CM Chandrababu: 150 రోజుల పాలనపై సభలో చంద్రబాబు ఏం చెప్పారంటే..
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:34 PM
Andhrapradesh: ‘‘నాలుగు దశాబ్ధాలుగా నన్ను ఆదరించారు. అందరికంటే ఎక్కువ సార్లు నన్ను ప్రజలు సీఎం చేశారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు.. జైలుకు కూడా పంపారు. బాంబు దాడి నుంచి శ్రీవారే నన్ను కాపాడారు. నేను ఏ తప్పూ చేయలేదు’’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
అమరావతి, నవంబర్ 20: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 150 రోజుల పాలనపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( (CM Chandrababu Naidu) మాట్లాడారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ చూడని ప్రజాతీర్పు వచ్చిందన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు కనిపించిందని తెలిపారు. ‘‘నాలుగు దశాబ్ధాలుగా నన్ను ఆదరించారు. అందరికంటే ఎక్కువ సార్లు నన్ను ప్రజలు సీఎం చేశారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు.. జైలుకు కూడా పంపారు. బాంబు దాడి నుంచి శ్రీవారే నన్ను కాపాడారు. నేను ఏ తప్పూ చేయలేదు. సీఎం అయ్యాక రాష్ట్రాన్ని బాగు చేస్తారా.. చేయగలుగాతాము అనే నమ్మకం ఉందా అని పలువురు నన్ను అడిగారు. నేను పారిపోను.. పారిపోలేను. అధికారం ఉన్నా.. అధికారం లేకపోయినా ప్రజల కోసమే పనిచేశాను. ఇప్పుడు కూడా ప్రజలు తీర్పు ఇచ్చి నన్ను గెలిపిస్తే.. అభివృద్ధి చేసి తీరుతాను అని ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చాను’’ అని సీఎం పేర్కొన్నారు.
TG Highcourt: పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. హైకోర్టు ఏం చెప్పిందంటే
ఎంత తవ్వితే అన్ని తప్పులు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. రాత్రికి రాత్రి ఏదీ జరిగిపోదన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వెంటిలేటర్‌పైకి వెళ్లిందన్నారు. కీలక సమయంలో ప్రజలు ఘన విజయం అందించారని చెప్పారు. ఢిల్లీలో పరపతి పెరిగిందని.. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందన్నారు. 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి రాగానే పెన్షన్లు రూ.4వేలకు పెంచామని చెప్పారు. విజయవాడ వరదల సమయంలో సీఎం సహాయనిధికి రూ.500 కోట్లు విరాళంగా వచ్చాయన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు శాపాలుగా మారాయన్నారు. ఎంత తవ్వితే అన్ని తప్పులు బయటపడుతున్నాయన్నారు. వైసీపీ అప్పులతో ఏపీ వెంటిలేటర్‌పైకి వెళ్లిందని విమర్శించారు. వైసీపీ పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని.. అప్పులపై లెక్కలతో సహా అసెంబ్లీలో చూపించామని అన్నారు.
ఆ బాధ్యత నాపై ఉంది...
‘‘వైసీపీ పాలనలో నా కుటుంబంపై ఆరోపణలు చేశారు. అధికారం కొత్త కాదు.. కేంద్ర రాజకీయాలు నాకు కొత్త కాదు. రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో సంక్షేమం మొదలుపెట్టాం. రూ.30 తో మొదలైన పెన్షన్... ఇప్పుడు రూ.4 వేలు చేశాం’’ అని అన్నారు. పేదల కోసం అనేక సంస్కరణలు, పథకాలు తీసుకొచ్చామని వెల్లడించారు. సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఘనత టీడీపీదే అని అన్నారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. టీడీపీ పాలనలో 120 సంక్షేమ పథకాలు ప్రారంభించామని తెలిపారు. ఏపీలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తనకు ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు పూర్తి అయ్యిందని.. 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసమే పరితపిస్తా అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు...
ఇప్పటికే రాష్ట్రంలో 101 అన్నా క్యాంటీన్‌లు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. బెజవాడలో వరద సమయంలో రూ.500 కోట్ల విరాళాలు వచ్చాయని.. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు కూడా స్పందించారన్నారు. ఏపీలో బుక్ చేసుకున్న వారందరికీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వేసింది కానీ.. చెత్త ఎత్తలేదని విమర్శించారు. ఏపీలో 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పెరుకుపోయిందని తెలిపారు. ‘‘మేం చెత్తపన్ను రద్దు చేశాం.. చెత్తను తీయిస్తున్నాం’’ అని తెలిపారు.
అమరావతి కొనసాగి ఉంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చేదని.. అయినా కూడా అమరావతికి పూర్వవైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. పెట్టుబడులు ఆకర్షించడానికి చేయాల్సిన పనులు చేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో రోడ్లన్నీ గుంతలు పెట్టి వెళ్లారని మండిపడ్డారు. గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి పుట్టే పరిస్థితి వచ్చిందన్నారు. రోడ్ల గుంతలు పూడ్చడానికి రూ.860 కోట్లు విడుదల చేశామన్నారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు తయారుచేస్తామని వెల్లడించారు. రోడ్ల నిర్మాణానికి వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నామన్నారు. రూ.75 వేల కోట్లతో ఏపీలో నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయని.. రూ.30 నుంచి 40 వేల కోట్ల పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. అమరావతి రైల్వే లైన్‌కు కూడా కేంద్రం సహకరించిందని చెప్పుకొచ్చారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఓట్ల సంబురం
వారి జోలికొచ్చారో ఖబడ్దార్...
ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటించామని.. పరిశ్రమల కోసం 25 పాలసీలు తీసుకొచ్చామన్నారు. ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎన్‌టీపీసీ, జెన్‌కో జాయింట్ వెంచర్‌తో విశాఖలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారని.. రూ.65 వేల కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ బయోగ్యాస్ రాబోతోందన్నారు. రిలయన్స్ బయోగ్యాస్‌తో రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. కరుడుగట్టిన నేరస్తులకు ఏపీలో స్థానం లేదన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తామని.. ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. నేరాలు చేస్తే తాట తీస్తామని, దోషులకు శిక్షల విషయంలో రాజీలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
రెహ్మాన్ డైవర్స్.. అమీన్ ఎమోషనల్
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 20 , 2024 | 01:57 PM