Nara Rammurthy naidu: రామ్మూర్తి నాయుడు మృతిపై ప్రముఖుల సంతాపం
ABN, Publish Date - Nov 16 , 2024 | 03:30 PM
Andhrapradesh: నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, ఏపీ మంత్రి నారాయణ..
అమరావతి, నవంబర్ 16: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు (Nara Rammurthy Naidu) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు (శనివారం) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం 12:45 గంటలకు మృతి చెందినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. రామ్మూర్తి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, ఏపీ మంత్రి నారాయణ రామ్మూర్తి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రామ్మూర్తి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి: సీఎం రేవంత్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. నారా రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రామ్మూర్తి మృతి బాధాకరం: కనకమేడల
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరమని మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఆయన మృతి నారా కుటుంబానికి తీవ్ర లోటన్నారు. రామ్మూర్తి నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని తెలిపారు. ఆయన పార్టీకి చేసిన సేవలు వెల కట్టలేనివని కొనియాడారు. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు కనకమేడల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రామ్మూర్తి మృతి పట్ల మంత్రి నారాయణ సంతాపం
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతికి ఏపీ మంత్రి నారాయణ సంతాపం తెలిపారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కాసేపట్లో ఏఐజీకి చంద్రబాబు
కాగా.. సోదరుడి మరణవార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. మరికాసేపట్లో ఏఐజీ ఆసుపత్రికి ఏపీ సీఎం చేరుకోనున్నారు. రేపు (ఆదివారం) నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరుగనున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సందర్శనార్థం రేపు నారావారిపల్లెలో భౌతికయాన్ని కుటుంబసభ్యులు ఉంచనున్నారు. ఏఐజీ నుంచి పార్థివదేహాన్ని స్వగ్రాహానికి తరలించనున్నారు. రామ్మూర్తి నాయుడు భౌతికకాయానికి నటుడు సుమన్, మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు నివాళులర్పించారు.
రామ్మూర్తి మృతి టీడీపీకి తీరని లోటు: మంత్రి బీసీ జనార్ధన్
సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు మృతి పట్ల రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారా రామ్మూర్తి మృతి.. ఆయన కుటుంబంతో పాటు, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వాలని దేవుని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.
రామ్మూర్తి మృతి మనసును కలిచివేసింది: మంత్రి దుర్గేష్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మరణంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరమని, మనసును కలిచివేసిందన్నారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతూ.. భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని మంత్రి దుర్గేష్ కోరారు. రామ్మూర్తి నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. 1994-1999 మధ్య కాలంలో చంద్రగిరి శాసనసభ్యులుగా రామ్మూర్తి నాయుడు అందించిన సేవలు మరవలేనివని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Adireddy Srinivas:ఆదిరెడ్డి భవానిపై ట్రోల్స్..ఆదిరెడ్డి వాసు వార్నింగ్
AP: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి సర్చ్ వారెంట్.. ఏ క్షణంలోనైనా..
Read Latest AP News ANd Telugu News
Updated Date - Nov 16 , 2024 | 03:50 PM