Share News

ద్వీపంలో దోపిడీ

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:47 AM

నగరంలోని భవానీ ద్వీపం, హరిత బర్మ్‌పార్క్‌, బాపట్లలోని సూర్యలంక బీచ్‌, నాగార్జున సాగర్‌.. రాష్ట్రంలోనే కీలకమైన ఈ పర్యాటక ప్రాంతాల ఏడాది ఆదాయం రూ.12 కోట్లు. అంతటి ఆదాయం ఇచ్చే ప్రాంతాలను ఎవరైనా ఏడాదికి రూ.4.20 కోట్లకు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తారా? ఘనత వహించిన ఏపీటీడీసీ అధికారులు అంతటి ‘ధన’కార్యం చేస్తున్నారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ఈ ప్రాంతాలను తమ అనుయాయులకు తక్కువకే అప్పగించేందుకు హడావుడిగా టెండర్లు పిలవడం, రహస్యంగా ప్రీ బిడ్‌ మీటింగ్‌ నిర్వహించేయడం, వారంలోనే బిడ్ల దాఖలుకు సమయం ఇవ్వడం, అదేరోజు బిడ్లు తెరిచేస్తామని చెప్పేయడం వెనుక లోపాయికారీ ఒప్పందాలు జరిగాయన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ద్వీపంలో దోపిడీ

ఆదాయం రూ.12 కోట్లయితే, లీజుకిచ్చింది రూ.4.20 కోట్లకే..

ప్రీ బిడ్‌కు ముందే సంస్థలతో ఏపీటీడీసీ ఉన్నతాధికారుల మిలాఖత్‌

బయటవారెవరూ రాకుండా రెండు రోజుల్లోనే ప్రీ బిడ్‌ మీటింగ్‌

బిడ్ల దాఖలకు సమయం వారమే.. అదేరోజు ఓపెన్‌

సొంత ప్రయోజనాల కోసం హడావుడిగా టెండర్‌ ప్రక్రియ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : భవానీ ద్వీపం లీజుల వెనుక కొందరు ఏపీటీడీసీ ఉన్నతాధికారుల లోపాయికారీ ఒప్పందాలు వెలుగులోకి వస్తున్నాయి. ద్వీపంతో పాటు హరిత బెర్మ్‌ పార్క్‌ నిర్వహణను ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెట్టే పేరుతో ఆదాయాన్ని ప్రైవేట్‌గా పంచుకునే ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆయా యూనిట్లకు వస్తున్న ప్రస్తుత ఆదాయం కంటే కూడా సగం తక్కువగా కట్టబెట్టేస్తున్నారు. మిగిలిన సగం ఆదాయాన్ని లీజుదారుడు, అవినీతి అధికారులు కలిసి పంచుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. దీనికోసం టెండర్లు పిలవటానికి ముందే బడా వ్యక్తులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. టెండర్లలో ప్రైవేట్‌ ఒప్పందాలు చేసుకున్నవారు మాత్రమే పాల్గొనేలా, మిగిలినవారు పాల్గొనకుండా ఉండేలా తెలివిగా ప్రీ బిడ్‌ మీటింగ్‌, బిడ్ల సబ్‌మిషన్‌ అనే వాటిని కేవలం రోజుల్లోనే పూర్తిచేసేలా గడువు ఇచ్చారు. ఎవరికీ పెద్దగా తెలియకుండా ఉండేలా ఈనెల 20వ తేదీన టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ విషయం ఏపీటీడీసీలో కూడా 23వ తేదీ అంటే.. ప్రీ బిడ్‌ మీటింగ్‌ నిర్వహించిన రోజు వరకు ఎవరికీ తెలియదు. 20వ తేదీన టెండర్లు పిలిస్తే, ప్రీ బిడ్‌ మీటింగ్‌ను 23న నిర్వహించటం గమనార్హం. ముందుగా ప్రైవేట్‌ ఒప్పందాలు చేసుకున్న వారినే ఈ సమావేశానికి పిలిచినట్టు తెలిసింది. ప్రీ బిడ్‌ జవాబులకు కూడా కేవలం రెండే రెండు రోజుల సమయాన్ని ఇచ్చారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు ప్రీ బిడ్‌ రిప్లైస్‌ ఇవ్వాలని నిర్దేశించారు. ఫిబ్రవరి 5న బిడ్లను అప్‌లోడ్‌ చేయాలని, అదేరోజు తెరుస్తామని స్పష్టం చేశారు.

రూ.వేల కోట్ల ఆస్తులు ప్రైవేట్‌ చేతుల్లోకి..

భవానీ ద్వీపం, హరిత బెర్మ్‌పార్క్‌ల నిక ర విలువ దాదాపు రూ.5 వేల కోట్లపైనే. ఇంతటి విలువైన ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టేటప్పుడు ఆచీతూచి వ్యవహరించాలి. రెండు వారాల్లోనే పని ముగించేలా టెండర్లు ఎవరూ పిలవరు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పిలిచేటపుడు ఎక్కడ, ఈ విధమైన హడావుడి చేయరు. ఇంత హడావుడిగా టెండర్లు పిలవటం వెనుక మరెవరూ ఇందులోకి రాకుండా, జోక్యం చేసుకోకుండా ఉండాలనేదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

తక్కువ ఆదాయానికే..

భవానీ ద్వీపం, హరిత బెర్మ్‌పార్క్‌తో పాటు సూర్యలంక, నాగార్జున సాగర్‌ను కూడా కలిపి ఏడాదికి రూ.4.20 కోట్ల లీజుకు ఇచ్చేందుకు ఏపీటీడీసీ అధికారులు టెండర్లు పిలిచారు. ద్వీపం ద్వారా నెలకు రూ.25 లక్షలు, హరిత బెర్మ్‌పార్క్‌ ద్వారా నెలకు రూ.35 లక్షల ఆదాయం వస్తుంది. సీజన్‌లో అయితే రూ.80 లక్షల వరకు ఉంటుంది. కార్తీక మాసం అయితే ఆదాయం రూ.కోటి కూడా దాటుతుంది. సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయాన్ని లెక్కించుకున్నా.. ఏడాదికి రూ.7.20 కోట్ల ఆదాయం వస్తుంది. మరి సూర్యలంక బీచ్‌ ద్వారా ఏడాదికి రూ.3 కోట్లు, నాగార్జున సాగర్‌ ద్వారా ఏడాదికి రూ.కోటి కలిపి రూ.11.20 కోట్ల మేర ఆదాయం వస్తుంది. వీటన్నింటినీ రూ.4.20 కోట్లకే కట్టబెట్టడం వెనుక మర్మమేమిటో అర్థంకాని పరిస్థితి.

ఎవరికీ తెలియకుండా..

ఈ విషయంపై ఉద్యోగ సంఘాల నేతలు.. చైర్మన్‌ వద్ద పంచాయితీ పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన కూడా.. నోటిఫికేషన్‌ గొడవే తనకు తెలియదని, తనకెవరూ సమాచారం కూడా ఇవ్వలేదని, ఉన్నతాధికారులను కనుక్కుని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తానని సముదాయించి పంపినట్టు తెలుస్తోంది.

Updated Date - Jan 25 , 2024 | 12:47 AM