గుట్టలనూ ఆక్రమిస్తున్నారు!
ABN, Publish Date - Nov 09 , 2024 | 12:15 AM
మండలంలోని పలు గ్రామాల్లో కొండలు, గుట్టలు సైతం ఆక్రమణదారుల భూదాహానికి బలవుతున్నాయి. ఇలా ఆక్రమించిన భూములను చదును చేసి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నా పట్టించుకునే నాథులు లేకుండా పోయారు
వీరబల్లి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో కొండలు, గుట్టలు సైతం ఆక్రమణదారుల భూదాహానికి బలవుతున్నాయి. ఇలా ఆక్రమించిన భూములను చదును చేసి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నా పట్టించుకునే నాథులు లేకుండా పోయారు. ఈ విషయంపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుకున్న అధికారులు ఇది ప్రభుత్వ స్థలమని, ఎవరూ ప్రవేశించ రాదంటూ బోర్డులు నాటినా, వారు అటు వెళ్లగానే దానిని తొలగించి మరీ సాగు కొనసాగిస్తున్నారు. వంగిమళ్ల గ్రామంలోని పుల్లగూర గండి సమీపంలో ఉన్న ఊరగుట్టను ఇటీవలే కొందరు చదును చేసి సాగు భూమిగా మార్చారు. ఈ విషయం గుర్తించి గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని సందర్శించి ఇది ప్రభుత్వ స్థలం అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అనంతరం వారు పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారుడు ఆ భూమిలో పంట సాగు చేశాడు. ఈ విషయంపై మళ్లీ గ్రామస్థులు ఫిర్యాదు చేయ డంతో అధికారులు వచ్చి యథావిధిగా బోర్డ్లు నాటడంతో సరి పెట్టారు. వీరబల్లి మండల కేంద్రం సమీపంలోని చెక్‌పోస్ట్ వద్దనున్న పాలకొండను సైతం కొందరు చదును చేసి సాగు భూమిగా మార్చారు. ఈ విషయంపై కూడా స్థానికులు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకున్న సందర్భాలు కనిపిం చలేదు. పెద్దివీడు తదితర గ్రామాల్లో గుట్టలు, కొండలు చదును చేసి సాగుభూమిగా మార్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొండలు, గుట్టలు కనిపించకుండా పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఫిర్యాదు అందించిన వెంటనే వెళ్లి చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు. ఆక్రమణదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాగుభూమిగా మార్చిన ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చే ప్రసక్తే ఉండదని తెలిపారు.
- శ్రావణి, తహసీల్దారు
Updated Date - Nov 09 , 2024 | 12:15 AM