దైన్యస్థితిలో గురుకుల పాఠశాల
ABN, Publish Date - Nov 13 , 2024 | 01:07 AM
పేదల పిల్లలంటే అందరికీ అలుసే.. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుకునేందుకు వచ్చే వారిపై అక్కడి సిబ్బంది తీరు అమానుషం. అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలను ఉంచుతారా అని విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బందిని నిలదీస్తున్నారు.
ప్రశ్నించిన విద్యార్థినులపై ఉపాధ్యాయుల జులుం
మరుగుదొడ్లు శుభ్రం చేయాలని హుకుం
ఎక్కడి చెత్త అక్కడే.. ప్రిన్సిపాల్ నిర్లక్ష్య ప్రవర్తన
పిల్లల పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళన
(గుడివాడ/గుడివాడరూరల్ ఆంధ్రజ్యోతి)
గుడివాడ మండలం మోటూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా నిలిచింది. పాఠశాలలో కనీస వసతులు లేవని.. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయని.. భోజనంలో పురుగులు వస్తున్నాయని.. మరుగుదొడ్లకు తలుపులు లేవని, ఆవరణలో చెత్తను తొలగించాలని.. ట్యాప్‌లో నీళ్లు రావడం లేదని.. ఇలాంటి సమస్య ఏదైనా చెబితే వారి పరిస్థితి అంతే. ప్రశ్నించిన వారే మరుగుదొడ్లను కడగాలి. పై అంతస్తుకు నీటిని తీసుకువెళ్ళాలి. 100 గుంజీలు తీయాలి. ఈ శిక్షలను ఇక్కడి విద్యార్థునులపై అమానుషంగా అమలుచేస్తుంటారు. పిల్లల పట్ల ప్రిన్సిపాల్ సహా ఉపాధ్యాయులు క్రూరంగా ప్రవర్తిస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు బాధలు చెప్పుకుంటే ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వారిపై విరుచుకుపడతారు. సమస్యలను పరిష్కరించకుండా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యధోరణిగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం హడావుడి చేయడం, సమస్యను పక్కదారి పట్టించి చేతులు దులుపుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం బాలికా విద్యను ప్రోత్సహిస్తూ వారికోసం ప్రత్యేకంగా వసతిగృహాలు, గురుకులాలను ఏర్పాటు చేసింది. అక్కడ మౌలిక వసతులను కల్పించి ఆహ్లాదకర వాతావరణంలో నాణ్యమైన విద్యాబోధన ఉండాలని ఏర్పాట్లు చేసింది. ఇదే క్రమంలో మోటూరులో బాలికల గురుకుల పాఠశాల ప్రారంభించింది.
ఎక్కడ చూసినా చెత్తే..
గురుకుల పాఠశాలలో ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తున్నది. అపరిశుభ్ర వాతావరణంతో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురువుతున్నారు. వంటశాల, షింక్‌లలో ఆహార వ్యర్ధాలను తొలగించకపోవడంతో డైనింగ్ హాల్ కంపుకొడుతోంది. మరుగుదొడ్ల పరిస్ధితి మరీ దారుణం.. తలుపులు లేక తీవ్ర దుర్గంధంతో విద్యార్థినులు బెంబేలెత్తిపోతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతో మరుగుదొడ్లను పిల్లలతోనే కడిగిస్తున్నారు. పాఠశాల తరగతి, వసతి గదుల వద్ద పెద్దఎత్తున చెత్త దర్శనమిస్తున్నది. ఆహారంలో పురుగులు వస్తున్నాయని చెబితే ఎవరికీ రాని పురుగులు నీకే వచ్చాయా.. అంటూ పిల్లలను గదమాయిస్తుండటంతో చేసేది లేక నోరు కట్టేసుకుంటున్నారు.
ఫ నోరు తెరిచి అడిగితే ఆ శిక్షలే వేరు..
తాగునీరు రావడం లేదంటే ఫిర్యాదు చేసిన వారే నీళ్లను మోసుకువెళ్లాలి. పాఠశాలలో విద్యార్థినులపై జరుగుతున్న దాష్టీకాలను బయటకు చెబితే వీపు విమానం మోగుతుంది. కనీసం తమ అవస్థలను తల్లిదండ్రులకు కూడా చెప్పుకోవడానికి వీలు లేదు. చెబితే ఉపాధ్యాయులే శిక్షలు అమలు చేస్తుంటారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కనీస వసతులు లేవని అడిగినందుకు 100గుంజీల శిక్షను విధించినట్టు భోరున విలపించారు. విద్య బాగానే ఉన్నా ఉపాధ్యాయులు విధించే శిక్షలను తట్టుకోలేకపోతున్నామని కన్నీటిపర్యాంతమవుతున్నారు.
ఫ గుడివాడ నుంచి ఉపాధ్యాయులు..
నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉపాధ్యాయులు గురుకులంలోనే నివాసముండాలి. కానీ ఇక్కడ ఎవరూ పాటించడం లేదు. అధిక శాతం ఉపాధ్యాయులు గుడివాడ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. పాఠశాలపై పర్యవేక్షణ కొరవడటంతో ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ఫ మిగిలిన ఆహారాన్ని అమ్మేస్తున్నారు!
గురుకులంలో పిల్లలు తినగా మిగిలిన ఆహారాన్ని సైతం అమ్ముకుంటున్నట్టు సమాచారం. వీటిని తీసుకువెళ్లేందుకు శేరీగొల్లేపల్లికి చెందిన చేపలచెరువు రైతు ప్రతి నెల రూ.30వేలు చెల్లిస్తున్నట్టు గ్రామంలో గుసుగుసలు వినవస్తున్నాయి.
ఫ తల్లిదండ్రుల ఆగ్రహం
గురుకులంలో గత ఆదివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. తమ పిల్లలు పడుతున్న బాధలు, కష్టాలు తెలుసుకుని వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులను నీలదీశారు. తమ పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తారా అని నిలదీశారు. కొందరు అక్కడి మరుగుదొడ్ల పరిస్థితి, అపరిశుభ్ర వాతావరణాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయిన పరిస్థితిలో మార్పు రాలేదు.
ఫ విద్యాశాఖ అధికారుల తనిఖీలు..
సామాజిక మాధ్యమాల ద్వారా దారుణాలను తెలుసుకున్న విద్యాశాఖాధికారులు మోటూరు గురుకులానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. అక్కడి పరిస్థితులు, పిల్లల అవస్థలను చూసి అవాక్కయ్యారు. అపరిశుభ్ర వాతావరణంలో తమ చిన్నారులు రోగాల బారినపడే ప్రమాదముందని గుర్తించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తనిఖీలకు వచ్చిన ఎంఈవోలు విజయ్, బాలాజీలు తెలిపారు.
ఫ ఎవరికి చెప్పినా పట్టంచుకోవడం లేదు..
- పేరెంట్స్ కమిటీ చైర్మన్ మొవ్వ అనీల్
గురుకులంలో అపరిశుభ్ర వాతావరణంపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. తరచు పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారు. ఆహార వ్యర్ధాలను నాలుగు రోజులుగా తొలగించడంలేదు. అధికారులు తక్షణమే బాధ్యులపై చర్యలు చేపట్టాలి.
Updated Date - Nov 13 , 2024 | 01:07 AM