స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకోండి
ABN, Publish Date - Oct 10 , 2024 | 12:26 AM
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మద్యం దుకాణాలకు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకోవచ్చునని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వై.శ్రీనివాసచౌదరి అన్నారు. ఇప్పటివరకూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 236 మద్యం దుకాణాలకుగాను 4633 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు.
ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి
గన్నవరం, అక్టోబరు 9 : ఉమ్మడి కృష్ణాజిల్లాలో మద్యం దుకాణాలకు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకోవచ్చునని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వై.శ్రీనివాసచౌదరి అన్నారు. ఇప్పటివరకూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 236 మద్యం దుకాణాలకుగాను 4633 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 113, కృష్ణాజిల్లాలో 123 షాపులు ఉన్నాయన్నారు. గన్నవరం ఎక్సైజ్ స్టేషన్‌లో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసచౌదరి మాట్లాడుతూ, దరఖాస్తులను మూడు పద్ధతుల్లో చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 8, కృష్ణాజిల్లాలో 8 స్టేషన్‌లలో నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. డీడీలు జతచేసి నిర్ణీత దరఖాస్తు పూర్తిచేసి అందించాలన్నారు. రెండో పద్ధతి పూర్తిగా ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే వీలుందన్నారు. క్రెడిట్, డెబిట్‌కార్డు ద్వారా రూ.2లక్షలు చెల్లించాలన్నారు. మూడో పద్ధతి హైబ్రీడ్ విధానంలో సీఎ్‌పఎంఎ్‌సలో రూ.2లక్షలు చలానా చెల్లించి దాన్ని అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 11వ తేదీ వరకూ పొడిగించినట్టు చెప్పారు. 14వ తేదీన కృష్ణాజిల్లాకు మచిలీపట్నం నోబుల్ కళాశాల, ఎన్టీఆర్ జిల్లాకు ఇబ్రహీంపట్నం శ్రీ స్వర్ణ కళ్యాణ మండపంలో డ్రా తీయటం జరుగుతుందన్నారు. డ్రాలో వచ్చినవారికి లైసెన్స్‌లను కేటాయిస్తామని చెప్పారు. పలుచోట్ల సిండికేట్‌లుగా ఏర్పడి ఇతరుల దరఖాస్తులు వేయకుండా అడ్డుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎక్కడైనా దరఖాస్తుదారులను బెదిరించిన, అడ్డగించినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సదరు వ్యక్తులకు పోలీస్ భద్రత కల్పించి స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ యు.సుబ్బారావు, ఎక్సైజ్ సీఐ డి.సురేఖ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 10 , 2024 | 12:26 AM