AP Council: మండలిలో రుషికొండ రగడ.. ఆసక్తిగా చూస్తున్న పవన్
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:55 PM
Andhrapradesh: రుషికొండలో నిర్మాణాలకు అనుమతి తీసుకున్నది ఒకటి కట్టింది మరొకటని మంత్రి దుర్గేష్ తెలిపారు. హరిత రిసార్ట్స్ 58 గదులతో ఉండేదని... ఇంతకన్నా అత్బుతమైన నిర్మాణాలు చేస్తామని చెప్పి ప్యాలెస్ కట్టారని.. ఇప్పుడు మొత్తం 7 రూమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. కేటాయింపులు భిన్నంగా భూవినియోగ మార్పిడి జరిగిందని...
అమరావతి, నవంబర్ 19: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. మండలిలోనూ అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం రుషికొండ భవనాలపై మండలిలో వాడీ వేడీ చర్చ జరిగింది. రుషికొండ భవనాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్విదం చోటు చేసుకుంది. అయితే సభ్యుల మధ్య వాగ్విదాలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఆసక్తిగా గమనించారు. రుషికొండపై శాసనమండలిలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ప్రభుత్వం ఏం చేయబోతుంది. ఏ విధంగా వినియోగించబోతుంది. విశాఖ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగమో చెప్పాలి’’ ఎమ్మెల్సీ కోరారు.
Viral Video: పోయే కాలం అంటే ఇదే.. జస్ట్ మిస్.. లేదంటే...
ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా: మంత్రి కందుల దుర్గేష్
రుషికొండలో నిర్మాణాలకు అనుమతి తీసుకున్నది ఒకటి కట్టింది మరొకటని మంత్రి దుర్గేష్ తెలిపారు. హరిత రిసార్ట్స్ 58 గదులతో ఉండేదని... ఇంతకన్నా అత్బుతమైన నిర్మాణాలు చేస్తామని చెప్పి ప్యాలెస్ కట్టారని.. ఇప్పుడు మొత్తం 7 రూమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. కేటాయింపులు భిన్నంగా భూవినియోగ మార్పిడి జరిగిందని... రుషికొండకు ఆపారమైన నష్టం కలిగిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు కోసం అంటూ జీవో విడుదల చేశారన్నారు. ‘‘ రూ.481 కోట్లు ఖర్చుపెట్టారు. మంజూరు చేసిన మొత్తం రూ.451.67 కోట్లు. రూ.434.28 కోట్లు పనులు చేసి అప్పగించారు. వాటి విలువ రూ.409 .39 కోట్లు. ఇప్పటి వరకు రూ.320.3 కోట్లు చెల్లించారు. ఒక బాత్ టబ్ 12 లక్షలు’’ అని తెలిపారు. రోమ్ నగరం తగబడుతుంటే రాజు పిడేలు వాయించినట్లు, ఆయన సొంతం కోసం ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి నిర్మాణం చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చెబుతున్నది అబద్దమా.. కూటమి చెప్తున్నది అబద్దమా.. ఒపెన్ డిబేట్‌కు సిద్ధమంటూ సవాల్ విసిరారు. కావాలంటే వైసీపీ ఎమ్మెల్సీలను తీసుకువెళ్లి చూపిస్తామని అన్నారు. దీనిపైన కోర్టులో కేసులు ఉన్నాయని... కమీటి వేశారని... వాటి తీర్పు కోసం వేచి చూస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు.
బొత్సకూ చూపించలేదు: మంత్రి అచ్చెన్న
రుషికొండ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎవ్వరికీ చూపించలేదని.. గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న బొత్స కూడా ఆ భవనాలను చూడలేదని.. ఇప్పుడొస్తే చూపిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ భవనాలు ఎస్‌ఎఫ్‌టీ 6 వేలకు కట్టారని అప్పట్లో వైసీపీ గగ్గోలు పెట్టిందని.. మరి ఇప్పుడు రుషికొండ ఎస్‌ఎఫ్‌టీ 26 వేల రూపాయలకు కట్టారని.. వాటితో పేదవాడికి 26 వేల మంది ఇళ్లు కట్టోచ్చని చెప్పారు. ఒక వ్యక్తి కోసం ఇంత డబ్బు ఖర్చు చేశారని మండిపడ్డారు. రుషికొండ వస్తానంటే, వైసీపీ నేతలను బస్సు వేసుకుని తీసుకువెళ్తామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి తప్పుచేశారని ఒప్పుకోకుండా ఎదురు దాడిచేస్తున్నారని... ఇది చాలా దారుణమని మంత్రి అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
అది ప్రభుత్వ భవనమే: బొత్స
సభలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాలకు ప్రజా ఆమోదం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. రుషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనమన్నారు. తాజ్ మహాల్ కన్నా బాగుందని కూటమి నేతలే చెప్పారన్నారు. అందులో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలని.. అందులో ఏం పెడతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని అన్నారు. అసెంబ్లీ నిర్మాణానికి చదరపు అడుగుకు 14 వేల రూపాయలు ఖర్చు చేశారని బొత్స తెలిపారు. ‘‘మా హయాంలో నిర్మించిన భవనం ప్రభుత్వ భవనం. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో ప్రభుత్వం ఇష్టం. దమ్ముంటే, రండి చూసుకుందాం అని సభ్యులు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు’’ అని బొత్స అన్నారు.
Viveka Case: ఎంపీ అవినాష్‌కు సుప్రీం నోటీసులు
నేనేమీ వస్తాదును కాను: దుర్గేష్
అయితే బొత్స వ్యాఖ్యలపై మంత్రి దుర్గేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయమంటూ జీవో ఇచ్చారని ఆ జీవో చూపిస్తామనే తాను చెప్పానని మంత్రి దుర్గేష్ సమాధానం ఇచ్చారు. ‘‘చూపిస్తాం రమ్మని చెప్పాను కానీ చూసుకుందాం అని అనలేదు. నేనేమీ వస్తాదును కాదు చూసుకోవడానికి’’ అని మంత్రి దుర్గేష్ అన్న మంత్రి దుర్గేష్ కామెంట్స్ చేశారు.
పెద్దిరెడ్డి పేరు ప్రస్తావన.. వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన
అలాగే మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటనపై మంత్రి సత్య ప్రసాద్ వ్యాఖ్యలపై కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మదనపల్లి అగ్ని ప్రమాదం తర్వాత భూకబ్జాలపై అర్జీలు స్వీకరించామని.. ఆ ఆర్జిల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కువ కబ్జా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయన్న మంత్రి అనగాని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించడంపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రా రెడ్డి పేరును రికార్డుల నుంచి తొలగించాలన్న ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ‘‘విచారణ జరుగుతుంది అన్నారు. విచారణలో ఉన్నప్పుడు పేర్లు ఎలా చెప్తారు. విచారణలో తేల్చాక మాట్లాడండి. ప్రతి ఒక్కరి మీద బురద చల్లడం ఏంటి’’ అని బొత్స ప్రశ్నించారు. దీంతో పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడాలని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు .. సభ్యులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నీటిపారుదల రంగంపై మంత్రి నిమ్మల కామెంట్స్
YS Sunitha: ఏపీ అసెంబ్లీకి వైఎస్ సునీతా రెడ్డి
Real Latest AP News And Telugu News
Updated Date - Nov 19 , 2024 | 02:01 PM