జనసేనలో చేరిక
ABN, Publish Date - Oct 20 , 2024 | 02:03 AM
జగ్గయ్యపేట పురపాలకసంఘంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి నామమాత్రంగా మిగిలిపోయింది.
జగ్గయ్యపేటలో నామమాత్రంగా మిగిలిన వైసీపీ
వైస్‌చైర్మన్ ప్రభాకర్ సహా 10 మంది కౌన్సిలర్లకు కండువా కప్పిన జనసేనాని
అదేబాటలో ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు
జగ్గయ్యపేట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జగ్గయ్యపేట పురపాలకసంఘంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి నామమాత్రంగా మిగిలిపోయింది. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో శనివారం మునిసిపల్ వైస్‌చైర్మన్ తుమ్మల ప్రభాకర్‌తో పాటు వైసీపీ కౌన్సిలర్లు కొలగాని రాము, కాశీ అనూరాధ, కాటగాని శివకుమారి, తన్నీరు నాగమణి, సాదుపాటి రాజు, పాకాలపాటి సుందరమ్మ, మోరె సరస్వతి, షేక్ సిరాజున్ సత్తార్, పం దుల రోశయ్య, కోఆప్షన్ సభ్యులు షేక్ ఖాదర్ బాబు, చైతన్య శర్మలు డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేనాని పవన్‌కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఒక్కొక్కరికి పవన్ పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతు సామినేని ఉదయభాను క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, ఆయన మీద అచంచెల విశ్వాసంతోనే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. వైస్‌చైర్మన్ తుమ్మల ప్రభాకర్, ఇతర కౌన్సిలర్లు మాట్లాడుతు ఉదయభాను అడుగు జాడలలో పనిచేసి జనసేన బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
పాలకపక్షం నుంచి నామమాత్రంగా వైసీపీ
31 మంది కౌన్సిలర్లు ఉన్న పురపాలకసంఘంలో 18 మంది సభ్యుల తో అధికారపక్షంగా ఉన్న వైసీపీ మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘ వేంద్రతో పాటు ముగ్గురు కౌన్సిలర్లు పి.సీతారావమ్మ, గింజుపల్లి వెంక ట్రావు, డి.రమాదేవిలు తెలుగుదేశం పార్టీలో గత సెప్టెంబరు 13న చేర టంతో వైసీపీ అధికారాన్ని కోల్పోయి, టీడీపీ పాలకపక్షంగా అవతరిం చింది. 13 మంది టీడీపీ సభ్యులకు నలుగురు తోడు కావటంతో టీడీపీ బలం 17 కాగా, వైసీపీ బలం 17 నుంచి 13కు పడిపోయింది. మిగిలిన 13 మందిలో 10 మంది జనసేనలో చేరగా, ఉదయభాను కుమారుడు వెంకటకృష్ణ ప్రసాద్‌తో కలుపుకొంటే 11 మంది జనసేన సభ్యులు అయ్యారు. వైస్ చైర్మన్ షేక్ హఫీజున్నీసా ఫిరోజ్‌తో పాటు కౌన్సిలర్ వట్టెం మనోహర్ వైసీపీలో కొనసాగాలని నిర్ణయించారు. మొత్తంగా పురపాలకసంఘంలో జనసేన-టీడీపీ కూట మి బలం 29కు చేరింది. ఇద్దరు సభ్యులతో వైసీపీ నామమాత్రంగా మిగిలింది.
Updated Date - Oct 20 , 2024 | 02:04 AM