ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆంజనేయుడి భూమి మాయం

ABN, Publish Date - Nov 17 , 2024 | 01:10 AM

సామాన్యుల ఆస్తులకే కాదు దేవుడి ఆస్తులకూ రక్షణ లేకుండాపోతోంది. విజయవాడ రూరల్‌ మండలం అంబాపురం గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి దేవస్థానానికి చెందిన సుమారు ఎకరం భూమి ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగించేసి ఆ భూమిని కబ్జా చేసేందుకు పావులు కదుపుతున్నారు. దీని విలువ సుమారు రూ.5 కోట్ల పైచిలుకు ఉంటుంది.

మాయమైన భూమిలో షెడ్లు

అంబాపురంలో సర్పంచ్‌ సీతయ్య స్వాహాపర్వం

ఆంజనేయుడి 4.92 ఎకరాల భూమి లీజుకు..

రికార్డులు మాయం చేసి.. 1.10 ఎకరాలు హాంఫట్‌

రూ.5 కోట్ల భూమికి రికార్డులు సృష్టించే పన్నాగం

వైసీపీ నేతగా భూమిని కాజేసి..

ప్రభుత్వం మారడంతో టీడీపీలోకి జంప్‌

ఆయన హస్తం ఉందంటున్న ఆలయ కమిటీ

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : అంబాపురంలోని శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో దూపదీప నైవేద్యాల కోసం దశాబ్దాల క్రితం దాతలు సుమారు 4.92 ఎకరాలు రాసిచ్చారు. ఈ భూమిని కౌలుకు ఇవ్వడం ద్వారా కమిటీ ఆలయ నిర్వహణ చేస్తూ వస్తోంది. అయితే, 2018 వరకు ప్రభుత్వ రికార్డుల్లో 4.92 ఎకరాలు ఉన్న భూమి 2024కు వచ్చేసరికి 3.82 ఎకరాలే మిగిలింది. అంబాపురంలోని సర్వే నెంబరు 47-5లో 4.92 ఎకరాల్లో 1.10 ఎకరాలు మాయమైంది. 2019లో ఈ భూమిని అంబాపురానికి చెందిన గండికోట సీతయ్యకు లీజుకు ఇచ్చినట్లు పాత ఆలయ కమిటీ చెబుతోంది. ఆ తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో 1.10 ఎకరాలు ఎందుకు తగ్గిందో తమకు తెలియదంటోంది. కొత్త కమిటీ సభ్యులు మాత్రం ఆ భూమిని పకడ్బందీగా కబ్జా చేసేందుకే రికార్డుల్లో నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు. 2019లో ఈ భూమిని లీజుకు తీసుకున్న సీతయ్య ఏడాదికి రూ.60 వేలు కౌలు చెల్లిస్తానని అగ్రిమెంట్‌ రాసుకున్నారు. అయితే, రెండేళ్లుగా లీజు చెల్లించడం లేదని ప్రస్తుత కమిటీ సభ్యుల ఆరోపణ.

ఏం జరిగింది..?

ఆలయ భూమి 2018 వరకు 4.92 ఎకరాలుండగా, ఆ తర్వాత 1.10 ఎకరాలు మాయమై కేవలం 3.82 ఎకరాలే రికార్డుల్లో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు చెంతనే ఉన్న ఈ భూమి విలువ ప్రస్తుతం రూ.5కోట్ల పైచిలుకు. ఇంత ఖరీదైన భూమిని రికార్డుల్లో నుంచి తొలగించి వేరే సర్వే నెంబరుతో ప్రైవేట్‌ వ్యక్తుల పేరుతో పట్టా సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. భూరికార్డుల్లో నుంచి ఎకరం మాయం కావడంపై గ్రామస్థులు ఫిర్యాదు చేయగా, అధికారులు సర్వే చేసి 3.82 ఎకరాలే ఉన్నట్టు నివేదిక ఇచ్చారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి..

ఆలయానికి చెందిన ఎకరా భూమిని లీజుకు తీసుకున్న సీతయ్య ఆ తర్వాత వైసీపీ మద్దతుతో పోటీచేసి సర్పంచ్‌ అయ్యారు. వైసీపీ నాయకుల అండతో ఆయన ఆ భూమిని కాజేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా రికార్డుల్లో నుంచి ఎకరా భూమిని మాయం చేసి, ఆ భూమికి కొత్తగా రికార్డులు సృష్టించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈలోగా ఎన్నికలు రావడం, వైసీపీ ఓడిపోయి టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆయన ప్రయత్నాలకు చెక్‌ పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే, ఆయన కూడా పార్టీ మార్చేశారు. టీడీపీలో చేరిపోయారు. ఎకరా భూమికి కొత్తగా రికార్డులు సృష్టించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. ఆలయం నుంచి లీజుకు తీసుకున్న ఎకరా భూమిలో ఆయన భారీ షెడ్లు వేసి టిప్పర్లు, ఎక్స్‌కవేటర్లను నిలుపుతున్నారు. ఆ షెడ్ల నుంచి పంచాయతీకి ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు.

సమగ్ర విచారణ జరపాలి

‘ఆంజనేయస్వామి ఆలయ భూములపై సమగ్ర విచారణ జరపాలి. ఆలయానికి చెందిన భూమిని ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించాలి’ అని ఆలయ కమిటీ అధ్యక్షుడు నక్కబోయిన రాఘవులు కోరుతున్నారు. ఆలయాన్ని దేవదాయ శాఖలో విలీనం చేయాలని కమిటీ తీర్మానం చేసి, త్వరలో దేవదాయ శాఖ అధికారులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 01:10 AM