మూలా నక్షత్రం.. క్యూలు కిటకిట
ABN, Publish Date - Oct 10 , 2024 | 12:24 AM
శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత కీలకమైన మూలా నక్షత్రం నాడు ఎలాంటి వివాదాలు, ఆటంకాలు లేకుండా భక్తులు దుర్గమ్మను సరస్వతీ అలంకారంలో దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళిక, పోలీసు, రెవెన్యూ, దేవదాయశాఖల మధ్య సమన్వయం కారణంగా సామాన్య భక్తులు సైతం తమకు అసౌకర్యం కలిగిందని ఎక్కడా ఫిర్యాదులు రాకపోవడం విశేషం.
ఫలించిన ముందస్తు ప్రణాళికలు
శాఖలన్నీ సమన్వయం.. పదేళ్లలో మంచి ఫలితం
ఏర్పాట్లు బాగున్నాయని సీఎం కితాబు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/వన్‌టౌన్) : శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత కీలకమైన మూలా నక్షత్రం నాడు ఎలాంటి వివాదాలు, ఆటంకాలు లేకుండా భక్తులు దుర్గమ్మను సరస్వతీ అలంకారంలో దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళిక, పోలీసు, రెవెన్యూ, దేవదాయశాఖల మధ్య సమన్వయం కారణంగా సామాన్య భక్తులు సైతం తమకు అసౌకర్యం కలిగిందని ఎక్కడా ఫిర్యాదులు రాకపోవడం విశేషం. మూలానక్షత్రంనాడు అన్ని టిక్కెట్ దర్శనాలను ఉచితం చేశారు. లక్షల్లో అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు రూపొందించటంలో.. క్యూలైన్ల క్రమబద్ధీకరణలో అన్ని శాఖలు విజయం సాధించాయి.
అర్ధరాత్రి నుంచే భారీగా భక్తులు..
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం అర్ధరాత్రి నుంచే భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అసాధారణంగా దర్శనాలు జరిగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా వ్యవస్థలన్నీ ఏమాత్రం ఏమరపాటుగా లేకుండా వ్యవహరించడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. కార్పొరేషన్ దగ్గర నుంచి కంటెయినింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో భక్తులను ఈ ప్రాంతంలో హోల్డింగ్ చేశారు. ఆ తర్వాత క్యూలైన్లలోకి పంపారు. క్యూలలో తొక్కిసలాటను నివారించటానికి వీలుగా రోపులతో నిర్ణీత దూరం వరకు భక్తులను హోల్డ్ చేశారు. ఇలా రోజంతా హోల్డ్ చేయటం వల్ల ఎక్కడా తొక్కిసలాటకు అవకాశం ఇవ్వలేదు. మూలా నక్షత్రం రోజున గతంలో అమ్మవారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ ఏడాది అనధికార దర్శనాలను పూర్తిగా నియంత్రించటంవల్ల కేవలం గంటన్నర వ్యవధిలోనే భక్తులు అమ్మ దర్శనం చేసుకున్నారు. క్యూలలో ఎలాంటి అసౌకర్యాలు కలగలేదు. భక్తుల డిమాండ్‌కు అనుగుణంగా మంచినీళ్ల ప్యాకెట్లను సిద్ధం చేశారు. లడ్డూ ప్రసాదాలను ముందస్తుగా సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల ఎలాంటి కొరతా ఏర్పడలేదు. ఈసారి రూ. 100కి ఆరు లడ్డూల ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకురావటంతో వీటిని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. కొండ దిగువన భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి వీలుగా ఏర్పాట్లు ఉండటంతో స్వేచ్ఛగా పూర్తి చేసుకున్నారు. మూలా నక్షత్రం రోజున ఎలాంటి సమస్యలు లేకపోవడంతో దేవస్థాన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి తోడు వాతావరణం మేఘావృతంగా ఉండటంతో పాటు తుంపర చినుకులు పడటం వల్ల కూడా భక్తులు చల్లటి వాతావరణంలో దుర్గమ్మ దర్శనం చేసుకోగలిగారు. ఉదయం రెండు గంటల పాటు విపరీతమైన ఎండ వేసినా