నేడు స్వదేశానికి రానున్న బాధిత మహిళ
ABN, Publish Date - Sep 13 , 2024 | 11:17 PM
కువైత్‌లో చిత్రహింసలకు గురవుతున్నానంటూ సెల్ఫీ వీడియో పెట్టి కన్నీటి పర్యంతమైన మహిళ శనివారం స్వదేశానికి రానుంది. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చొరవ తీసుకుని గల్ఫ్ అధికారులతో మాట్లాడి ఆమెను స్వగ్రామానికి రప్పిస్తున్నారు.
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చొరవ
సంబేపల్లె, సెప్టెంబరు 13: కువైత్‌లో చిత్రహింసలకు గురవుతున్నానంటూ సెల్ఫీ వీడియో పెట్టి కన్నీటి పర్యంతమైన మహిళ శనివారం స్వదేశానికి రానుంది. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చొరవ తీసుకుని గల్ఫ్ అధికారులతో మాట్లాడి ఆమెను స్వగ్రామానికి రప్పిస్తున్నారు. వివరాల్లోకెళ్తే... సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లికు చెందిన తిరుపతి కవిత బతుకుతెరువు కోసం 8 నెలల క్రితం కువైత్‌కు వెళ్లింది. ఆమెకు ముగ్గురు కూమార్తెలు, భర్త వెంకటేశ్వర్లు ఉన్నారు. కాగా తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, కాపాడాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని కోరుతూ ఆమె గురువారం సెల్ఫీ వీడియో విడుదల చేసింది. దీంతో మంత్రి స్పందించి ఎలాగైనా ఆ మహిళను ఇండియాకు రప్పించాలని సంబంధిత మంత్రి, అధికారులకు లెటర్ రాశారు. కాగా అక్కడి అధికారులు ఆమెను ఇండియాకు పంపేందుకు అంగీకరించారని, ఆమె శనివారం ఉదయం ఇక్కడికి వస్తున్నట్లు ఆమె కుమార్తెలు తెలిపారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు అండగా నిలుస్తోంది. జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మొన్న వాయల్పాడు మండలం చింతపర్తికి చెందిన శివ ఎడారిలో తన బాధలను వ్యక్తం చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు సెల్ఫీ వీడియో పంపారు. అదేవిధంగా మదనపల్లికి చెందిన ఓ ముస్లిం మహిళ గల్ఫ్‌లో చిత్రహింసలు పడుతున్నానంటూ వీడియో విడుదల చేయడంతో వారిని ఇండియాకు రప్పించారు. కాగా ప్రస్తుతం సంబేపల్లె మండలం నారాయణరెడ్డిపల్లికి చెందిన తిరుపతి కవిత మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి పంపిన సెల్ఫీ వీడియోకు మంత్రి స్పందించారు. కాగా మహిళ స్వగ్రామానికి రానుండడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Sep 13 , 2024 | 11:17 PM