AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నీటిపారుదల రంగంపై మంత్రి నిమ్మల కామెంట్స్
ABN, Publish Date - Nov 19 , 2024 | 10:22 AM
Andhrapradesh: గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల విమర్శించారు. కనీసం కాలువల నిర్వహణ పనులైన కలుపు తొలగింపు, పూడికతీత, షట్టర్ల మరమ్మత్తులు, అత్యవసర గండ్లు పూడిక మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ కూడా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబర్ 19: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు (మంగళవారం) ఉదయం సభ మొదలవగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఇందులో భాగంగా నిర్లక్ష్యానికి గురైన కాలువల మరమ్మతులు, నిర్వహణ, అడవిపల్లి రిజర్వాయర్ పనులు నిలిచిపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramaniadu) సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కనీసం కాలువల నిర్వహణ పనులైన కలుపు తొలగింపు, పూడికతీత, షట్టర్ల మరమ్మత్తులు, అత్యవసర గండ్లు పూడిక మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ కూడా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యవసర పనుల మరమ్మత్తులు చేసేందుకు రూ.363 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. కనీస నిర్వహణ లేక గత ప్రభుత్వంలో 1040 లిఫ్ట్ స్కీమ్‌లకు గానూ 450 స్కీమ్‌లు మూత పడ్డాయన్నారు.
RGV.. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ..
కాలువల నిర్వహణలో అత్యంత కీలకమైన లష్కర్లకు గత ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించలేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన అడవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను 2019లోనే నాటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని.. 2019-24 ఐదేళ్ళ పాలనా కాలంలో అడవిపల్లి రిజర్వాయర్‌ను పట్టించుకోకపోవడంతో చుక్క నీటిని కూడా గత వైసీపీ ప్రభుత్వం నిల్వ చేయలేకపోయిందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా హంద్రీనీవా పూర్తి చేయడానికి రూ.2600 కోట్లు నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయుంచారన్నారు. అడివిపల్లి రిజర్వాయర్‌కు నీరందించే మెయిన్ కెనాల్ పనులకు రూ.360 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
గిరిజన యువత శిక్షణపై మంత్రి సంధ్యారాణి ఏమన్నారంటే
అంతుకుముందు గిరిజన యువత, విద్యార్థులకు శిక్షణపై ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానం ఇచ్చారు. గిరిజన విద్యార్థులకు గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి శిక్షణ ఇవ్వలేదని.. కొద్దిమందికి శిక్షణ ఇచ్చి బకాయిలు పెట్టారని తెలిపారు. గిరిజనులకు పాడేరులో కాఫీ తోటల పెంపకంలో శిక్షణ ఇవ్వాలని.. కానీ వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు గంజాయి పెంపకంలో శిక్షణ ఇచ్చారని మండిపడ్డారు.
గిరిజనులకు శిక్షణ ఆపేసి గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మహిళలపై అత్యాచారాల, అక్రమ కేసులు పెట్టడం, భూ దురాక్రమణ లు, రౌడీయిజం లో శిక్షణ ఇచ్చారని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మళ్ళీ అన్ని ఐటీడీఏ ప్రాజెక్టుల పరిధిలో గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. మంత్రి సమాధానంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సంతృప్తి వ్యక్తం చేశారు.‘‘విష్ణు కుమార్ రాజు ప్రశ్న ఎంత విపులంగా అడిగారో మీరు అంతకంటే వివరంగా సమాధానం మంత్రి ఇచ్చారని’’ డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు.
మరోవైపు ఏపీ శాసనమండలి ప్రారంభమైంది. ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు, 104, 108 ఉద్యోగుల సమస్యలపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. విద్యారంగ సమస్యలపై పీడీఎఫ్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్ళి ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళనల మధ్యే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలిలో ఛైర్మన్ ప్రవేశపెట్టారు.
ఇవి కూడా చదవండి..
ఓ మై గాడ్.. బీచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ..
Real Latest AP News And Telugu News
Updated Date - Nov 19 , 2024 | 10:37 AM