ఆ తర్వాత ఒక్కసారిగా నగరం మేఘావృతమైంది. ఓ భక్తురాలిపై పోలీసు అధికారి చేయిచేసుకోవటం తప్పితే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. అనధికారిక దర్శనాలను పూర్తిగా నిలువరించగలిగారు. దేవస్థాన సిబ్బంది కొంతమేర అనధికార దర్శనాలు చేయించే ప్రయత్నం చేసినా.. చాలావరకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం వాటిని సమర్ధవంతంగా అడ్డుకోగలిగింది. దీంతో దసరా ఉత్సవాలు మూలా నక్షత్రం రోజున ప్రశాంతంగా జరిగాయి. ఘాట్ మార్గాలు, కొండ దిగువన కార్పొరేషన్ పారిశుధ్య సిబ్బంది సేవలు అందించారు. గతంలో మాదిరిగా చెప్పుల కుప్పలు కనిపించలేదు. దసరా ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ఈ ఫీడ్‌బ్యాక్‌లో భక్తులు సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చారు. సౌకర్యాలకు సంబంధించి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించటానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫీడ్ బ్యాక్ వివరాలను ప్రకటించి చాలా సంతృప్తిగా ఉందని చెప్పారు. మూలానక్షత్రం రోజున భక్తుల ఫీడ్ బ్యాక్ చూస్తే క్యూలైన్ల పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగితే 85 శాతం మేర సంతృప్తిగా ఉందని భక్తులు సమాధానం ఇచ్చారు. ఆలయ అలంకరణ ఏర్పాట్లకు సంబంధించి 92 శాతం ఫీడ్‌బ్యాక్ వచ్చింది. పారిశుఽధ్యానికి సంబంధించి 87 శాతం, మంచినీటి బాటిళ్లు - వాటర్ ప్యాకెట్ల పంపిణీకి సంబంధించి 95 శాతం, ఉభయదాతల పూజలకు సంబంధించి 94శాతం, వృధ్ధులు - వికలాంగుల సేవలకు సంబంధించి 94శాతం లడ్డూ ప్రసాదాలకు సంబంధించి 93 శాతం, కేశఖండన సేవలకు సంబంధించి అత్యధికంగా 96శాతం మేర భక్తులు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు.
పల్లకీలో ఊరేగిన ఆది దంపతులు..
లబ్బీపేట: వేలాది భక్తజనం మధ్య అదిదంపతులు పల్లకిలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. లక్షలాదిగా భక్తులు క్యూ నుంచే నగరోత్సవాన్ని కన్నుల పండువగా తిలకించారు. కనకదుర్గానగర్ నుంచి ఘాట్‌రోడ్ మీదుగా ఊరేగింపు ఉత్సవం దేవస్థానంకు చేరుకుంది. దుర్గఘాట్‌లో కృష్ణమ్మ హరతులు చూసి భక్తులు తరించారు. మూల నక్షత్రం కావడంతో భారీగా విచ్చిన భక్తులు కృష్ణమ్మ హరతులను తిలకించి పులకించారు.
మంగళవారం నాటి ఆదాయం రూ.69.02లక్షలు
వన్‌టౌన్ : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మవారి దసరా మహోత్సవాలు మంగళవారం నాటికి ఆరు రోజులు ముగిశాయి. మంగళవారం శ్రీమహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా రూ.500 టెక్కెట్ల ద్వారా రూ.28,95,500, రూ.300 టిక్కెట్ ద్వారా రూ.7,05,300, రూ.100 టిక్కెట్ ద్వారా రూ.5,56,900 ఆదాయం సమకూరింది. 35,018 లడ్డూల ద్వారా రూ.5,25,270, ఆరు లడ్డూలు ప్యాకెట్ల ద్వారా రూ.20,02,200లు ఆదాయం సమకూరింది. పరోక్ష ప్రత్యేక కుంకుమార్చన రూ.3000 టికెట్ ద్వారా రూ.60వేలు, రూ.5000 టికెట్ ద్వారా రూ.30వేలు, పరోక్ష ప్రత్యేక చండీహోమం రూ.4వేల టికెట్ ద్వారా రూ.40వేలు, పత్యేక ఖడ్గమాల టిక్కెట్ ద్వారా రూ.5,116లు, పబ్లికేషన్‌లు, ఫోటోలు, క్యాలెండర్ల ద్వారా రూ.5,112లు ఆదాయం సమకూరింది. తలనీలాల సమర్పణ రుసుము రూ.40 టిక్కెట్ ద్వారా రూ.77,560లు ఆదాయం వచ్చింది. మొత్తంగా కనకదుర్గమ్మవారికి రూ.69,02,958లు ఆదాయం సమకూరింది.
Updated Date - Oct 10 , 2024 | 12:24 AM