డ్రెయిన్ల వ్యవస్థ ప్రక్షాళన!
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:57 AM
ఇటీవల వరద ముంపుతో విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారానికి డ్రెయిన్ల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ జి.సృజన తెలిపారు.
వన్‌టౌన్, అక్టోబరు 1 : ఇటీవల వరద ముంపుతో విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారానికి డ్రెయిన్ల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈనెల 3, 4 తేదీల్లో ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంపీ, కలెక్టర్‌తో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్‌చంద్ర, ఆర్డీవో కె.చైతన్య, దక్షిణ మధ్యరైల్వే, ఇతర శాఖల అధికారులతో పారిశుద్ధ్య, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డ్రెయిన్లలో పూడికతీత, పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు మ్యాన్ హోల్ వద్ద తేలియాడే చెత్త తొలగింపు, సుందరీకరణ, సీసీ అప్రోచ్, ఆర్వోబీ, ఆర్యూబీల మంజూరు, నిర్మాణం, ఆక్రమణలు, తదితరాలపై సమావేశంలో చర్చించారు. వర్షాల సమయంలో నీరు సజావుగా పారేందుకు వీలుగా డ్రెయిన్లలో పూడికను యుద్ధప్రాతిపదికన తీసేందుకు రైల్వేతో పాటు వివిధ శాఖల సమన్వయంతో తీసుకోవాల్సిన అంశాలపైనా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార యంత్రాంగం, వీఎంసీ, రైల్వే అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాల్సి ఉందన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రైల్వేతో ముడిపడిన ఉన్న అంశాలలో పురోగతి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. నాలుగు ప్రధాన డ్రెయిన్లపై దృష్టి సారించామని, విజయవాడ అర్బన్ పరిధిలో రైల్వే, వీఎంసీ, ఆర్‌అండ్‌బీ, ఏపీసీపీడీసీఎల్, రెవెన్యూ అధికారులతో ఈనెల 3, 4 తేదీల్లో రూరల్ పరిధిలో 7, 8 తేదీల్లో ఉమ్మడి తనిఖీలు నిర్వహించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ సృజన మాట్లాడుతూ, డిసిల్టింగ్, శానిటేషన్ తదితర పనులకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ (ఎస్‌ఓపి) రూపొందించి దానిప్రకారం పనులు త్వరితగతిన చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రాయనపాడు, కొండపల్లి, ఈలప్రోలు, తదితర ప్రాంతాలకు సంబంధించి ఆర్‌వోబీల ప్రతిపాదనలను సమావేశం ముందు ఉంచినట్టు తెలిపారు. సమస్యల పరిష్కారంపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. సమావేశంలో నందిగామ ఆర్డీవో ఎ.రవీంద్రరావు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్, రైల్వే, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వీఎంసీ, తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 02 , 2024 | 12:57 AM