భక్తజనకీలాద్రి
ABN, Publish Date - Oct 10 , 2024 | 12:41 AM
జనం జనం జనం.. కొండంత జనం క్యూ కట్టింది. క్యూలైన్లు.. ఆలయ పరిసరాలు.. రహదారులు ఎక్కడచూసినా వెల్లువలా కదిలింది. మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చింది.
మూలా నక్షత్రం రోజు భారీగా రాక
అన్ని క్యూలు ఉచితంగా అనుమతి
అర్ధరాత్రి వరకూ తగ్గని రద్దీ
సుమారు 2 లక్షల మంది వచ్చారని అంచనా
మూడు గంటల్లోనే పూర్తయిన దర్శనం
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు కుటుంబం
దుర్గమ్మ సేవలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
విజయవాడ/చిట్టినగర్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో రాత్రి ఒంటిగంట తర్వాత దర్శనాలు మొదలుకావాల్సి ఉండగా, 12 గంటలకే ప్రారంభించారు. క్యూలన్నీ నిండిపోవడంతో పోలీసులు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై వరకు హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేశారు. అన్ని క్యూలను ఉచితంగా వదిలేశారు. భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా అందజేశారు. ఆలయం మూసివేసే సమయానికి సుమారు 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అంచనా. గంటకు 6 వేల నుంచి 7 వేల మంది దర్శనానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. వినాయకుడి గుడి వద్ద క్యూలోకి వెళ్లిన భక్తులకు అమ్మవారి దర్శనం కావడానికి 3 గంటల సమయం పట్టింది. కాగా, దుర్గమ్మకు బుధవారం సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
Updated Date - Oct 10 , 2024 | 07:00 AM