిస్తూ, సచివాలయాల్లో విచారిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని 30 మండలాల్లో ఎన్నికలకు ముందు కులధ్రువీకరణ చేసిన దరఖాస్తులు లక్షల సంఖ్యలో ఉండగా, అందులో రిజెక్ట్ అయిన దరఖాస్తులు సుమారు 60 వేలకు పైగా ఉండొచ్చని అంచనా. దీనిపై మిగిలిన సబ్‌కలెక్టర్, ఆర్డీవోలు కూడా సుమోటోగా తీసుకుని విచారిస్తే గ్రామ రెవెన్యూ అధికారుల పనితీరుతో పాటు, వలంటీర్ల తప్పిదాలు వెలుగులోకి వస్తాయి.
జిల్లాలో 60 వేలకు పైగా రిజెక్టెడ్ సర్టిఫికెట్లు...?
ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఆగమేఘాలపై కులగణన సర్వే మొదలు పెట్టింది. దీనికోసం ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కులగణన సర్వే చేపట్టారు. దీనికోసం గ్రామ, పట్టణ సచివాలయాల సిబ్బందికి ఒక్కొక్కరికి 100 ఇళ్ల చొప్పున కేటాయించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కులగణనపై సర్వే చేయాలి. కానీ ఇక్కడ సచివాలయాల సిబ్బంది, సర్వేకు వెళ్లకుండా వలంటీర్లపై ఆధారపడ్డారని సమాచారం. అంతేకాకుండా వలంటీర్లకు మొబైల్‌ఫోన్లు ఇచ్చి సచివాలయ సిబ్బంది లాగిన్‌లో సర్వే చేయించారు. అంతంత మాత్రమే పరిజ్ఞానం ఉన్న చాలామంది మొబైల్‌లో కుటుంబ యజమానుల వివరాలను తప్పుల తడకగా నమోదు చేశారు. ఇలా నమోదు చేసిన సర్వేలో ఏమైందో ఏమో కానీ ఈ వివరాలన్నీ వీఆర్‌వో లాగిన్‌కు కులధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో కుటుంబ యజమాని పేర్లు లేకుండా, అసలు కులమే తప్పులుగా, వెరిఫికేషన్ సర్టిఫికెట్లు లేకుండా మొబైల్‌లో దరఖాస్తులు వచ్చేశాయి. ప్రతి ఇంటి నుంచి ఈ విధంగా సర్వే పేరుతో దరఖాస్తులు రావడంతో జిల్లావ్యాప్తంగా లక్షల సంఖ్యలో కులధ్రువీకరణ దరఖాస్తులు వీఆర్‌వోల లాగిన్‌కు వచ్చాయి.
తప్పుల దరఖాస్తులు వేలల్లో రిజెక్టెడ్
కులధ్రువీకరణ పత్రాల కోసం వీఆర్‌వోల లాగిన్‌కు వచ్చిన దరఖాస్తులను వీఆర్‌లో క్షేత్రస్థాయిలో వెళ్లి విచారించాలి. ఎన్నికలకు ముందు పోలింగ్‌స్టేషన్‌ల ఏర్పాటు, ఓటరు జాబితా సిద్ధం చేయడంతో పాటు, రెవెన్యూ సేవల్లో వీఆర్‌వోలు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో కొంతమంది విచారించి కులధ్రువీకరణ పత్రాల్లో ఓసీ తప్ప మిగిలిన వాటిలో 25 శాతం రిజెక్ట్ చేసేశారు. అందులో దరఖాస్తుదారుడి తండ్రి పేరు లేకపోవడం, కొందరు చనిపోయి ఉండటం, వెరిఫికేషన్ సర్టిఫికెట్లు (విద్యార్థి టీసీ, కులసంఘాల రెకమండేషన్, తండ్రి కుల సర్టిఫికెట్)లు లేకపోవడం, డోర్‌నెంబర్లు తప్పుగా నమోదు చేయడం, కొందరు వలసవెళ్లి అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో వీఆర్‌వోలు కులధ్రువీకరణ పత్రాలను రిజెక్ట్ చేశారు. అందులోను దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే వీఆర్‌వోలు విచారించి బియాండ్ సమయంలోకి రాకముందే ధ్రువీకరణ చేయడం లేకుంటే రిజెక్ట్ చేయడం ముగించాలి. ఇందులో భాగంగా చాలామంది వీఆర్‌వోలు కులధ్రువీకరణ పత్రాలను రిజెక్ట్ చేశారు.
మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో 22,848 దరఖాస్తులు తిరస్కరణ
మదనపల్లె రెవిన్యూ డివిజన్‌లోని 11 మండలాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నెలలో వీఆర్‌వోల లాగిన్‌కు వచ్చిన దరఖాస్తుల్లో 22,848 తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో అత్యధికంగా మదనపల్లె పట్టణం, మండలంలో 6652 రిజెక్ట్ కాగా, బి.కొత్తకోట పట్టణం, మండలంలో 3638 రిజెక్ట్ అయ్యాయి. కలికిరి మండలంలో 2806, కురబలకోటలో 2203, ములకలచెరువులో 2133, నిమ్మనపల్లెలో 1388, రామసముద్రంలో 1049, పెద్దమండ్యంలో 1001, పీటీఎంలో 1000, వాల్మీకిపురంలో 498, తంబళ్లపల్లెలో 480 దరఖాస్తులు మొత్తం కలిపి 22,848 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
సుమోటోగా స్వీకరించి విచారిస్తున్న సబ్‌కలెక్టర్
మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో గంపగుత్తగా కులధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు వీఆర్‌వోల లాగిన్‌కు రావడం, అందులో 22,848 దరఖాస్తులు తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ వీటిపై దృష్టి పెట్టారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలను సుమోటోగా తీసుకుని మండలాల వారీగా విచారణ మొదలుపెట్టారు. తొలుత బి.కొత్తకోట, కలికిరి మండలం తరువాత మదనపల్లె మండలాల్లో గ్రామాలకు వెళ్లి స్వయంగా దరఖాస్తుదారులతో మాట్లాడుతున్నారు. దీంతో పాటు గ్రామ సచివాలయాలకు వెళ్లి ఎవరు దరఖాస్తు చేశారు..?ఎక్కడి నుంచి లాగిన్ అయ్యింది తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. కులధ్రువీకరణ దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారు. తదితర అంశాలను వీఆర్‌వోలను ప్రశ్నించారు.
బాధ్యులుగా మారుతున్న వీఆర్‌వోలు
నిత్యం రెవెన్యూ సేవల్లో ఉంటున్న వీఆర్‌వోలకు ఇటీవల అదనంగా ఫ్రీహోల్డ్ భూముల రీ వెరిఫికేషన్ విధులు వచ్చిపడ్డాయి. అంతేకాకుండా వ్యవసాయశాఖ అసిస్టెంట్లతో కలసి క్రాప్ ఇన్సూరెన్స్, హౌసింగ్, ఏఎ్‌సవో సర్వే అదనంగా వచ్చిపడటంతో వీఆర్‌వోలు బిజీ అయిపోయారు. ఇప్పుడు దీనికి అదనంగా రిజెక్ట్ అయిన కులధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను రీవెరిఫికేషన్ చేసే పనులు వచ్చి పడ్డాయి. వీటిలో ఏ అంశమైనా తప్పులు జరిగానా వీఆర్‌వోలు బాధ్యులుగా మారనున్నారు. మొత్తానికి వైసీపీ పాలకులు చేసిన కులగణన పాపం నేడు వీఆర్‌వోలకు శాపంగా మారనుంది. జిల్లాలో రాయచోటి, రాజంపేట రెవెన్యూ డివిజన్‌లలో కూడా ఎన్నికలకు ముందు దరఖాస్తు చేసుకున్న కులధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు వేలల్లో రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీలేరులో ఆర్డీవో రంగస్వామి వీటిపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. మిగిలిన మండలాల్లో కూడా ఉన్నతాధికారులు ప్రయత్నం చేస్తే రిజెక్ట్ అయిన దరఖాస్తులు, అందులో తప్పిదాలు ఎక్కడో బయటపడనున్నాయి.
Updated Date - Aug 31 , 2024 | 11:13 PM