ఎమ్మెల్యే కొలికపూడిపై అధిష్ఠానం ఆరా
ABN, Publish Date - Sep 27 , 2024 | 01:00 AM
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై టీడీపీ అధిష్ఠానం ఆరా తీస్తోంది. గురువారం స్థానిక నాయకులకు టీడీపీ కాల్ సెంటర్ నుంచి ఐవీఆర్‌ఎస్ ఫోన్‌కాల్స్ వచ్చాయి.
తిరువూరులోని టీడీపీ నాయకులకు ఐవీఆర్‌ఎస్ కాల్స్
తిరువూరు/ఎ.కొండూరు, సెప్టెంబరు 26 : తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై టీడీపీ అధిష్ఠానం ఆరా తీస్తోంది. గురువారం స్థానిక నాయకులకు టీడీపీ కాల్ సెంటర్ నుంచి ఐవీఆర్‌ఎస్ ఫోన్‌కాల్స్ వచ్చాయి. ‘మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. అందరినీ కలుపుకొని పోతున్నారా.. చిట్యాల సర్పంచ్‌పై ఎమ్మెల్యే వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా లేదా’ వంటి ప్రశ్నలు అడిగారు.
ఆది నుంచి విమర్శలే..
కొద్దిరోజులుగా ఎమ్మెల్యే వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలపై దురుసుగా వ్యవహరిస్తుండటం, సామాజిక మాధ్యమాల్లో పత్రికలపై విమర్శలు చేయడం వంటి అంశాల నేపథ్యంలో అధిష్ఠానం గురువారం ఫోన్‌కాల్స్ ద్వారా స్థానిక నాయకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. నియోజకవర్గ పరిధిలోని తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాలకు చెందిన ముఖ్య నాయకులకు ఈ ఫోన్లు వచ్చాయి. నాయకులను నాలుగు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పనితీరు, ఆయన వ్యవహారశైలి, చిట్యాల సర్పంచ్‌పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తారా, ఖండిస్తారా, ఇసుక, మట్టి తోలకాల విషయంలో ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై నాయకుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే పనితీరు, వ్యవహారశైలి కారణంగా పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని మనస్థాపం చెందుతున్న కొందరు నాయకులు ఇక్కడ జరిగే విషయాలను అధిష్ఠానానికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. స్థానికంగా జరుగుతున్న అంశాలను టీడీపీ కాల్ సెంటర్‌తో పంచుకున్నారు.
Updated Date - Sep 27 , 2024 | 08:06 AM