పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్య సేవలు
ABN, Publish Date - Nov 21 , 2024 | 01:10 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర బృందం నోడల్ అధికారి డాక్టర్ నరేష్ అన్నారు.
ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర బృందం నోడల్ అధికారి డాక్టర్ నరేష్
ఉంగుటూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర బృందం నోడల్ అధికారి డాక్టర్ నరేష్ అన్నారు. కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పీహెచ్‌సీల పరిశీలనలో భాగంగా బుధవారం ఇందుపల్లి పీహెచ్‌సీని డాక్టర్ నరేష్ ఆధ్వ ర్యంలోని బృందం సందర్శించింది. ఆస్పత్రిలో పలు రికార్డులు, రిజిస్టర్లను బృందం తనిఖీ చేసింది. సిబ్బందికి పలు సూచనలు చేసింది. తొలుత ఆస్పత్రి ప్రాంగణమంతా కలియతిరిగిన బృందం డెలివరీ రూమ్, ఆపరేషన్ థియేటర్, మందుల గది, ల్యాబ్ రూమ్‌లను పరిశీలించింది. రోగులకు అందుబాటులో ఉంచిన మందులు, ల్యాబ్‌లో చేస్తున్న టెస్టులపై ఆరా తీసింది. 64 ల్యాబ్ టెస్టులకు బదులు 44 జరుగుతున్నాయని, 172రకాల మందులు అందుబాటులో ఉ న్నాయని వైద్యాధికారులు బృందానికి వివరించారు. వైద్యసేవలను మరింత విస్తృతపరిచేందుకు కావాల్సిన వస్తువులు, వైద్యపరికరాలపై సిబ్బందితో సమీక్షించారు. వైద్యాధికారులు డాక్టర్ బి.శిరీష, డాక్టర్ వీవీ సుబ్బారావు పాల్గొన్నారు.
పీహెచ్‌సీల తనిఖీ
ఉయ్యూరు: మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కె.పద్మావతి బుధవారం తనిఖీ చేశారు. చిన ఓగిరాల పీహెచ్‌సీలో ఓపీ, ఇన్‌పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం అంతా కలియ తిరిగి పరిశుభ్రతను పరిశీలించారు. రికార్డులు, మందుల నిల్వలపై ఆరా తీశారు. ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలు, మందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక కేంద్రం వైద్య అధికారి తేజస్వి, ఇతర వైద్యులు, సిబ్బందిని పలు అంశాలపై ప్రశ్నించారు. ఉయ్యూరులో అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆమె పరిశీలించారు.
Updated Date - Nov 21 , 2024 | 01:10 AM